కొందరు తరచూ నోటి పూత సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారు సరిగ్గా ఆహారం తీసుకోలేరు. సరిగ్గా మాట్లాడలేరు. దీనికి ప్రధాన కారణం వారు తీసుకునే ఆహారంలో మార్పులు చోటుచేసుకోవడమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతోపాటు శరీరంలో విటమిన్ల లోపం, మానసికపరమైన ఒత్తిడి, నిద్రలేమి, కాఫీ, టీలు ఎక్కువగా సేవిస్తుండటంతో ఈ సమస్య ఉత్పన్నమౌతుంది.
నోటి పూత సమస్యను అధిగమించాలంటే ప్రతి రోజూ ఉదయం పరకడుపున ఉప్పు కలిపిన నీటిని నోట్లో వేసుకుని పుక్కిలించండి. నల్ల నువ్వులను దంచి ఉండలా చేసుకుని నోట్లో పెట్టుకుని రసం పీల్చి పిప్పిని ఉమ్మేయండి. బియ్యం కడిగిన నీటిలో చెంచా ఉసిరి రసం కలుపుకుని భోజనానికి ముందు సేవించండి. దీంతో మంచి ఫలితముంటుందంటున్నారు వైద్యులు. ఇలా చిట్కాలు పాటించడం వలన నోటిపూత నుండి ఉపశమనం లభిస్తుంది.