Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాదామి చాళుక్యులు ఏలిన "ఆలంపూర్"

బాదామి చాళుక్యులు ఏలిన
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ గ్రామం పేరే "ఆలంపూర్". ఇదే పేరుతోనే గల ఓ మండలానికి ఆలంపూర్ కేంద్రం కూడా. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ ప్రాంతాన్ని... సుమారు ఆరవ శతాబ్ద మధ్య కాలం నుండి రెండువందల సంవత్సరాలపాటు బాదామి చాళుక్యులు పరిపాలించారు.

బాదామి చాళుక్యులు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలలో చాలా దేవాలయములు నిర్మించారు. ఆలంపూర్‌లో ఏడవ శతాబ్దానికి చెందిన ప్రాచీన నవబ్రహ్మ ఆలయం కలదు. ఇది హైదరాబాదునకు సుమారుగా రెండు వందల కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలంపూర్‌ను పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా భక్తులు భావిస్తారు.

తుంగభద్ర, కృష్ణానదులు కూడా ఆలంపూర్‌కు దగ్గర్లోనే కలుస్తాయి. ఈ ప్రాంతంలోని తొమ్మిది నవబ్రహ్మ దేవాలయములు కూడా శివాలయాలే కావడం చెప్పుకోదగ్గ అంశం. బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ నవబ్రహ్మ ఆలయాలు... తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాల బ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, విశ్వ బ్రహ్మ పేర్లతో పిలువబడుతున్నాయి.

ఈ నవబ్రహ్మ ఆలయాలన్నీ కూడా తుంగభద్రానది ఒడ్డున నెలకొని ఉంటాయి. వీటిలో బాల బ్రమ్మ ఆలయం చాలా పెద్దది. అక్కడి శాసనాల ఆధారంగా చూస్తే... దానిని క్రీస్తు శకం 702 కాలం నాటిదిగా పురావస్తు శాఖవారు గుర్తించారు. కాగా... ఈ ప్రాంతంలో మహాశివరాత్రి పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు.

ప్రస్తుతం తారక బ్రహ్మ దేవాలయం పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. ఈ ఆలయం గర్భగుడిలో కనీసం ఎలాంటి విగ్రహం లేకుండా ఉంటుంది. అయితే ఈ ఆలయం గోడలలో ఆరు, ఏడవ శతాబ్దానికి సంబంధించిన పలు శాసనాలు కనిపిస్తాయి. పద్మ బ్రహ్మ దేవాలయం కూడా పాక్షికంగా శిథిలమైపోయింది, ఇందులో ఓ అద్భుతమైన స్ఫటిక శివలింగం కలదు.

స్వర్గ బ్రహ్మ దేవాలయం అలంపూర్‌లోని దేవాయలములలో సుందరమైనదిగా చెప్పబడుతున్నది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునక. ఇందులో ఎనిమిదవ శతాబ్దాంతానికి చెందిన చాలా శాసనాలు కలవు. విశ్వబ్రహ్మ దేవాలయం చాలా మంచి చూడ చక్కని నిర్మాణం. ఇక్కడ రామాయణ మహాభారతాలనుండి దృశ్యాలను శిల్పాలపై మహాకావ్యాలుగా చెక్కినారు.

ఇంకా 9 వ శతాబ్దానికి చెందిన సూర్యనారాయణస్వామి దేవాలయం కూడా ఇదే ప్రాంగణంలో కలదు. ఇక్కడ విష్ణుమూర్తికి చెందిన సుందరమైన విగ్రహాలు కలవు. ఇంకా ఇక్కడ విజయనగర రాజు అయిన కృష్ణదేవరాయలకు చెందిన ఒక నరసింహస్వామి దేవాలయం కూడా కలదు. అలంపూర్ దగ్గరలో పాపనాశనం అను ఇరవైకి పైబడిన శివాలయములు వివిధ ఆకారం, పరిమాణాలలో కలవు. ఇందులో పాపనాశేశ్వర దేవాలయం ప్రధానమైనది.

ఇక, ఆలంపూర్‌లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ప్రదేశం జోగుళాంబ దేవాలయ సమీపంలోని పురావస్తు ప్రదర్శనశాల. దీనిని 1952లో ఏర్పాటుచేశారు. ఇందులో క్రీ.శ. 6 వ శతాబ్దం నుంచి క్రీ.శ. 12వ శతాబ్దాల మధ్య కాలానికి సంబంధించిన పురాతన, చారిత్రక శిల్పాలు భద్రపర్చబడ్డాయి. ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీనిని సందర్శకులకై తెరిచి ఉంచుతారు. నవబ్రహ్మ ఆలయ సందర్శనకు వచ్చే భక్తులందరూ తప్పనిసరిగా ఇక్కడికి కూడా వస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu