Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెలమ రాజుల శత్రుదుర్భేద్య దుర్గం "దేవరకొండ"

వెలమ రాజుల శత్రుదుర్భేద్య దుర్గం
FILE
వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతుండే అతిథి గృహాలు, వేదోచ్ఛారణలమధ్య వెలిగిపోతుండే గుళ్లు, గోపురాలు.. సిరిమువ్వల సవ్వడితో చేసే నాట్య విన్యాసాలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు, రారాజుల తీర్పుకోసం వేచి ఉండే ప్రజలతో నిండిన రాజ ప్రసాదాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చే చారిత్రక ప్రదేశం దేవరకొండ దుర్గం. వెలమ రాజులు శుత్రుదుర్భేద్యంగా నిర్మించిన ఈ కట్టడం హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లే దారిలో మల్లేపల్లి నుంచి ఏడుకిలోమీటర్ల దూరం లోపలికి వెళితే స్వాగతం పలుకుతుంది.

ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వెలమ రాజుల రాచరిక పరిపాలనా విధానానికి అనుగుణంగా, భద్రతా సంబంధమైన విషయాలతో శత్రువుల ఊహకు సైతం అందని విధంగా.. రాతి, మట్టి ప్రాకారాలతో నిర్మించిన దేవరకొండ దుర్గం వారి విజ్ఞతను చాటుతూ మనకు ఈనాటికీ దర్శనమిస్తోంది.

సంవత్సరాల తరబడి దుర్గంలోనే ఉంటూ యుద్ధం చేయాల్సి వచ్చిన సందర్భాలలో అందుకు అవసరమైన వనరుల్ని ఏర్పరచుకున్న తీరు.. శత్రు సైన్యంపై దాడి చేసేందుకు అనువుగా నిర్మించిన రహస్య స్థావరాలు... తదితరాలను పరిశీలిస్తే, ఆనాటి పద్మనాయక వెలమ రాజుల పరిజ్ఞానం నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు దిగదుడుపే అనిపించకమానదు.

కాకతీయ రాజులవద్ద సేనానులుగా పనిచేసిన పద్మనాయక వంశానికి చెందిన భేతాళ నాయకుడి సంతతివారు ఆ తరువాతి కాలంలో దేవరకొండ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. వీరి వంశంలో 8వ తరానికి చెందిన రెండవ మాదానాయుడు కాలంలోనే దేవరకొండ దుర్గం నిర్మాణం జరిపినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

మాదానాయుడి తండ్రి సింగమనాయుడు దుర్గం కొంత భాగం నిర్మాణం పూర్తి చేసినా, పూర్థి స్థాయిలో మాదానాయుడి కాలంలోనే రూపొందినట్లు తెలుస్తోంది. ఇతని కాలంలోనే దేవరకొండ రాజ్యం శ్రీశైలందాకా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. 525 ఎకరాల విస్తీర్ణం, 500 అడుగుల ఎత్తుగల ఏడు కొండలను కలుపుతూ పద్మనాయకులు ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.

సువిశాలమైన ఎత్తైన కొండలు హెచ్చుతగ్గులుండటంచేత అందుకు అనుగుణంగా చుట్టూ ఒకే ప్రాకారాన్ని కాకుండా, ఒకదాని వెనుక మరొకటిగా అనేక ప్రాకారాలను సంపూర్ణ పరిజ్ఞానంతో నిర్మించారు. ఏడు కొండలను కలుపుతూ పెద్ద పెద్ద బండరాళ్లను చక్కగా చీల్చి చూసేవారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా 6, 8, 10 మీటర్ల ఎత్తుగల ప్రాకారాల గోడలను నిర్మించారు. దుర్గంలోపల కొండపైన సమృద్ధిగా జలవనరులున్నట్లు తెలుస్తోంది.

అవన్నీ అలా ఉంచితే.. దుర్గంలోపల వంద ఎకరాల సువిశాల వ్యయసాయ క్షేత్రం ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఈ దుర్గంలో 360 బురుజులు, 9 ప్రధాన ద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కోనేరులు, 5 చిన్న కొలనులు, 13 ధాన్యాగారాలు, గుర్రపశాలలు, ఆయుధాగారాలు ఉండేవని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే సరైన రక్షణ లేని కారణంగా వీటిలో నేడు చాలా వరకు శిథిలమైపోయాయి.

ప్రధాన ద్వారాల నిర్మాణంలో కూడా వెలమ రాజులు సంపూర్ణ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టినట్లు అర్థమవుతోంది. ఒకవేళ శత్రువులు చొరబడినా వారిని అంతమొందించేందుకు మొదటి ద్వారం నుంచి రెండో ద్వారం చేరేందుకు అతి సమీపంలోనే మూడు మలుపులు తిప్పి వాటిని నిర్మించం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ మెలికలు తిరిగిన 3 మలుపులలో దాదాపు 100 మంది సైనికులు శత్రువులకు కనిపించకుండా రహస్యంగా నక్కి ఉండేలా స్థావరాలను సైతం నిర్మించారు.

webdunia
FILE
అంతేగాకుండా.. కొండమీద నెలవైన దుర్గం కాబట్టి, కొండపైకి ఎక్కి గోడను కూలద్రోయటంగానీ, గోడను ఎగబాకి లోపలికి ప్రవేశించటం సాధ్యపడదు. సింహద్వారాలకు అతి సమీపంలో "యు" ఆకారంలో బలమైన బురుజులను నిర్మించి శత్రువులు లోనికి చొరబడేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని విధంగా దుర్గాన్ని నిర్మించారు. మొదటి రెండు ద్వారాలను అతి సమీపంలో నిర్మించి వాటి మధ్య రెండు అంతస్థులుగా సైనిక స్థావరాలను నిర్మించారు.

మొదటి ద్వారం దాటగానే కొత్తవారు సైతం నోరెళ్లబెట్టే విధంగా రెండు ద్వారాలను నిర్మించారు. ఇందులో ఒకటి డమ్మీ ద్వారం కాగా, మరోటి కోటలోపలికి ప్రవేశించేంది. ప్రతి ద్వారానికి అడుగు భాగాన రెండువైపులా పూర్ణకుంభాలను చెక్కించారు. ఈ కోట ద్వారాలపై చెక్కిన పూర్ణకుంభ కలశాలనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తమ అధికార చిహ్నంగా తీసుకుని ఉండవచ్చునని చారిత్రక పరిశీలకులు భావిస్తున్నారు.

సింహద్వారం దాటి లోపలి వెళ్లగానే ఎడమవైపు నల్లరాతి ఏకశిలా నంది విగ్రహం దర్శనమిస్తుంది. మరికాస్త దూరం ముందుకెళితే మరో ప్రధాన ద్వారం, ఆ తర్వాత కుడివైపుకు వెళితే శిథిలావస్థకు చేరుకున్న ధాన్యాగారాలు, సైనికావాసాలు, అధికారుల భవనాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశం దాటి విశాలమైన మెట్లు ఎక్కి కాస్త దూరం వెళితే రెండో రాతి ప్రాకారం కనిపిస్తుంది. ఇందులో ఉండే విశేషం ఏంటంటే.. ఆ ప్రాకారం దగ్గరికి వెళ్లేదాకా దానికి అమర్చిన ద్వారం ఎవ్వరికీ కనిపించదు.

అలాగే మెట్లు ఎక్కుతూ పడమరవైపు వెళితే మరో రాతి ప్రాకారం వస్తుంది. అందులో ఎన్నో రహస్య సైనిక స్థావరాలు నిర్మించబడి ఉన్నాయి. దాన్ని దాటి ముందుకెళితే నాలుగో రాతి ప్రాకారం, దానినుంచి పడమర దిశగా పైకి ఎక్కుతూ వెళితే ఐదో ప్రాకారం వస్తాయి. ఐదో ప్రాకారంవద్ద ఇప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరని సింహ ద్వారం మనకు దర్శనమిస్తుంది. ఈ ద్వారం దాటి లోనికి వెళ్లగానే ఓ ఆలయం ఉంటుంది.

దానికి ఉత్తర దిశగా వెళితే రెండు దారులు.. అందులో దక్షిణంవైపు మెట్లు ఎక్కి వెళితే దుర్గంలోని ఎత్తైన కొండపై ఉండే రామాలయానికి చేరుకుంటాం. కొండపైగల 50 ఎకరాల సమతల ప్రదేశంలో రాజమందిరం, అంతఃపురం, సభావేదికలు, రాణివాసాలు, రాజదర్బాలు మనకు ఆహ్వానం పలుకుతాయి.

అక్కడికి నైరుతీ దిశలో గొలుసుబావి ఉంది. రాజవంశీకులు ఈ బావిలోని నీరే తాగేవారట. కోటను వదలి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, ధనం, నగలు, మోట బొక్కెనలలో నింపి వాటికి బలమైన ఇనుప గొలుసులు కట్టి ఈ బావిలో పడవేసి, గొలుసులను బలమైన రాతి స్థంభాలకు బిగించి వెళ్లేవారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఆ గొలుసులు 1980 సంవత్సరందాకా కనిపించేవనీ, ఆ తర్వాత అవి అదృశ్యమయ్యాయని స్థానికులు చెబుతుంటారు. గొలుసుబావికి ఎదురుగా ఉండే కోనేరు.. ఎన్ని కరువులు వచ్చినా ఎండిపోలేదని, దశాబ్దాల నుంచి నీరు ఒకేలాగా ఉందని కూడా స్థానికులు చెబుతుంటారు.

గొలుసుబావికి ఉత్తరదిశగా కొంతదూరం నడచివెళితే విశాలమైన మట్టి ప్రాకారం మధ్య ఓ శివలింగం, నందీశ్వరుడు, పెకిలించబడిన ధ్వజస్థంభం, ఓంకారేశ్వరస్వామి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి రోజున స్థానిక గ్రామాల ప్రజలు పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఇక ఆనాటి ధాన్యాగారాలలో ఇప్పటికీ ధాన్యం పొట్టు చెక్కుచెదరకుండా కనిపించటం విశేషంగా చెప్పవచ్చు.

దేవరకొండ దుర్గాన్ని శత్రు రాజులు ఎవరూ యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకోలేక పోయినప్పటికీ, ఆనాటి రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న శత్రువులు.. తదితర కారణాల చేత రెండవ మాదానాయుడి కాలంలో అక్కడి పాలకులు స్వచ్ఛందంగా కోటను వదలి, విజయనగర రాజులవద్ద ఆశ్రయం పొందినట్లుగా చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. భారత పురావస్తు శాఖవారు ఈ దేవరకొండ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా విలువైన చారిత్రక సంపద అంతా శిథిలావస్థకు చేరుకుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దుర్గంలో గుప్త నిధులకోసం అనేకమంది ఎంతో విలువైన కళాఖండాలను సైతం ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ ఇప్పటికైనా మేల్కొని మన పూర్వీకుల జాతి సంపదను కాపాడి, తరువాతి తరాల వారికి అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తుందని ఆశిద్దాం.

Share this Story:

Follow Webdunia telugu