Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం "నెల్లూరు"

చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం
FILE
ఒకప్పుడు శాతవాహనులు, పల్లవులు, చోళులు, పశ్చిమ చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు, గోల్గొండ, ఆర్కాట్ నవాబుల పాలనలో దేదీప్యమానంగా వెలిగిన ప్రదేశమే "నెల్లూరు". "నెల్లు" అంటే తమిళంలో "వరి" అని అర్థం కాగా... తమిళనాడును ఆనుకుని ఉన్నందువల్ల నెల్లు అనేది క్రమంగా నెల్లూరుగా మారిందని పెద్దలు చెబుతుంటారు. ప్రస్తుతం దీన్నే "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా సంబోధిస్తున్నారు.

నెల్లూరుకు విక్రమసింహపురి అనే పేరు కూడా ఉంది. విక్రమసింహ మహావీర, మనుమసిద్ధి మహారాజు సింహపురి రాజధానిగా నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. మనుమసిద్ధి కాలంలో ఈ ప్రాంతం సస్యశ్యామలమై అత్యధిక వరి ధాన్యపు ఉత్పత్తితో విలసిల్లేది. అందుకే ఈ ప్రాంతానికి నెల్లివూరు అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశ స్థలపురాణం, చరిత్రల ప్రకారం కాలక్రమంలో నెల్లివూరు.. నెల్లూరుగా రూపాంతరం చెందింది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ విద్యా కేంద్రంగా ప్రసిద్ధి చెందింది.

అనేకమంది రాజుల ఏలుబడిలో ఉన్న నెల్లూరులో నేడు తెలుగు, తమిళం, ముస్లిం, ఆంగ్ల సంస్కృతుల మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది. రాజుల పాలన అనంతరం క్రీ.శ. 1781వ సంవత్సరంలో బ్రిటీష్‌వారి ఆధీనంలోకి వచ్చిన నెల్లూరు జిల్లా ఆంధ్రరాష్ట్రంలో చారిత్రక నేపథ్యంగల ప్రాంతంగా గుర్తింపు పొందింది. చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఈ ప్రాంతంలో చూడాల్సిన అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి.
సంజీవని పర్వత సోయగాలు..!
14వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఉదగిరి కోటలోని 138 మీటర్ల ఎత్తైన కోట శిఖరం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో పలు వ్యాధుల్ని నిర్మూలించే మూలికలు ఈ కోట ప్రాంతంలో లభించటంవల్ల దీన్ని సంజీవని పర్వతం అని కూడా పిలుస్తుంటారు...
webdunia


నేలపట్టు పక్షి కేంద్రం...
నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో, సూళ్లూరుపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఈ నేలపట్టు పక్షి కేంద్రం ఉంది. పులికాట్ తీరంలో 486 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ఈ పక్షికేంద్రం విస్తరించి ఉంది. ఇక్కడికి అమెరికా, చైనా, అంటార్కిటికా లాంటి సుదూర ప్రాంతాల నుంచి సైబీరియన్ కొంగలు, ఓపెన్ బిల్డుస్ట్రోక్, గ్రేపెలికాన్.. తదితర 160 రకాల పక్షులు వలస వస్తుంటాయి.

ప్రకృతిని ఆరాధించేవారు, పక్షి ప్రేమికులు తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశం ఈ నేలపట్టు పక్షి కేందం. పర్యావరణ పరిజ్ఞానానికి ఆటపట్టుగా పేరుగాంచిన అధ్యయనకేంద్రం కూడా ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిందే. ఇందులో గ్రంథాలయం, మ్యూజియం, దృశ్య శ్రవణ విభాగం, ఆడిటోరియం తదితరాలను చూడవచ్చు.

పులికాట్ సరస్సు...
నెల్లూరు జల్లాలోని సూళ్లూరుపేటకు పది కిలోమీటర్ల దూరంలో ఈ పులికాట్ సరస్సు ఉంది. మనదేశంలో సముద్ర జలాలతో ఏర్పడిన అతి పెద్ద సరస్సు ఇది. 580 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ సరస్సు.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. ఇందులోని నీరు ఒకవైపు ఉప్పగానూ, మరోవైపు తియ్యగాను ఉంటుంది. రాష్ట్ర పర్యాటక శాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి ఏడాది ఫ్లెమింగో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు.

జొన్నవాడ కామాక్షి ఆలయం...
నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలో జొన్నవాడ కామాక్షి ఆలయం భక్తజనుల పూజలందుకుంటోంది. సమస్యల్ని పరిష్కరించి, వ్యాధులనుండి స్వస్థతను ప్రసాదించే దేవతగా కామాక్షి అమ్మవారు కీర్తించబడుతున్నారు. శ్రీ శంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రం ఈ ఆలయంలో ఉంది. తిక్కన ఈ ఆలయ ప్రాంతంలోనే యజ్ఞం చేసి సోమయాజి అయ్యాడని చరిత్ర చెబుతోంది. ఈఆలయంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో పది రోజులపాటు బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, పూలంగి సేవ తదితరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

మైపాడు సముద్ర తీరం...
నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలోగల మైపాడు సముద్ర తీరం చూడదగ్గ మరో పర్యాటక ప్రాంతం. ఇక్కడి సముద్రంలో పడవలపై విహారం ప్రత్యేకాకర్షణగా చెప్పవచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వారానికి రెండు రోజులు పర్యాటకులు సేద తీర్చుకునేందుకు ఈ బీచ్‌కు వస్తుంటారు. చిన్నా పెద్దా తేడా లేకుండా పర్యాటకులు సముద్రంలో స్నానాలు చేసి సంతోషంగా గడుపుతారు.

