Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"లేపాక్షి బసవన్న"ను కనులారా వీక్షిద్దామా..?!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో మనకు ఆహ్వానం పలుకుతుంది.

పురాతత్వశాఖవారి లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, బెంగళూరులోని బసవనగుడిలలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది.

మంచి ఆరోగ్యంతో ఉండే చక్కటి కోడెగిత్త విగ్రహమే లేపాక్షి. గంటలు, లోహపు బిళ్లలతో కూడిన పట్టీలు మొదలైన ఎన్నో అలంకరణలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే. ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది.
ఆ పేరెలా వచ్చిందంటే...?
  సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.      


అలాగే నంది కుడి ఎడమపక్కలలో నృసింహస్వామి ముఖం చెక్కబడి ఉంటుంది. విగ్రహం కుడివైపున నిలబడి నంది దృష్టిలోంచి చూస్తే వీరభద్రాలయంలోని నాగరాజు ఏడు పడగల విగ్రహం కొంత స్పష్టతతో కనిపిస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన వీరభద్రాలయం గోడలమీద, పైకప్పుమీద అనేక కుడ్య చిత్రాలు మనోహరంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడి ముఖ్య విశేషమే లేపాక్షి బసవన్న.

వీరభద్రాలయం కూర్మశిల అనే కొండమీద నిర్మించబడింది. కొండ ఆకారం తాబేలు రూపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, యాత్రాస్థలంగానూ విలసిల్లింది. అచ్యుతదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1530 నుంచి క్రీ.శ. 1542 వరకూ పరిపాలించాడు. ఈయన కాలంలో వీరభద్రాలయ నిర్మాణం జరిగినట్లుగా, ఆలయ గోడల్లోని రాతలు ధృవపరుస్తున్నాయి.

ఇక లేపాక్షికి ఆ పేరెలా వచ్చిందంటే.. సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు.

మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు.

దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు.

లేపాక్షికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యయుగాలనాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉండే శివలింగాన్ని పెద్ద పాము చుట్టుకుని ఉన్నట్లుగా ఉండే శివలింగం ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో చక్కటి శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలు ఉంటాయి. ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుంటారు కూడా...!

లేపాక్షికి వెళ్ళాలంటే... హిందూపురం నుండి ప్రతిగంటకు బస్సులు వున్నాయి. ఇక వసతి విషయానికి వస్తే, అక్కడో టూరిస్టు గెస్ట్‌హౌస్ కూడా కలదు. ఇదిలా ఉంటే... లేపాక్షి వీరభద్ర ఆలయంలోని శిల్పాలలో ఎక్కువభాగం పాక్షికంగా దెబ్బతిని కనిపిస్తాయి. ఈ విషయంలో పెద్దగా జాగ్రత్తలేవీ తీసుకున్న ఆనవాళ్లు కనిపించవు. ఇకనైనా ఏపీ టూరిజం శాఖవారు మేల్కొని లేపాక్షి శిల్ప, చిత్ర సంపదలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu