Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధురానుభూతుల సమ్మేళనం "కదళీవనం"

మధురానుభూతుల సమ్మేళనం
దత్తాత్రేయ అవతారంగా చెప్పబడే శ్రీ నరసింహ సరస్వతీ స్వామి ఎన్నో సంవత్సరాలుగా తపస్సుచేసి "అక్కల్ కోట మహరాజ్"గా పేరుగాంచారు. ఈ మహానుభావుడు తపస్సు చేసిన చోటే "కదళీవనం"గా ప్రసిద్ధిగాంచింది. శ్రీశైలానికి దగ్గర్లో ఉండే ఈ ప్రాంతంలో సరస్వతీ స్వామివారు తపస్సు చేసి, ఆ తరువాత తన తపశ్శక్తినంతటినీ షిర్డీ సాయిబాబాకి ధారపోశారని స్థానికుల విశ్వాసం.

శ్రీశైలం నుంచి గంటన్నర దూరంలో ఉండే ఈ కదళీవనం చేరుకునేందుకు కృష్ణానదిలో పడవ ప్రయాణం చేస్తూ వెళ్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నదికి రెండువైపులా కొండలు, ఆ కొండలపై పచ్చటి వనాలు, ఆ వనాలలోంచి వినబడే పక్షుల కిలకిల రావాలతో ఒకటిన్నర గంటల ప్రయాణం అప్పుడే అయిపోయిందా అనిపించక మానదు.

కృష్ణమ్మ ఒడి నుంచి దిగి అలా సేదతీరితే కదళీవనం ప్రారంభమార్గానికి చేరుకుంటాం. ఇక అక్కడినుంచి 12 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. రెండు మూడు కొండలెక్కాలి, ఇక దారి అయితే సమతలంగా ఉండదు. కొనదేలిన రాళ్లతో ఉండే ఆ మార్గంలో నడవాలంటే తప్పనిసరిగా ఊతంగా కర్రలు ఉండాల్సిందే. పక్కనే కనిపిస్తున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ, ముళ్లమొక్కలను తప్పించుకుంటూ ముందు సాగుతుంది ప్రయాణం.
స్వామివారి చుట్టూ పుట్ట మొలిచిందట..!
  తపస్సు చేస్తుండగా స్వామివారి చుట్టూ పెద్ద పుట్ట మొలిచిందట. కొన్నాళ్ల తరువాత పుట్ట పక్కనే ఉన్న చెట్టును కొడుతున్న చెంచు, పొరపాటున పుట్టకు గొడ్డలితో తగిలించాడట. పుట్టలోంచి రక్తం రావడంతో కంగారుపడ్డ ఆ చెంచు అతను పుట్టను చదును చేసేందుకు...      


అలా వెళ్తుండగా "గుహ" అనే ప్రాంతానికి చేరుకునేలోపు దట్టమైన రెల్లుగడ్డి మనకు స్వాగతం పలుకుతుంది. దాంట్లోంచే ముందుకు సాగాలి, ముందున్నవాళ్ళూ, వెనకనున్నవాళ్ళూ ఎవరూ ఎవరికి ఇందులో కనిపించరు. ఆ రెల్లుగడ్డి ప్రాంతంలో పులులు కూడా సంచరిస్తూ ఉంటాయట. కాబట్టి, జాగ్రత్తగా ముందుకు సాగాల్సి ఉంటుంది.

రెల్లుగడ్డిని తప్పించుకుని బయటికి రాగానే ఎదురుగా గుహ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లేదాకా అసలు అక్కడో గుహ ఉందన్న సంగతే తెలియదు. గుహలోకి వెళ్లాలంటే కాస్త కిందికి దిగి, వరుసగా రాళ్లతో పేర్చి ఉన్న మెట్లపైనుంచి జాగ్రత్తగా కిందికి దిగాల్సి ఉంటుంది. ఇక లోపలికి వెళ్లగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ గుహలో నరసింహ సరస్వతీ, అక్క మహాదేవిల విగ్రహాలుంటాయి. అందుకే ఈ గుహను "అక్కమహాదేవి గుహ" అని కూడా పిలుస్తుంటారు. ఆమె ఈ గుహలో తుదిశ్వాస విడిచారని అక్కడి ప్రజలు చెబుతుంటారు.

