పార్వతి "శంకరుడి" కోసం తపస్సు చేసిందిక్కడే...!
ప్రకృతి రమణీయ దృశ్యాలు, భక్తి పారవశ్య ప్రదేశాలు, ఎటుచూసినా అభయారణ్యాలు... కొండలమీద నుంచి జాలువారే జలపాతాలు.. విజ్ఞానం, వినోదం.... ఇవన్నీ వింటుంటే ఏదో దేశంలోనే, రాష్ట్రంలోనో అని అనుకున్నట్లయితే మీరు పప్పులో కాలేసినట్లే..! ఎందుకంటే, ఇవన్నీ ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్లమల ప్రాంతంలోనే ఉన్నాయి కాబట్టి. అందమైన సుందర దృశ్యాలనే కాదు.. తన చెట్ల పొదల మాటున తుపాకీ పట్టుకున్న మావోయిస్టులను, లోకం పోకడ తెలియని అమాయక చెంచు ప్రజలను కూడా దాచుకున్నదీ కీకారణ్యమే...!నల్లమల తూర్పు కనుమలలో ఒక భాగం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, ప్రకాశం, మరియు కడప జిల్లా జిల్లాలలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి కృష్ణానది మరియు పెన్నానదులకు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాన్నే "నల్లమల అడవులు"గా వ్యవహరిస్తారు.నల్లమలలో దర్శనీయ స్థలాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది "ఉమామహేశ్వరం". క్రీస్తు శకం 1232లో కాకతీయులు నిర్మించిన ఈ దేవాలయం హైదరాబాద్ నగరానికి 66 కిలోమీటర్ దూరంలోనూ, మహబూబ్ నగర్‌కు 91, అచ్చంపేటకు 14 కిలోమీటర్ల దూరంలోనూ నెలవై ఉంది. శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారంగా, రెండవ శ్రీశైలంగా భాసిల్లుతోన్న ఈ క్షేత్రంలో పూర్వం పార్వతిదేవి శివుడి కోసం తపస్సు చేసిందట.అలాగే చాలామంది మహర్షులు అనేక వందల సంవత్సరాలపాటు శివుడి కోసం తపస్సు చేసిన ప్రాంతమే ఉమామహేశ్వరమని స్కంద పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది. ఇక్కడి కొండపై వెలసిన పిల్లల మామిడి చెట్టు కిందన శివుడు కొలువై ఉన్నాడు. శివుడి కొప్పులో అర్ధచంద్రాకాంర ఉన్నట్లుగా.. కొండ మొత్తం కూడా అర్థ చంద్రాకారంలో ఉంటుంది. దీని పక్కనే ఉన్న పాపనాశిని నుంచి నిరంతరం ఐదు ధారలుగా ఒకేచోట ఏర్పడి నీరు ప్రవహిస్తూ ఉంటుంది.కొండ కింది ప్రాంతాన్ని "భోగ మహేశ్వరం" అని అంటారు. అమ్మవారికి, స్వామివారికి ఐదు గుడులలో ఐదు లింగాలు ఉంటాయి. పంచలింగాలు, జంట లింగాల దేవాలయాలు కూడా ఉన్నాయి. ప్రతి మకర సంక్రాంతికి ఇక్కడ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. పరమపవిత్రమైన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే 600 మెట్లు ఎక్కాల్సిందే...!నల్లమలలో మరో పర్యాటక ప్రాంతం... "మద్దిమడుగు". ఇక్కడ భక్తులు పిలిస్తే పలికే దైవంగా "మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి" భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నల్లమల లోతట్టు, అటవీ ప్రాంతంలో స్వామివారు స్వయంగా వెలసినట్లు ప్రతీతి. చైత్ర శుద్ధ పౌర్ణమి, కార్తీక మాసాలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు.ఈ సందర్భంగా హనుమద్గాయత్రి యజ్ఞం చేస్తారు. శని, మంగళవారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం, గోధుమ రొట్టెలతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులు స్వామివారికి నైవేధ్యంగా సమర్పిస్తుంటారు. ఈ ప్రాంతం హైదరాబాదుకు 186, మహబూబ్‌నగర్‌కు 147, అచ్చంపేటకు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పేదల ఊటీగా పేరుగాంచిన "మల్లెల తీర్థం" నల్లమలలో చెప్పుకోదగ్గ మరో పర్యాటక ప్రాంతం. అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండ నుంచి జాలువారే నీటి దృశ్యాల మధ్యన వెలసిన పుణ్యక్షేత్రమే ఈ మల్లెల తీర్థం. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉన్న వట్వర్లపల్లి గ్రామం నుంచి 8 కిలోమీట్రల దూరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. కొండలమీద నుంచి దూకే జలపాతం కావటం, మునులు తపస్సు చేసిన ప్రాంతం కావటంతో ఈ ప్రాంతానికి మల్లెల తీర్థం అనే పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు. అటవీ ప్రాంతంలోని ఐదు నీటి బుగ్గల నుంచి నిరంతరం ప్రవహించే నీరే జలపాతంలాగా దూకుతూ భక్తులను, పర్యాటకులను అలరిస్తుంటుంది."
