వర్షరుతువులో "కెరమెరి" అందాలు చూడతరమా...?!
దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అమాయకపు ముఖాలతో కనిపించే అడవితల్లి బిడ్డలు... ఇలా చెప్పుకుంటూపోతే చటుకున్న గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాయే..! ఓ వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని పరవళ్ళెత్తే కూటాల జలపాతం... మరోవైపు ఈ పర్వతాలకు దిగువన ఉండే కెరమెరి పర్వత పంక్తుల అందాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది.ఆదిలాబాద్ జిల్లాను దాటగానే మొదలయ్యే సహ్యాద్రి పర్వతాలు.. పర్యాటకులను క్రింది భాగం నుంచి కొన్ని వందల అడుగుల ఎత్తుకు చేరుస్తుంటే... తిరిగీ ఆ ఎత్తు నుంచి క్రిందికి దించుతాయి కెరమెరి పర్వతాలు. వీటిని ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా రూపొందించటంలో ఆనాటి నిజాం పాలకులు తీసుకున్న ప్రత్యేక చర్యలు ఎంతగానో సాయపడ్డాయి.కెరమెరి పర్వత పంక్తుల ప్రారంభంలో ఒక ఎత్తైన మంచెను నిర్మించిన నిజాం పాలకులు... దాని పైనుంచి ప్రకృతి అందాలను వీక్షించే ఏర్పాట్లను చేశారు. అప్పట్లో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి పర్వత అందాలను, సజీవంగా ప్రవహించే సెలయేళ్లను, కనువిందు చేసే వన్యప్రాణులను తిలకించేందుకు పర్యాటకులు వెల్లువలా తరలివచ్చేవారని చెబుతుంటారు.
వర్షాకాలంలో కెరమెరి పర్వతాల పై నుంచి ప్రకృతిని చూసినట్లయితే.. చుట్టుప్రక్కల ప్రవహించే సెలయేళ్లు, పచ్చని అటవీ శ్రేణులు ఊటీని తలదన్నే విధంగా చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. గిరిజన అమరవీరుడు కొమురం భీం ప్రాణాలు అర్పించిన జోడేఘాట్ పర్వత పంక్తులు...
గిరిజన అమరవీరుడు కొమురం భీం ప్రాణాలు అర్పించిన జోడేఘాట్ పర్వత పంక్తులు సైతం ఈ కెరమెరి పర్వతాలను ఆనుకుని ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు. వర్షాకాలంలో కెరమెరి పర్వతాల పై నుంచి ప్రకృతిని చూసినట్లయితే.. చుట్టుప్రక్కల ప్రవహించే సెలయేళ్లు, పచ్చని అటవీ శ్రేణులు ఊటీని తలదన్నే విధంగా చక్కటి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.అయితే... ఈనాటి పాలకవర్గాలు సహ్యాద్రి పర్వతాలను, కెరమెరి పర్వత పంక్తులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయటంలో అశ్రద్ధ వహిస్తున్నాయి. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం వసతి సౌకర్యాలతోపాటు, ఇతర సౌకర్యాలను కూడా కల్పించటంలో ప్రభుత్వం కినుక వహిస్తోంది. దీంతో... ఆసిఫాబాద్-ఉట్నూర్ రహదారి వెంట ప్రయాణించే ప్రయాణికులు మాత్రమే ఈ ప్రాంతాల అందాలను వీక్షిస్తున్నారు.ఈ పర్వత ప్రాంతాల అందాలు కేవలం జిల్లా వాసులతోపాటు సరిహద్దుల్లో ఉండే మహారాష్ట్రవాసులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇతర ప్రాంతాల వారికి వీటి గురించి అంతగా తెలియదు. సహ్యాద్రి పర్వతాల ప్రారంభంలో ఉన్న నిర్మల్ పర్వత పంక్తులు రోడ్డు వెడల్పుతో పాటు నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం వల్ల అంతరిస్తున్న అడవుల రూపు చెదిరినప్పటికీ.. అక్కడి పర్వత పంక్తులు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి.గతంలో కొన్ని చలనచిత్రాలు, అనేక టీవీ సీరియళ్లను సైతం చిత్రీకరించిన ఈ పర్వత ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్లయితే... ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా వర్ధిల్లుతాయన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. జోడేఘాట్ పర్వత పంక్తులతోపాటు, కెరమెరి పర్వత పంక్తులను కూడా అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక కేంద్రాలుగా రూపొందించేందుకు ప్రభుత్వం ఇప్పటికైనా పూనుకుంటే మంచిదని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.