భక్త రామదాసు బందీగా గడిపిన గోల్కొండ కోట చరిత్ర, ప్రాశస్త్యాలకు సంబంధించిన వివరాలను గత వ్యాసంలో చదువుకున్నాం కదూ.. ఇప్పుడు గోల్కొండ కోట సింహద్వారమైన ఫతే దర్వాజా, బాలా హిస్సారు దర్వాజాల గురించి.. వాటిలోని విశేషాలను గురించి విపులంగా తెలుసుకుందాం..!
గోల్కొండ కోట... నాలుగు వేరు వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతో కలిపి 10 కిలోమీటర్ల పొడవుతో కూడిన గోడలను కలిగి ఉంటుంది. కొన్ని బురుజులలో ఈనాటికి కూడా ఫిరంగులను అలాగే నిలిపి ఉంచారు. అలాగే, 8 సింహ ద్వారములు, 4 ఎత్తగలిగే వంతెనలు (డ్రా బ్రిడ్జి), లెక్కలేనన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలు అని అప్పట్లో చాలా ఉండేవి.
ఫతే దర్వాజా (విజయ ద్వారం) :
సింహద్వారాలలో అన్నింటికంటే కిందది మరియు అన్నింటికంటే బయటగా ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారం) నుంచే మనం గోల్కొండ కోటలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఔరంగజేబు విజయం తరువాత ఈ ద్వారం గుండానే తన సైన్యాన్ని నడిపించాడట. ఏనుగుల రాకను అడ్డుకునేందుకు కోటకు ఆగ్నేయపు దిక్కున పెద్ద పెద్ద ఇనుప సువ్వలు ఏర్పాటు చేసారు. ధ్వనిశాస్త్రంలో ఆరితేరిన నిపుణులచే నిర్మించిన ఈ ఫతే దర్వాజాను చూసినట్లయితే ఎవరికయినా సంబ్రమాశ్చర్యాలు కలుగక మానవు. ఎందుకంటే... గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశమునందు చప్పట్లు కొడితే కిలోమీటరు అవతల ఉండే గోల్కొండ కోటలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న "బాలా హిస్సారు" దర్వాజా వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విశేషాన్ని ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాద సంకేతాలు తెలిపేందుకు ఉపయోగించేవారట. కానీ, ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా అది చరిత్రలో మిగిలిపోయింది.
బాలా హిస్సారు దర్వాజా :
అన్ని ముఖ ద్వారాలలోకెల్లా బాలా హిస్సారు దర్వాజా చాలా మనోహరరంగా ఉంటుంది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు మరియు సింహపు బొమ్మలు ఈ రక్షణ ద్వారమునకు ప్రత్యేక అలంకారాలుగా చెప్పుకోవచ్చు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళేందుకు 380 ఎగుడు, దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువాతనే మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపము కనిపిస్తుంది.దర్బారు హాలుగా ఉపయోగించే ఈ కట్టడంలో 12 ఆర్చీలు, 3 అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృఢమైన స్థంబాలతో విభజించినారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీల ద్వారా వెనుక ద్వారం తెరచుకుంటుంది. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనం కనిస్తుంది.కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపంలో అబుల్ హసన్‌లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్ముతారు. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది. అదేంటంటే... జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమైన కూలరులాగా ఉంటుంది.