సిద్ధేశ్వరుడు కొలువైన "సిద్ధేశ్వర కోన జలపాతం"
వంద అడుగుల లోతు ఉన్నప్పటికీ.. కేవలం పది అడుగుల లోతే ఉంటుందని భ్రమ కల్పించే స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో.. సిద్ధేశ్వర స్వామి పాదాలను తాకుతూ.. పరవళ్లు తొక్కుతూ.. కిందికి దూకుతుంటుంది సిద్ధేశ్వర కోన జలపాతం. సహజ సిద్ధమైన జలపాతాలను కలిగిన ఈ సుందర ప్రదేశం, యాత్రికులకు మధురానుభూతిని పంచుతూ.. ఎనలేని ప్రకృతి సౌందర్యాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని మళ్లీ మళ్లీ.. రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలోని బుచ్చినాయుడు కండ్రిగ, వరదయ్య పాళెం మండలాల సరిహద్దుల్లో ఉబ్బలమడుగు జలపాతం ప్రవహిస్తూ ఉంటుంది. తొట్టంబేడు మండలం బోనుపల్లి నుంచి సత్యవేడు దాకా సాగిపోతున్న కొండకోనల మధ్య పచ్చని ప్రకృతి ప్రాంతమే ఇది. ప్రకృతి రమణీయతకు అద్దంపట్టే ఈ అందమైన ప్రాంతంలోనే సిద్ధేశ్వర కోన ఉంది. ఇక్కడ శివయ్య సిద్ధులయ్యగా పూజలందుకుంటూ సిద్ధేశ్వరుడిగా పిలువబడుతున్నాడు.మహా శివరాత్రి పర్వదినాన వేలాది సంఖ్యలో భక్తులు సిద్ధేశ్వర కోనకు తరలివచ్చి.. సిద్ధులయ్యను దర్శించుకుని ఆ కీకారణ్యంలోనే నిద్రిస్తుంటారు. దీనికి ఎగువన, దిగువన జలపాతాల హోరు నిరంతరాయంగా వినిపిస్తుంటుంది. ఈ జలపాతాల నీరు ఉత్తర దిక్కుగా ప్రవహిస్తుంటుంది. ఇవి దూకే చోటు నుంచి కాస్త దిగువన నీటి కాలువలు ఉంటాయి. వీటినే ఉబ్బలమడుగులు అని స్థానికులు పిలుస్తుంటారు.
ఈ సుందర జలపాతాల హోరుతో పులకింపజేసే ఈ ప్రాంతం కొంతమందికి సౌందర్య దేవత అయితే, మరికొందరికి మృత్యుదేవతగా మారుతోంది. ఇక్కడి స్వచ్ఛమైన నీటి ప్రవాహం మృత్యుద్వారాలను తెరిచి.. ఎందరో యువకుల పాలిట యమపాశంలా మారుతోంది. ఉబ్బల మడుగు సుందర ప్రదేశమే కాకుండా...
ఎత్తైన పర్వతశ్రేణిలో ఉండే ఈ జలపాతాన్ని చేరాలంటే కాలినడకన కొంత దూరం గుట్టలమీదుగా వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ అల్లుకున్న పచ్చటి అడవి, పైన జలపాతం నుంచి పారే సెలయేటి గలగల సవ్వడులు, పక్షుల కిలకిలా రావాలు, పట్టణ కాలుష్యానికి దూరంగా ప్రశాంతమైన ప్రకృతిమాత ఒడిలో హాయిగా సేద తీరేందుకు ఇంతకు మించిన చక్కటి ప్రదేశం లేనే లేదని చెప్పవచ్చు.ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టగానే ముందుగా ఓ చిన్న సరస్సు దర్శనమిస్తుంది. దీని నుంచే దట్టమైన అటవీ ప్రాంతం మొదలవుతుంది. కొండలమీదుగా ఈ జలపాతం వద్దకు వెళ్లలేని పర్యాటకులు ఈ సరస్సు వద్దే స్నానాలాచరించి.. ఇక్కడే సేదతీరుతుంటారు. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం కాబట్టి ఎలాంటి సౌకర్యాలు ఉండవు. పర్యాటకులకు ఏమి కావాలన్నా.. వరదయ్యపాళెంలోనే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. సాధారణ రోజుల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ.. శివరాత్రి పండుగ సందర్భంగా దాదాపు నాలుగు రోజులపాటు భక్తులు, పర్యాటకులు, స్థానికుల రద్దీ విపరీతంగా ఉంటుంది. దాంతో తాత్కాలికంగా కరెంటు సౌకర్యంతోపాటు వివిధ దుకాణాలు సైతం ఇక్కడ వెలుస్తుంటాయి.ఇక శివరాత్రి పండుగకు రెండు రోజుల ముందుగానే సిద్ధేశ్వర కోన ప్రాంతానికి చుట్టుప్రక్కల నివసించే గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున కుటుంబాలతో సహా తరలివస్తుంటారు. మూడు రోజులపాటు అక్కడే వంటావార్పూ చేసుకుని సిద్ధులయ్యను తనివితీరా దర్శించి పూజలు జరపటం ఆ ప్రాంత ప్రజలకు ఆనవాయితీ. అయితే, సాధారణంగా పర్యాటకులు చీకటిపడే సమయానికి వరదయ్యపాళెం చేరుకుంటుంటారు.