కృష్ణపట్నం ఓడరేవు...
నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలోని కృష్ణపట్నం రేవు, చోళుల కాలంలో సముద్ర వర్తకానికి పేరుగాంచింది. విహారయాత్రకు ఇది చాలా అనుకూలమైన సముద్రతీరం.

webdunia
FILE
కస్మూరు దర్గా...
నెల్లూరుకు 25 కిలోమీటర్ల దూరంలో కస్మూరు గ్రామం ఉంది. ఇక్కడ ముస్లిం యోగిపుంగవులు హజరత్ కరీముల్లా షా ఖాద్రీగారి దర్గా వెలసింది. కులమతాలకు అతీతంగా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తజనులు ఈ దర్గాను దర్శించి తమ సమస్యలను, బాధలను తొలగించాల్సిందిగా వేడుకుంటుంటారు.

ఉదయగిరి కోట...
నెల్లూరుకు 96 కిలోమీటర్ల దూరంలోగల ఉదయగిరి కోట ఆనాటి చరిత్రకు సాక్షీభూతంగా నిలుస్తోంది. 14వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించిన ఈ కోటలోని 138 మీటర్ల ఎత్తైన కోట శిఖరం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆ కాలంలో పలు వ్యాధుల్ని నిర్మూలించే మూలికలు ఈ కోట ప్రాంతంలో లభించటంవల్ల దీన్ని సంజీవని పర్వతం అని కూడా పిలుస్తుంటారు. పల్లవులు, చోళరాజులు నిర్మించిన అనేక ఆలయాలు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.

పెంచల కోన...
నెల్లూరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఈ పెంచలకోన ఉంది. ఇక్కడ కొండపై నిర్మించిన "శ్రీ పెనుశిల నరసింహస్వామి ఆలయం" ప్రసిద్ధి చెందింది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు ఈ పెంచలకోనలో పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. కణ్వ మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లుగా పూర్వీకులు చెబుతుంటారు.

అన్న సముద్రం...
నెల్లూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్న సముద్రం ఊర్లోని "ఖాజా రహంతుల్లా మసీదు" సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కుల మతాలకు అతీతంగా ప్రజలు, పర్యాటకులు ఇక్కడి మసీదును సందర్శిస్తుంటారు.

బారా షహీద్ దర్గా...
నెల్లూరు శివార్లలోగల ఈ బారా షహీద్ దర్గాలో ఉన్న పెద్ద సరస్సు వద్ద ప్రతి సంవత్సరం రొట్టెల పండుగ కన్నుల పండువగా నిర్వహిస్తుంటారు. ఈ సరస్సులో రొట్టెలు వదిలినట్లయితే తమ కోర్కెలు నెరవేరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. ఈ పండుగ సమయంలో దేశ విదేశాల నుంచి వచ్చిన లక్షలాది భక్తులతో సరస్సు నిండిపోతుంటుంది.

వెంకటగిరి...
నెల్లూరుకు 89 కిలోమీటర్ల దూరంలోగల వెంకటగిరి చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ తయారైన చీరలు తెలుగింటి ఆడపడుచులకు ప్రీతిపాత్రం. బంగారు పోగులను, దారాలను కలగలిపి రూపొందించే వెంకటగిరి చీరలు విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంటాయి. అలాగే వెంకటగిరి సంస్థానాధీశుల కోటలను కూడా ఇక్కడ చూడవచ్చు.

పైన చెప్పుకున్నవేగాక... తల్పగిరి రంగనాథస్వామి ఆలయం, శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం, నెల్లూరుకు వంద కిలోమీటర్ల దూరంలోని సూళ్లూరుపేట కళింగనదీ తీరంలోగల చెంగాలమ్మగుడి తదితర ఆలయాలను చూడవచ్చు. అలాగే చెంగాలమ్మ గుడికి సమీపంలో ఉండే రాకెట్ కేంద్రమైన శ్రీహరికోటను దర్శించవచ్చు.

ఇంకా చెప్పుకోవాలంటే.. పెన్నానదిపై సోమశిలలో నిర్మించిన డ్యామ్, రామతీర్థం, మున్నార్ పోలూరు, గాంధీజీ కాసేపు గడిపారని చెబుతుండే పల్లిపాడు, బుచ్చిరెడ్డిపాలెం, భైరవకొండ, ప్రభాసగిరిపట్నం, నరసింహుని కొండ, సిద్ధులయ్య కొండ, నవాబుపేట, కొత్తపల్లి, వెంకటేశ్వరపాలెం తదితర అనేక పర్యాటక ప్రాంతాలు దేశ, విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu