Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉప్పుతో చెలగాటమాడవద్దు...

Advertiesment
మహిళ ఆహారం రక్తపోటు ఉప్పు భోజనం రుచి అనారోగ్యం జీవనశైలి వైద్య ప్రపంచం మార్పు అన్నం కూర రసం తగ్గింపు చిరుతిండ్లు
, గురువారం, 18 సెప్టెంబరు 2008 (18:19 IST)
ఉప్పు తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టడం చాలా పాపం అనేది పాత సామెత అయిపోయింది. ప్రపంచంలోనే అతి చవక వస్తువు అయిన ఉప్పే మనుషులకు పరాయిదైపోయే కాలం వస్తే... భోజనంలో రుచికోసం కలుపుకునే ఆ ఉప్పే ప్రాణాంతకంలా మారి మనిషిని భయపెడితే... దానికి మరోపేరే రక్తపోటు..

ఒకటి మాత్రం నిజం.. ఇది మందులతో మాత్రమే తగ్గేది కాదని ఎప్పుడో తేలిపోయింది. జీవనశైలిలో కొద్దిగా అయినా మార్పులను అలవాటు చేసుకోకపోతే రక్తపోటు తగ్గడం అసంభవమని వైద్య ప్రపంచం కోడై కూస్తోంది. మనం సజావుగా తీసుకుంటున్న ఉప్పును సైతం మనఃపూర్వకంగా మనకు మనమే తగ్గించుకోవడానికి ప్రయత్నించడం కూడా జీవన శైలిలో మార్పుకు సంకేతమే మరి.

అలాగని ఉప్పు తగ్గించడం అంటే అన్నంలోనూ, కూరలోనూ, రసంలోనూ వేసుకుని తినే ఉప్పును తగ్గించడం అని కాదు అర్థం. ఇక్కడే చాలా మంది పొరపాటు చేస్తుంటారు. మార్కెట్లో చిరుతిండ్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు కొనేటప్పుడు వాటిపై ఉండే వివరాలు ఎంతమంది చదివి ఎంచుకుంటున్నారో పరిశీలించుకోవాలి. బయట మనకు కనబడే సవాలక్ష పదార్థాల్లో ఉప్పు వేటిలో తక్కువగా ఉందో వాటినే కొనుక్కోవాలి.

వంటింటిలోకి ఉప్పు ఎక్కువ ఉన్న పదార్ధాలు చేరకుండా చూసుకోవడం చాలా అవసరం. వంటకాల్లో సుగంధ ద్రవ్యాలు ఎక్కువగా చేర్చి వాడితే ఉప్పును తగ్గించి తీసుకోవడం తేలికవుతుంది మరి.

గుండె ఆరోగ్యాన్ని పదిలపర్చుకునేందుకు అసంతృప్త ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వెన్న బదులు ఆలివ్ నూనె, కొవ్వు శాతం తక్కువగా ఉండే పాల ఉత్పత్తుల వంటివి తీసుకోవాలి.

శరీరం బరువును సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. క్రమం తప్పని వ్యాయామంతో పాటు అన్నివేళలా చురుగ్గా ఉండేందుకు ప్రయత్నించాలి. లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కుతూ దిగడం, సమీప ప్రాంతాలకు బండి బయటకు తీయకుండా నడిచి వెళ్లడం వంటివి రక్తపోటు అదుపుకు చక్కటి మార్గాలు.

పోటాషియం పుష్కలంగా ఉండే తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. బిస్కెట్లు ఇతర చిరుతిండ్లకు బదులు రోజూ అయిదు సార్లు పండ్లు తినగలిగే స్తోమత ఉంటే మరీ మంచిది. రక్తపోటు అదుపుకు ఇది చాలా మంచి పద్దతి.

భోజనంలో వాడే ఉప్పును కొలిచేందుకు పాతరోజుల్లో గోరెడు, చిటికెడు చారెడు వంటి చేతి కొలమానాలను ప్రయోగించేవారు. ఇప్పుడు ఇవి కూడా ఆరోగ్యానికి ప్రమాదకారులుగా మారుతున్నాయి. కాబట్టి పాత సామెతను మనం కాస్త మార్చుకుంటే మంచిదేమో కదూ..

'దేనితో అయినా పెట్టుకోండి కాని ఉప్పుతో మాత్రం చెలగాటమాడవద్దు...'

Share this Story:

Follow Webdunia telugu