Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గర్భిణీ మహిళల డైట్ ప్లాన్ ప్లస్ ఎక్సర్‌సైజ్‌ గురించి..?

గర్భిణీ మహిళల డైట్ ప్లాన్ ప్లస్ ఎక్సర్‌సైజ్‌ గురించి..?
, సోమవారం, 22 సెప్టెంబరు 2014 (16:36 IST)
గర్భంగా ఉండే మహిళలు మానసికంగానూ, శారీరకంగానూ ఆరోగ్యంగా ఉండాలని గైనకాలజిస్టులు అంటున్నారు. దీనికి తోడు పోషకాలతో కూడిన ఆహారం, వ్యాయామం గర్భిణీ మహిళలకు చాలా అవసరమని వారు సూచిస్తున్నారు. 
 
గర్భకాలాన్ని మూడు త్రైమాసికాలుగా విభజించవచ్చు. తొలి మూడు నెలలు వేవిళ్ళు, కళ్ళు తిరగడం, నీరసం వంటి సమస్యలుంటాయి. ఎక్కువ ఆహారం తీసుకోవాలంటేనే అస్సలు నచ్చదు. ఇలాంటి సమయంలో దానిమ్మ జ్యూస్, నిమ్మరసం వంటివి తీసుకోవాలి. జ్యూస్ తీసుకున్న అరగంట తర్వాత ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తే వేవిళ్ళను నిరోధించవచ్చు. 
 
4-6నెలల కాలంలో గర్భస్థ శిశువు పెరగడం ఆరంభిస్తుంది. అందుచేత శిశువుకు చేర్చి తల్లి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆహారం మోతాదును గర్భిణీ మహిళలు పెంచాల్సి వుంటుంది. తల్లి తీసుకునే ఆహారమే గర్భస్థ శిశువు పెరుగుదల, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. 
 
ఈ సమయంలో క్యాల్షియం, ఐరన్, విటమిన్స్ పుష్కలంగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, రొయ్యల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందుచేత రోజు మూడు గ్లాసుల పాలైనా తీసుకోవాలి. ఆకుకూరలు, ఖర్జూరం, రాగిని డైట్ ప్లాన్‌లో చేర్చుకోవాలి. విటమిన్ సి కలిగిన ఉసిరిని రోజుకొకటి తీసుకోవాలి. వీటితో పాటు అన్ని రకాల కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, బాదం, పిస్తా, ఆక్రూట్, శెనగలు, చేపలు, కోడిగుడ్లు తీసుకోవచ్చు. ఇవి గర్భస్థ శిశువు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. కానీ గర్భకాలంలో కొవ్వు పదార్థాలను తీసుకోవడాన్ని నివారించాలి. ఇంకా గర్భిణీ మహిళలు తమ సాధారణ బరువు కంటే 10 నుంచి 12 కిలోల వరకు పెరిగితే సరిపోతుంది. అంతకుపైగా బరువు పెరగడం ఊబకాయానికి దారితీస్తుంది. 
 
చివరి మూడు నెలల్లో గర్భస్థ శిశువు పూర్తిగా పెరుగుతుంది. ఈ కాలంలో తల్లి శరీరంలో కావలసినంత నీటి శాతం ఉండాలి. కాళ్ళు, చేతులు ఊదినట్లు కనిపిస్తాయి. అయినా నీరు తీసుకోవడాన్ని తగ్గించకూడదు. ఉప్పును తగ్గించుకోవాలి. 
 
రాత్రి పూట తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. రసం అన్నం, పాలన్నం తీసుకోవాలి. నిద్రపోయే ముందు.. ఒక గ్లాసు పాలు లేదా పండు తీసుకోవాలి. వీటితో పాటు వ్యాయామం చేయాలి. రోజుకు అరగంట పాటు నడవాలి. ఒకేసారి కాకుండా మార్నింగ్ 15 , ఈవెనింగ్ 15 నిమిషాల పాటు నడవడం చేయొచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu