శ్రీనాథుడి పద స్పర్శతో పులకించిన "రాచకొండ"
కొండలపైనుంచి జాలువారే చిన్న చిన్న జలపాతాలు, సెలయేళ్ళు.. కనువిందు చేసే కోనేరులు.. హరిత వర్ణాన్ని కప్పుకున్న కొండలు, పక్షుల కిలకిలా రావాలు, వన్యప్రాణుల వింత అరుపులతో... ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలిచిన ప్రాంతమే "రాచకొండ గుట్ట". సంప్రదాయ దుస్తులు ధరించి.. పల్లె జీవనం సాగిస్తున్న అమాయక గిరిజన ప్రజలు నివసించే ఈ ప్రాంతాన్ని చేరగానే పర్యాటకులు అలౌకిక ఆనందానికి, అనుభూతికి లోనవకమానరు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో, సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోగల ఈ రాచకొండ గుట్టలు ప్రకృతి సౌందర్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. పర్వత ప్రాంతం, చుట్టూ దట్టమైన అడవి నెలకొన్న ఈ ప్రదేశాన్ని శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. రాచకొండ చుట్టూ ఉన్న గుట్టల మధ్య నుంచి ఉండే దారి గుండా ప్రయాణిస్తే.. అక్కడి సౌందర్యం చాలా ఆహ్లాదం కలిగించేదిగా ఉంటుంది.గత చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ రాచకొండ ముఖ ద్వారం పర్యాటకుల సాదరంగా స్వాగతం పలుకుతుంది. అలాగే గత చరిత్రలోకి సైతం మనల్ని చేయి పట్టి అలా లాక్కెళ్లిపోతుంది. బలిష్టమైన బండరాళ్లతో శత్రు దుర్భేద్యంగా కొండల చుట్టూ నిర్మించిన ప్రాకారాలు ఆనాటి రక్షణ వ్యవస్థను మన కళ్లముందు నిలుపుతాయి.కవి సార్వభౌముల స్థావరం..!
భాస్కర రామాయణ శేషాన్ని పూరించిన అయ్యచార్యుడు రాచకొండ రాజ్యానికి చెందినవారేనట. ఈయన కుమారుడే హరిశ్చంద్ర చరిత్రను రచించిన గౌరన. అలాగే కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాచకొండ ఆస్థానంలోని దుర్గాన్ని సందర్శించి, సరస్వతీదేవిని స్తుతించి రాజుల మన్ననలను పొందారు...
ఈ ప్రాకారాన్ని దాటి ముందుకు వెళితే "కచేరి కొండ" కనిపిస్తుంది. ఆరు వందల అడుగుల ఎత్తైన ఆ కొండపైన రేచర్ల పద్మనాయకుల ప్రభువులు కొలువుతీరేవారని పూర్వీకుల కథనం. ఆ కొండచుట్టూ దుర్భేద్యమైన, బలిష్టమైన ప్రాకారం.. మధ్య మధ్యలో ఎత్తైన బురుజులు, వాటిపై ఫిరంగులు, అవి పేల్చేందుకు చేసిన అమరికలు మనకు నేటికీ కనిపిస్తాయి. వాటి చుట్టూ ఉన్న ఆరు సింహద్వారాలను దాటి కొండపైకి చేరుకోవచ్చు.కొండపైకి వెళ్లేందుకు ఆ రోజుల్లో రాతితో నిర్మించిన మెట్లు నేటికీ మనల్ని పలుకరిస్తాయి. ఈ కొండపైనే మండపాలు, రాజప్రాసాదాలు, తటాకాలు, జలాశయాలు కనిపిస్తాయి. అలాగే రెండు బండరాళ్ల చీలిక మధ్య సంకెళ్ల బావి ఉండగా.. దాంట్లో ఏ కాలంలో అయినా సరే నీరు నిలిచి ఉంటుంది. కొండ మీదినుంచి చూస్తే కొన్ని కిలోమీటర్ల దూరంవరకు ప్రకృతి సౌందర్యం మనల్ని దృష్టి మరల్చనీయదు. ఈ కొండకు ఆనుకునే "నాగనాయుని కొండ" ఉంది. దీనిపై చారిత్రాత్మకమైన రామాలయం, ఇతర దేవాలయాలు, మండపాలు, చెరువులు ఉన్నాయి.రాచకొండ చరిత్రను చూస్తే.. కాకతీయుల పతనం తరువాత రేచర్ల పద్మనాయకులు, రాచకొండను కేంద్రంగా చేసుకుని సుమారు 110 సంవత్సరాలపాటు పరిపాలించారు. రాచకొండ రాజధానిగా క్రీ.శ.1325 నుండి 1474 వరకు మొత్తము తెలంగాణను వీరు పాలన సాగించారు. ఆమనగల్లు నుంచి రాచకొండకు రాజధానిని మార్చి, ఇక్కడ బలిష్టమైన దుర్గాన్ని నిర్మించారు. పద్మనాయకుల వంశీయుడొకడు రాచకొండ దుర్గాన్ని శుత్రుదుర్భేద్యంగా నిర్మించాడు. తదనంతరం బహమనీ సుల్తానుల ధాటికి తట్టుకోలేక రాచకొండ రాజ్యం తుడిచిపెట్టుకుపోయింది.
