ప్రాణవాయువు కఫంతో కూడుకుని ఉండడంతో శ్వాసకోశ వ్యాధులు కలుగుతాయి. దీనివలన అనేక దోషములు, బాధలు కలుగుతుంటాయి. వీటికి వాత, శ్లేషములను హరించు చికిత్సలు ప్రధానంగా చేయాలి.
ఉలవలు, శొంఠి, వాకుడు వేళ్ళు, అడ్డసరము.. ఈ కషాయంలో పుష్కరముల చూర్ణంను చేర్చి తీసుకున్న.. శ్వాసవ్యాధి నివారణమవుతుంది. దశమూల కషాయంలో పుష్కరములు చూర్ణం కలిపి త్రాగిన శ్వాసవ్యాధి, నొప్పులు తగ్గుతాయి. దేవదారు, వస, వాకుడు, శొంఠి, కల్ఫలము, పుష్కరములు చూర్ణం.. వీటి కషాయం శ్వాస వ్యాధులను పోగొడుతుంది. వాకుడు, పసుపు, అడ్డసరము, తిప్పతీగ, శొంఠి, పిప్పళ్ళు, భారంగి, తుంగగడ్డలు, వీటి కషాయంలో పిప్పళ్ళ చూర్ణం, మిరియాల చూర్ణం కలిపి సేవించిన శ్వాసవ్యాధులు నశిస్తాయి.
అడ్డసరము, పసుపు, ధనియాలు, తిప్పతీగ, భారంగి, పిప్పళ్ళు, శొంఠి, వాకుడు.. వీటి కషాయంలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటున్న శ్వాసరోగము తగ్గుతుంది. భారంగి, శొంఠి, వీటి కషాయమును త్రాగుచున్న శ్వాసరోగము నందు కళ్ళు ఎర్రబడిన.. వెంటనే తెలుపు వర్ణంలోకి వస్తాయి. ద్రాక్ష, తిప్పతీగ, శొంఠి, పిప్పళ్ళు, వీటి కషాయం తీసుకుంటుంటే.. శ్వాస, శూల, అగ్నిమాంద్యం, జ్వరం, దాహములు నివారిస్తాయి. బూడిద గుమ్మడి వేళ్ళ చూర్ణంను నులివెచ్చని నీటితో కలిపి తీసుకుంటే తీవ్రమైన శ్వాసవ్యాధులు నయమవుతాయి.
శొంఠి ఏడుభాగాలు, పిప్పళ్ళు ఆరుభాగాలు, మిరియాలు ఐదుభాగాలు, నాగకేసరములు నాలుగు భాగాలు, ఆకుపత్రి మూడుభాగాలు, లవంగపట్ట రెండు భాగాలు, యాలకులు ఒక భాగం తీసుకుని చూర్ణం చేసి.. దానికి సమానంగా చక్కెరను కలిపి తీసుకుంటున్న శ్వాస, గొంతురోగం, హృద్రోగం ఇవన్నీ నివారిస్తాయి.