దక్షిణ భారతదేశంలో అతి తేలికగా అందరి పెరటి తోటల్లోనూ పెంచుకోగల, అధిక పోషకవిలువలు గల కాయలను అందిస్తున్న వృక్షం మునగ. దీని శాస్త్రీయ నామం మొరింగా ఓలియా ఫెరా. దీన్ని మదర్స్ బెస్ట్ ఫ్రెండ్ అని కూడా అంటారు. మునగకాయను కేవలం సువాసనకు, రుచికి మాత్రమే మన వంటకాల్లో వాడుతుండటం మనకు తెలుసు.
అయితే మునగ చెట్టులో ఆకులు, కాయలు, పుష్పాలు, బెరడు వంటి పలు భాగాలు ఇటు మానవులకు, అటు జంతువులకు కూడా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. పోషక విలువలు అధికంగా కలిగిన ఈ మునగ చెట్టుతో సమాజానికి కలుగుతున్న ఉపయోగాల తీరుతెన్నులను మనం చూద్దామా.... ముఖ్యంగా రక్తలేమికి అతి తరచుగా గురవుతుండే మహిళలకు మునగ ఆకు, కాయ, పువ్వుతో చేసే కూరలు చాలా ఉపయోగపడతాయి.
మునగ కాయలు....
రోగనిరోధక వ్యవస్థను, చర్మాన్ని మునగ కాయలు గట్టిపరుస్తాయి. బలహీనపడ్డ ఎముకలను గట్టిపర్చి, రక్తహీనతను పోగొట్టి తల్లికి బిడ్డకు అవసరమైన పోషణను ఇవి అందిస్తాయి. రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులను అరికట్టడమే కాక తలపోటును నివారిస్తాయి.
రాయలసీమ పల్లెల్లో విరివిగా పండే ఈ మునగ కాయల సీజన్‌లో కాయలను పెద్ద మొత్తంలో ఉడికించి దానికి వేరుసెనగ పొడి చల్లి పేపుడుగా చేసి కుటుంబ సభ్యులకు పళ్లేల్లో కాయముక్కలను వడ్డించి తినిపిస్తారు. సాయంత్రం పూట టిఫన్ లేదా బజ్జీలకు బదులుగా మునగ కాయలను గృహిణులు ప్లేట్లలో పోసి వడ్డించేవారు. వేయించిన మునగ కాయ తోలు, గుజ్జు, గింజ అన్నీ పోషక విలువలు కలిగి ఉండేవే. పైగా ప్లేట్లోని కాయలు మిగుల్చకుండా తినే పద్ధతిని అలవాటు చేసేవారు.
ఈ కాలంలో లాగా సుతారంగా కూరలో ఉడికిన మునగకాయ గుజ్జును మాత్రం చేతితో తీసుకుని కాయను పారవేయడం కాకుండా కాయను పూర్తిగా నమిలి పిప్పి అయేంతవరకూ తింటే కాయలోని తోలుకుండే పోషక నిల్వలు శరీరానికి అందడమే గాక పంటి చిగుళ్లు గట్టిపడతాయి.
మునగ ఆకులు...
మునగ ఆకులను కూరగా ఉపయోగిస్తారు. ఇతర ఆకుకూరలు లభ్యంకాని డ్రై సీజన్‌లో కూడా ఇది లభ్యం కావడం విశేషం. ఈ ఆకుల్లో కొవ్వు పదార్ధాలూ, కార్బొహైడ్రేట్లూ తక్కువే గాని, ఖనిజాలు, ఐరన్, విటమిన్ బి వంటివి అధికంగా ఉంటాయి. ఆకులను ఆవిరిలో ఉడికించి వేరుశెనగ పొడి కలపి వేయించి అన్నంలో కూరగా గాని, వేపుడుగా కాని తింటుంటారు. మునగాకు అపాన వాయువును నిరోధిస్తుంది.