అయితే రేచర్ల పద్మనాయకుల పాలన నాటి రాచరిక అవశేషాలు, చారిత్రాత్మక చిహ్నాలు రాచకొండను దర్శించే పర్యాటకులకు నేటికీ దర్శనమిస్తున్నాయి. రాచకొండ ఆస్థానంలో వేద వేదాంగాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, నాటకాలు, అలంకార శాస్త్రాలు, రాజనీతి, ధర్మాచరణ, సామాజిక, సంగీత, కళా శాస్త్రాలను అవపోశన పట్టిన దిట్టలు ఉండేవారని పూర్వీకులు చెబుతుంటారు.ఆనాటి అగ్రహారాలు, దేవాలయాలు.. విద్యాలయాలుగా విలసిల్లేవనీ.. రాచకొండను పాలించిన మూడో సింగపాలుడు ప్రతి ఏడాది ఇక్కడ వసంతోత్సవాలను ఏర్పాటు చేసి రాజ్యంలోని సకల కళాకోవిదులను రప్పించి సన్మానించేవారట. సింగపాలుడు స్వయంగా కవి కావటంతో.. పశుపతి, నాగనాథ పండితుడు, బొమ్మకంటి అప్పయాచార్యుడు తదితరులు ఈయన ఆస్థానంలో ఉండేవారట.భాస్కర రామాయణ శేషాన్ని పూరించిన అయ్యచార్యుడు రాచకొండ రాజ్యానికి చెందినవారేనట. ఈయన కుమారుడే హరిశ్చంద్ర చరిత్రను రచించిన గౌరన. అలాగే కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాచకొండ ఆస్థానంలోని దుర్గాన్ని సందర్శించి, సరస్వతీదేవిని స్తుతించి రాజుల మన్ననలను పొందారు. మహాకవి బమ్మెర పోతన కూడా రాచకొండ మూడో సింగ భూపాలుడి ఆస్థానకవిగా పనిచేశారు. అలాగే తెలుగు సాహిత్యంలో పెద్దక కంటే ముందు ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన కొరివి సత్యనారాయణ కూడా రాచకొండలోనే ఉండేవారట.అయితే ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాచకొండ గుట్టలు ఇంతకాలం పాలకుల నిర్లక్ష్యానికి సాక్షీభూతాలుగా మిగిలాయి. పురావస్తు శాఖవారి నిరాదరణకు కూడా గురైన ఈ ప్రాంతంలోని గత చరిత్ర ఆనవాళ్లుగా మిగిలిన అనేక చారిత్రక కట్టడాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. సరైన ఆలనా, పాలనా లేని కారణంచేత అవి మట్టిలో కలిసిపోయేందుకు సిద్ధంగ ఉన్నాయి.అలాగే సరైన రక్షణ ఏర్పాట్లు లేని కారణంతో ఈ ప్రాంతంలోని శిల్ప సంపద అక్రమార్కుల పాలబడి తరలింపుకు గురవుతోంది. అలాగే గుప్త నిధుల కోసం కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. రాచకొండ గుట్టల్లో అనేక శివాలయాలు, వీరభద్ర ఆలయాలు, శ్రీరామచంద్ర స్వామి దేవస్థానాలు మొదలైనవి సుమారు 30కి పైబడే ఉన్నాయి. వీటిలోని శ్రీరామచంద్రస్వామి ఆలయం మాత్రం కాస్త ఉన్నత స్థితిలో ఉంది.ఇక రాచకొండ గుట్టలు శత్రు దుర్భేద్యంగా ఉండటంతో రెండు దశాబ్దాల నుంచి మావోయిస్టుల స్థావరంగా కూడా మారిపోయాయి. ఎన్‌కౌంటర్లతో ఈ ప్రాంతం పలుమార్లు రక్తం చిందించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కొంతకాలం నుంచి ప్రశాంత వాతావరణం నెలకొంది. దీంతో.. ఇప్పటికైనా ప్రభుత్వం, పర్యాటక శాఖవారు రాచకొండవైపు దృష్టి సారించి.. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.