పర్హబాద్ వ్యూపాయింట్" నల్లమలలో ముఖ్యమైన పర్యాటక కేంద్రం. 1999లో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ వ్యూపాయింట్ శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఉండే పర్హాబాద్ చౌరస్తా నుంచి 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అభయారణ్యంలో ఏర్పాటైంది. ఇక్కడి నుంచి చూస్తే నల్లమల ప్రాంతం అంతా అద్భుతంగా కనిపిస్తుంది. ఉదయం, సాయంతం వేళల్లో ప్రకృతి అందం మరింతగా ఇనుమడిస్తుంది.అటవీశాఖ ఎకో టూరిజం ద్వారా పర్యాటకులు నల్లమల అటవీ ప్రాంతాన్ని తిలకించేందుకు వీలుగా ఈ వ్యూపాయింట్‌ను ఏర్పాటు చేశారు. ప్రకృతి అందాలను తిలకించాలనుకునేవారికి నల్లమల ఒక సుందర లోకమని చెప్పవచ్చు. పర్యాటకులు ఇక్కడికి చేరేందుకు అటవీశాఖవారు ప్రత్యేకంగా రెండు వాహనాలను ఏర్పాటు చేశారు. అవి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు తిరుగుతుంటాయి. అయితే ఇక్కడ ప్రైవేట్ వాహనాలను మాత్రం అనుమతించరు.ఇక చివరిగా చెప్పుకోవాల్సిన మరో సుందర ప్రదేశం "మదనపల్లి పిల్లలమర్రి". బొంరాస్‌పేట్ మండలం మదనపల్లిలో గల మర్రి చెట్టు.. పిల్లలమర్రిగా పేరుగాంచింది. చెట్టు మరీ పెద్దదిగాకున్నా, చాలా ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించిన ఈ మర్రిచెట్టు మొదలు ఎక్కడుందో కనుక్కోవటం మాత్రం చాలా కష్టం. దీనిని చూసేందుకు కొడంగల్ నియోజకవర్గ ప్రజలే కాకుండా, రంగారెడ్డి నుంచి కూడా వస్తుంటారు. అయితే ఈ ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా సౌకర్యం అంతగా లేకపోవటంతో ఇతర ప్రాంతాల వారికి ఈ పిల్లలమర్రిచెట్టు ఉన్న విషయం అంతగా తెలియదు. ఇక్కడగల పీర్ల దర్గాకు గ్రామస్థులందరూ రెండేళ్లకోసారి ఉత్సవాలు మాత్రం నిర్వహిస్తుంటారు. దాదాపు 200 సంవత్సరాలుగా ఈ చెట్టు ఉందని పెద్దలు చెబుతుంటారు. కాగా.. ఈ పిల్లలమర్రి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదిలా ఉంటే... తాజాగా మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మనసులను కలచివేసిన, కన్నీరు కార్పించిన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది కూడా నల్లమల అటవీ ప్రాంతంలోని రుద్రకోడూరు సమీపంలోని పావురాల గుట్ట మీదనే. చేదు విషయాలతో పాటు ప్రకృతి అందాలను తనలో దాచుకున్న నల్లమలను నిందించి చేసేది ఏమీ లేదు. మానవ తప్పిదాలకు ప్రకృతి మాత్రం ఏం చేయగలదు.