నాడు కాకతీయ వైభవం.. నేడు "వేలాడే వంతెన" సోయగం...!
ఇంద్రధనుస్సు చీరను కట్టుకుని హొయలొలికించే పరిసరాలు, వినసొంపైన సంగీతాన్ని ఆలాపించే అలలు, చెరువు నడుమన చిన్న చిన్న ద్వీపాలు, వాటి మధ్యలో గాలిలో ఊగుతూ వంతెన... ఆ వంతెనపై నడుస్తూ... చుట్టూ ఉండే ప్రకృతి సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తూ... ఆహా..! ఇంత అందమైన ప్రాంతానికి ఒక్కసారైనా వెళ్తే ఎంత బాగుంటుందోనని మనసు ఉవ్విళ్లూరుతోంది కదూ..?! అయితే మరెందుకు ఆలస్యం.. వెంటనే "లక్నవరం" ట్రిప్ వేసేస్తే సరి..!కాకతీయుల వైభవానికి గుర్తుగా, శతాబ్దాల కాలంగా మరుగునపడి.. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్న లక్నవరం సరస్సు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో ఉంది. ఈ ప్రాంతానికి వెళ్లినట్లయితే అది హరిద్వార్‌ను, విదేశాల్లోని అందమైన ప్రాంతాలను సైతం తలదన్నేదిగా ఉంటూ మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.లక్నవరం సరస్సు.. క్రీస్తుశకం 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయరాజు ప్రతాపరుద్రుని చేతులమీదుగా రూపుదిద్దుకుంది. కళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే కాకతీయ రాజులు ఆనాటి రైతాంగంపట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ కనబర్చేవారనేందుకు ఈ సరస్సు సాక్షీభూతంగా నిలుస్తోంది.రైతులపాలిట వరప్రదాయిని...!
8,700 ఎకరాల పంటపొలాలను సంవత్సరం పొడవునా సస్యశ్యామలం చేస్తూ.. రైతన్నల ఇళ్లను ధాన్యపు రాశులతో నింపుతూ అన్నపూర్ణమ్మగా వేనోళ్ల కొలువబడుతోంది లక్నవరం సరస్సు. ఆనాటి నుంచి ఈనాటిదాకా లక్నవరం సరస్సు రైతులపాలిట వరప్రదాయినిగా ఉంటోంది. దేశమంతటా కరువు వచ్చినా...
ఎత్తైన కొండల నడుమ నిర్మించిన ఈ సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానానికే ఓ సవాల్‌లాగా నిలుస్తుంది. దేవాలయం, కోనేరు, నగరం అనే పద్ధతిలో సరస్సు సమీపంలో శివాలయం, నగరాన్ని స్థాపించే కాకతీయులు లక్నవరంలో మాత్రం దానికి భిన్నంగా సరస్సును మాత్రమే నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత.ఈ సరస్సు లేదా చెరువుకు చెందిన తొమ్మిది ప్రధాన తూముల నిర్మాణం చూస్తే ఔరా అనిపించకమానదు. కాంక్రీటు, ఇనుము వాడకం లేకుండా కట్టిన ఈ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరక పోవటం విశేషంగా చెప్పవచ్చు. ఆనాటి నుంచి ఈనాటిదాకా లక్నవరం సరస్సు రైతులపాలిట వరప్రదాయినిగా ఉంటోంది. 8,700
ఎకరాల పంటపొలాలను సంవత్సరం పొడవునా సస్యశ్యామలం చేస్తూ.. రైతన్నల ఇళ్లను ధాన్యపు రాశులతో నింపుతూ అన్నపూర్ణమ్మగా వేనోళ్ల కొలువబడుతోంది లక్నవరం సరస్సు. దేశమంతటా కరువు వచ్చినా ఇక్కడి రైతులకు మాత్రం కడుపునిండా తిండి పెడుతూ కన్నతల్లిలా సాకుతోంది.సరస్సు నిర్మాణం సమయంలోనే సాగునీటి కోసం... రంగాపూర్, శ్రీరాంపతి, నర్సింహుల, కోట అనే నాలుగు ప్రధాన కాల్వలను నిర్మించారు. ఖమ్మం జిల్లాలోని అటవీ ప్రాంతం లోతట్టు ప్రాంతాలలో కురిసిన వర్షాలతో ఈ సరస్సు నిండుతుంది. 9 ప్రధాన తూముల ద్వారా నీటిని విడుదల చేసి సమీపంలోని "సద్దిమడుగు రిజర్వాయర్"లో నిల్వ చేస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా ఆయకట్టు పొలాలకు నీటిని అందిస్తారు.