నరసింహ సరస్వతీ స్వామివారు కూడా ఈ గుహలోనే తపస్సు చేశారట. లోపల మూడంతస్తుల్లా ఉండే ఈ గుహలోని పై అంతస్తు చాలా విశాలంగా ఉంటుంది. దాదాపు వెయ్యిమంది కూర్చుని ఒకేసారి ధ్యానం చేసుకునేలా ఉంటుంది. గుహ కింది అంతస్తుకి వెళ్లి చూసేందుకు దారి ఉండదు.

నరసింహ స్వామివారి గురించి ఓ కథనం ఉంది. అదేంటంటే... ఆయన ఈ అక్కమహాదేవి గుహలోనే చాలా సంవత్సరాలు తపస్సు చేసి, తరువాత అక్కడి 6 కిలోమీటర్ల దూరంలోని మరోగుహలో కూడా మరి కొన్నేళ్ళు తపస్సు చేశారట. తపస్సు చేస్తుండగా స్వామివారి చుట్టూ పెద్ద పుట్ట మొలిచిందట. కొన్నాళ్ల తరువాత పుట్ట పక్కనే ఉన్న చెట్టును కొడుతున్న చెంచు, పొరపాటున పుట్టకు గొడ్డలితో తగిలించాడట.

పుట్టలోంచి రక్తం రావడంతో కంగారుపడ్డ ఆ చెంచు అతను పుట్టను చదును చేసేందుకు పూనుకున్నాడు. అప్పుడు స్వామివారి ముఖం కనిపించడంతో భయపడిపోయిన చెంచును స్వామివారు క్షమించి పంపించేశారట. ఆ తరువాత మహారాష్ట్ర వెళ్లిపోయిన స్వామి అక్కల్ కోట మహరాజ్‌గా ప్రసిద్ధి పొందారు. అక్కడే షిర్డీ సాయిబాబాకి తన తపశ్శక్తినంతా ధారపోశారట.

అక్కమహాదేవి గుహనుంచి స్వామివారు తపస్సు చేసిన మరో గుహకి వెళ్లాలంటే... మరో 6 కిలోమీటర్లు ముందుకెళ్లాలి. వెళ్తున్నకొద్దీ అడవి చిక్కబడుతుంది, చెట్ల సందుల్లోని చిన్న దారిలో వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ చెట్లు, పుట్టలు, పొదలు, అక్కడక్కడా వాగులు, నాచుపట్టిన రాళ్లను జాగ్రత్తగా దాటుకుంటూ 3 గంటలు ప్రయాణించి ముందుకెళ్తే గుహకి చేరుకుంటాం.

గుహ వద్దకు అడుగుపెట్టగానే సంతోషంతో గట్టిగా కేకలేయకుండా ఉండలేం. ఎందుకంటే, అక్కడ ఓ అందమైన జలపాతం ఉంటుంది. చాలా ఎత్తునుంచి నీళ్లు జారిపడుతూ అద్భుతంగా ఉంటుంది ఆ జలపాతం. ఈ జలపాతం పక్కనే ఉన్న గుహలోనే స్వామివారు తపస్సు చేశారట. ఇప్పుడు అక్కడ ఒక శివలింగం ఉంది. ఇక్కడికి వచ్చే సందర్శకులు జలపాతం నీటితో శివలింగానికి అభిషేకం చేసి పూజిస్తుంటారు.

ఈ గుహలో రాత్రిపూట కూడా ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చు. ఎందుకంటే, ఇక్కడ స్వామివారు అదృశ్యరూపంలో సంచరిస్తూ ఉంటారనీ... అందుకే ఇక్కడికి ఎలాంటి క్రూరమృగాలూ రావని భక్తుల నమ్మకం. ఈ గుహలోంచి చూస్తే సూర్యోదయం చాలా గమ్మత్తుగా ఉంటుంది. చెట్ల సందుల్లోంచి సూర్యకిరణాలు గుహలోకి వస్తూ మెరుస్తూ ఉంటాయి.

ఈ సూర్య కిరణాలను చూస్తూ, చుట్టూ ప్రశాంతమైన ప్రకృతి మధ్య నిశ్శబ్దంగా కూర్చుంటే ఆ అనుభూతి మాటలకు అందనిది. కాలుష్యానికి, రణగొణ ధ్వనులకు దూరంగా ఎంతో హాయిగా గడిచిపోయే "కదళీవనం" యాత్ర ఓ మధురమైన జ్ఞాపకంగా మదిలో ఒదిగిపోక తప్పదు.

Share this Story:

Follow Webdunia telugu