వీటి ఆకులతో అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలను, డయేరియాను నివారించవచ్చు. తాజా ఆకులతో తయారు చేసిన కషాయం ఎక్కువ లోతుగా లేని గాయాలనుంచి వచ్చే రక్తస్రావాన్ని ఆపుతుంది. అలాగే ఆకులను నలిపి వంటపాత్రలు, నేల, గోడలు శుభ్రం చేయడానికి క్లీనింగ్ ఏజెంట్‌గా వాడవచ్చు. మునగాకులను మన పశువులకు ఆహారంగాను, చర్మ ఇన్‌ఫెక్షన్‌లకు యాస్ట్రింజెంట్‌గా కూడా ఉపయోగించవచ్చు.
మునగ పూలు...
మునగ పుష్పాలను కూరగా, వేపుళ్లుగా చేసుకుని చాలామంది భుజిస్తుంటారు. వీటిపుష్పాలను కొంత సేపు నానబెట్టి జలుబు నివారణ ఔషధంగా కూడా వాడతారు. మునగ పుష్పాల రసం మూత్రకోశ, మూత్ర నాళాల సంబంధ సమస్యలను నివారిస్తుంది. మునగపూలలో లభించే టెరినో స్పెర్మిస్ అనే యాంటీ బయోటెక్‌ను ఫంగిసైడల్ సమ్మేళనంతో చర్మంపై ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌ల నివారణ చర్యల్లో వాడుతుంటారు.
మునగ గింజలు...
మునగ గింజల్లో ఆలివ్ ఆయిల్‌తో సమానమైన ఓలిక్ ఆమ్లం 75 శాతం దాకా లభిస్తుంది. ఈ ఆయిల్‌ను సబ్బులు, సుగంధ ద్రవ్యాల తయారీలో, వాచ్‌లలో కందెనగా కూడా ఉపయోగిస్తుంటారు. ఈ నూనె పులవదు, వేడి చేసినప్పుడు పొగ ఏర్పడదు.
మురికిగా ఉండే నదీ జలాలను శుభ్రపర్చడానికి వీటి గింజల పౌడరును వాడతారు. నీటిలోని బాక్టీరియాను కూడా ఈ గింజలను ఉపయోగించి తొలగించవచ్చు. అర్థరైటిస్, రుమాటిజం గౌట్ లైంగికంగా సంక్రమించే వ్యాధుల చికిత్సలో మునగ గింజలు ఎంతగానో ఉపకరిస్తాయి. మునగ గింజల కేక్‍లో అధికస్థాయి ప్రొటీన్‌లు ఉంటాయి. కనుక వ్యవసాయంలో మంచి ఎరువుగా ఇది ఉపయోగపడుతుంది.
మునగ జిగురు, బెరడు....
అలాగే మునగ చెట్టు జిగురును క్యాలికో ప్రింటింగులోనూ, ఔషధాల తయారీలోనూ తటస్థకారకంగా ఉపయోగిస్తారు. మునగ కలప గుజ్జునుంచి మంచి న్యూస్ ప్రింట్ కాగితాన్ని తయారు చేయవచ్చు. ఈ గుజ్జును బయోమాస్‌గా కూడా ఉపయోగించవచ్చు. మునగ బెరడు, గమ్‌ను తోలు పరిశ్రమల్లో చర్మాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నారు.
కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉంటున్న మునగ చెట్టును నిర్లక్ష్యం చేయవద్దు. ఏ నేలలో అయినా సులువుగా పెరిగే మునగ చెట్టును ఇంటి పెరడులో నాటి పెంచుకోగలిగితే మూడు నెలలు అత్యంత పోషకవిలువలను మనం పొందవచ్చు. పైగా మునగాకును సంవత్సరమంతా వాడుకోవచ్చు కూడా. మహిళలకు, పిల్లలకే కాక మనుషులందరికీ బలవర్థమైన ఆహార విలువలను మునగ చెట్టుద్వారా పొందవచ్చు.