ఇదిలా ఉంటే... నాలుగు సంవత్సరాల క్రితం పర్యాటక శాఖ కంట్లో పడింది ఈ లక్నవరం సరస్సు. ఇక్కడి పరిసరాలు, సరస్సు, దాని మధ్యలోని దీవులు.. పర్యాటకానికి అనువుగా ఉండటంతో దాని అభివృద్ధికి నడుం బిగించింది. మొదటగా ఈ సరస్సుపై హరిద్వార్ తరహాలో రాష్ట్రంలో మొట్టమొదటి "వేలాడే వంతెన"ను నిర్మించారు. కాకతీయుల శిల్పకలా సంపదను తిలకించేందుకు వస్తున్న పర్యాటకులకు లక్నవరం సరస్సులోని ఆరు ద్వీపాల రమణీయతను ఆస్వాదించేందుకు వీలుగా దీనిని రూపొందించారు.లక్నవరం సరస్సు దీవుల మధ్య వేలాడే ఈ వంతెనను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతిరోజూ వందలాదిమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఈ సరస్సులో ఆరు దీవులు ఉండగా ఒక్కో దీవిని ఒక్కోరకంగా ముస్తాబు చేసి పర్యాటకులను మరింతగా ఆకర్షించేందుకు పర్యాటకశాఖ తగిన ఏర్పాట్లను చేస్తోంది.కొంగలబోడుగా పిలువబడే ఒక దీవిలో యోగా కేంద్రాన్ని, మరో దీవిలో పిల్లల పార్కును, స్విమ్మింగ్‌ఫూల్‌లను, మరో దీవిలో అధునాతన రెస్టారెంట్, పర్యాటకులు బస చేసేందుకు అనువుగా వివిధ రకాల కాటేజీలను సిద్ధం చేసే పనిలో కూడా పర్యాటకశాఖ బిజీగా ఉంది. దీంతో ఈ ద్వీపాల రమణీయతను ఆస్వాదించేందుకు విదేశీ పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో వస్తారని ఆ శాఖ భావిస్తోంది.వరంగల్ అనగానే కాకతీయుల రాజధానిగా గుర్తుకువచ్చే ఖిల్లా వరంగల్ కోట, గణపతిదేవ చక్రవర్తిచేత నిర్మితమైన పలు సరస్సులు, దేవాలయాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్న సంగతి తెలిసిందే..! ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటగా లక్నవరంలో నిర్మించిన వేలాడే వంతెన కూడా సొంత రాష్ట్రం, పక్క రాష్ట్రాలలోని పర్యాటకులతోపాటు, విదేశీ పర్యాటకులను సైతం విశేషంగా ఆకర్షిస్తూ వరంగల్ జిల్లాకు మరింత వన్నె తెస్తోందనటం ఏ మాత్రం అతిశయోక్తి కాదు.ఎలా వెళ్లాలంటే... వరంగల్ జిల్లా కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలో 202 జాతీయ రహదారికి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ లక్నవరం సరస్సు. ఇక్కడికి ప్రత్యేక బస్సు సర్వీసులు లేకున్నప్పటికీ... ట్రావెల్స్ యజమానులు వాహనాలను అద్దెకు నడిపిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, సొంత వాహనాల్లో వచ్చేవారు.. ములుగు డివిజన్ కేంద్రం దాటిన తరువాత గోవిందరావు పేట మండలంలోని చల్వాయి గ్రామం వద్దగల బుస్సాపూర్ క్రాస్ నుంచి కుడిచేతి వైపుకు 8 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లక్నవరం చేరుకోవచ్చు.