Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

భక్త రామదాసు బందీగా గడిపిన గోల్కొండ

Advertiesment
పర్యాటక రంగం ఆంధ్రావని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు గోల్కొండ కోట భక్త రామదాసు సీతమ్మ కిలోమీటర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని ముఖ్యమైన సందర్శనీయ స్థలాలలో చెప్పుకోదగ్గది గోల్కొండ కోట. భక్త రామదాసు సీతమ్మకు చింతాకు పతకం చేయించి... రాజ్య నిధులను దుర్వినియోగం చేశాడన్న నేరారోపణతో.. ఈ కోటలోనే బందీగా గడిపాడు.

హైదరాబాదు నగరానికి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ కోట మొత్తాన్ని 120 మీటర్ల ఎత్తయిన నల్లరాతి కొండపైన నిర్మించారు. కోట రక్షణార్థం దాని చుట్టూ పెద్ద బురుజును కూడా కట్టారు. 1143 కాలంలో ఈ ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలిస్తుండేవారు. 200 సంవత్సరాల తరువాత కాకతీయుల నుంచి బహమనీ సుల్తాను ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడని చరిత్రకారుల కథనం.

బహమనీ సామ్రాజ్యంలో 1364-1512 కాలంలో గోల్కొండ కోట రాజధానిగా ఉండేది. అయితే 1512 తరువాత ముస్లిం సుల్తానుల రాజ్యానికి రాజధానిగా చేయబడింది. ఈ కోట అధికారులు, సైన్యం, పాలకుల కుటుంబాలు నివసించేటంత పెద్దదిగా ఉంటుంది. ఈ కోటలో మసీదులు, కోటల శిథిలాలు కూడా ఉన్నాయి. అవన్నీ బాగున్న రోజులలో ఇక్కడ వజ్రాలు దొరికేవట. గోల్కొండ కోట అంటేనే ఆ కాలంలో ధనరాశులకు పర్యాయపదంగా ఉండేదని అంటుంటారు.

గోల్కొండ కోట చరిత్ర :
అప్పట్లో "గొల్ల కొండ" అనే పేరుతో పిలవబడుతుండే ఈ కోట క్రమంగా గోల్కొండ కోటగా రూపాంతరం చెందిందని చరిత్రకారులు అభిప్రాయం. అద్భుతమైన ఈ ప్రాకారం వెనుక ఒక ఆసక్తికరమయిన కథనం కూడా ఉంది. అదేంటంటే... 1143వ సంవత్సరంలో మంగళవరం అనే రాళ్ళ గుట్ట పైన ఒక గొడ్లకాపరికి ఒక దేవతా విగ్రహం కనిపించిందట. ఈ వార్త ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కాకతీయ రాజులకు చేరవేయబడిందట.

వెంటనే ఆ పవిత్ర స్థలములో రాజుగారు ఒక మట్టి కట్టడాన్ని నిర్మించారు. ఆపై... 200 సంవత్సరముల తరువాత బహమనీ సుల్తానులు (1364) ఈ మట్టి కట్టడాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారి తరువాత 1507 సంవత్సరం నుండి మొదలుకొని ఒక 62 సంవత్సరాల కాలంలో ఆ మట్టి కట్టడాన్ని కుతుబ్ షాహీ వంశస్థులు పెద్ద నల్లరాతి కోటగా తయారు చేసారట.

కోట బురుజులతో సహా ఇది 5 కిలోమీటర్ల చుట్టుకొలత కలిగిన ఈ గోల్కొండ కోట ఎన్నో చారిత్రక సంఘటనలకు మౌన సాక్ష్యంగా నిలిచిందని చెప్పవచ్చు. గోల్కొండలో కుతుబ్ షాహీ వంశస్థుల పాలన 1687 సంవత్సరంలో ఔరంగజేబు విజయంతో అంతంకాగా, ఆసమయంలొనే ఔరంగజేబు కోటను నాశనంచేసి, శిధిలాలను మిగిల్చాడు.

అప్పట్లో గోల్కొండ కోట వజ్రాల వ్యాపారానికి ఎంతగానో ఖ్యాతి సంపాదించింది. ప్రపంచ ప్రసిద్ద కోహినూరు వజ్రం కూడా ఇక్కడినుండే వచ్చినదని చెబుతుంటారు. గోల్కొండలోని గనుల నుండి వచ్చిన ధనరాశులు.. నిజాం చక్రవర్తులను సుసంపన్నం చేశాయని చరిత్రకారులు అంచనా వేశారు. నిజాం నవాబులు మొగల్ చక్రవర్తులనుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత హైదరాబాదును 1724 నుండి 1948 సంవత్సరం దాకా అంటే... భారతదేశంలో విలీనం అయ్యేంతదాకా పరిపాలించారు.

తరువాతి వ్యాసంలో... గోల్కొండ కోటలోని లోపలి కోటల వివరాలు.. బాలా హిస్సారు దర్వాజా, దేవాలయాలు, మసీదులు, రాచమందిరాలు తదితర విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం...!

Share this Story:

Follow Webdunia telugu