వరదయ్యపాళెం నుంచి దాదాపు ఏడు కిలోమీటర్ల దాకా తారు రోడ్డు, ఆపై మరో నాలుగు కిలోమీటర్లు మేరకు మట్టిరోడ్డు సౌకర్యం ఉంది. దాదాపు అన్ని రకాల వాహనాలు ఈ మార్గం గుండా కొండల పీఠభాగాన ఉండే సరస్సు వరకు సులభంగా వెళుతుంటాయి. అయితే ఉబ్బలమడుగు జలపాతాన్ని చూడాలంటే మాత్రం కాలినడకన పైకి వెళ్లక తప్పదు. వారాంతాల్లో ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా తరలివస్తుంటారు. అయితే ఎవరయినా సరే ఇక్కడికి వెళ్లాలంటే బృందాలుగా వెళ్లటం శ్రేయస్కరం. ఈ జలపాతాల నీరు చాలా స్వచ్ఛంగా ఉండటంవల్ల లోతు తక్కువగా ఉన్నట్లు భ్రమ కలుగుతుంది. అందులోకి దిగితేగానీ చాలా లోతుగా ఉన్నాయని అర్థమవుతుంది. అలా మునిగినవారికి ఈత వస్తేనే ఒడ్డుకు చేరగలరు. లేకపోతే ఆ ప్రవాహపు జోరులో ఎక్కడో ఒకచోట విగతజీవుల్లా తేలక తప్పదు.ఇదిలా ఉంటే.. ఈ సుందర జలపాతాల హోరుతో పులకింపజేసే ఈ ప్రాంతం కొంతమందికి సౌందర్య దేవత అయితే, మరికొందరికి మృత్యుదేవతగా మారుతోంది. ఇక్కడి స్వచ్ఛమైన నీటి ప్రవాహం మృత్యుద్వారాలను తెరిచి.. ఎందరో యువకుల పాలిట యమపాశంలా మారుతోంది. ఉబ్బల మడుగు సుందర ప్రదేశమే కాకుండా.. విష వలయంగా కూడా మారుతోంది. అయినా అధికారులకు ఇవేమీ పట్టటం లేదు.. ఎంతోమంది మృత్యువాత పడుతున్నా వారికి చీమ కుట్టినట్లయినా లేదు.అంతేగాకుండా.. ఈ ప్రాంతాల సందర్శనకు వచ్చే యువకులు అతిగా మద్యం సేవించి జలపాతాల్లో స్నానాలకు దిగుతుంటారు. వీరిలో ఈతరాక కొందరు, ఈత వచ్చినా ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి మరికొందరు శవాలై తేలుతున్నారు. అంతేగాక ఇది దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉబ్బలమడుగు జలపాతాలను, సిద్ధేశ్వర కోన జలపాత ప్రాంతాలను ప్రభుత్వం ఎకో టూరిజం పేరుతో మంచి విహార యాత్రా స్థలంగా మార్చుతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అయితే ఇక్కడ జరుగుతున్న మరణాలను, హత్యను నియంత్రించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టక పోవడంతో స్థానికులు, పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు, పోలీసు శాఖ, ఎకో టూరిజం అధికారులు ఈ ప్రాంతంలో చోటుచేసుకుంటున్న విషాద సంఘటనలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు డిమాండ్ చేస్తున్నారు.