"
కొండవీడు మందేరా ... కొండపల్లి మందేరాకాదనువాడుంటే ... కటకందాకా మందేరా...!"అంటూ శ్రీకృష్ణదేవరాయల కాలంలో వీరత్వం ఒలికించే ఈ పాటకు నెలవైన "కొండపల్లి కోట"ను కలిగి ఉన్న గ్రామమే "కొండపల్లి". కొండపల్లి అంటేనే కొండపల్లి కొయ్య బొమ్మలతోపాటు కొండపల్లి దుర్గం కూడా గుర్తు రావడం సహజం. అయితే కొండపల్లి కోట కంటే, కొండపల్లి కొయ్య బొమ్మలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయన్నది అందరికీ తెలిసిందే...!అదలా ఉంచితే పైన చెప్పుకున్న పాట వెనుక ఓ చిన్న కథ ఉంది. అదేంటంటే... శ్రీకృష్ణ దేవరాయలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు శకునం చూడటం ఆయనకు అలవాటు. కటకంపై యుద్ధానికి వెళుతూ శకునం చూడమని మంత్రి తిమ్మరుసుని పంపించాడట. తిమ్మరసు ఓ రజకవాడలోంచి వెళ్తుంటే, ఓ చాకలివాడు "కొండవీడు మందేరా, కొండపల్లి మందేరా, కాదనువాడుంటే, కటకందాకా మందేరా...!" అని పాడుతున్నాడట. ఇంకేముంది శకునం బాగుందని తిమ్మరుసు రాయలవారిని యుద్ధానికి పంపించారట.ఇక కొండపల్లి కోట సంగతి కొస్తే... కృష్ణా జిల్లా, ఇబ్రహీం పట్టణం మండలానికి చెందిన కొండపల్లి గ్రామంలో నెలవైనదే "కొండపల్లి కోట లేక దుర్గం". దీనిని కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తరువాత 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు కళింగ జైత్రయాత్రలో భాగంగా ఉదయగిరిపై విజయం సాధించి.. ఉదయగిరితోపాటు కందుకూరు, అద్దంకి, కొండవీడు, కొండపల్లి, నాగార్జున సాగర్, బెల్లంకొండ, కగిరి దుర్గాలను సైతం వశపరచుకున్నాడు.అలా రాయలవారి అధీనంలోకి వచ్చిన కొండపల్లి కోట...ఆ కాలంలో శత్రు దుర్భేద్యమైన కోటగా ప్రసిద్ధిగాంచింది. ఈ కోటలో ఇప్పటికీ మూతంస్తుల రాతిబురుజు ఉంది. అలాగే రాయలవారి కాలంనాటి ఏనుగుశాల, భోజన శాలలు కూడా చూడదగ్గవి. సుమారు 18 కిలోమీటర్ల చుట్టుకొలత ఉన్న కోట కార్తీక మాసంలో సందర్శకులతో కిటకిటలాడుతూ ఉంటుంది.కొండపల్లి కోట కృష్ణదేవరాయల పాలన తరువాత ఎన్నో రాజ వంశాల పాలనలో కొనసాగింది. అంతేకాకుండా, అది ఒక వ్యాపార కేంద్రంగా కూడా ఉపయోగపడింది. బ్రిటిషు పాలకులు తమ సైన్యానికి శిక్షణ ఇచ్చేందుకు ఈ కోటను వాడుకునేవారు. ఇక్కడి విరూపాక్ష దేవాలయం వనవిహారానికి చాలా అనువుగా ఉంటుంది.
అలాగే... ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలకు కూడా పుట్టినిల్లు అయిన ఈ "కొండపల్లి" గ్రామం విజయవాడ నగరానికి 16.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తెలుగువారి సృజనాత్మకతకు గీటురాళ్ళుగా నిలిచిన కొండపల్లి బొమ్మలు ముచ్చటైన మోముతో ముద్దులొలుకుతూ మనల్ని కట్టిపడేస్తాయి. చెక్కతో వివిధ రూపాలలో అత్యద్భుతంగా, అందంగా తయారయ్యే ఈ బొమ్మలు దేశ విదేశాలలో ఎందరినో ఆకట్టుకుంటూ.. తరతరాలుగా ఎన్నెన్నో కుటుంబాలకు అన్నం పెడుతూ వచ్చాయి.
ఎలాంటి నమూనాలు, అచ్చులు లేకుండా... కేవలం కొన్ని రకాల పనిముట్లను మాత్రమే ఉపయోగించి చేతితో తయారు చేయటమే ఈ కొండపల్లి బొమ్మల ప్రత్యేకత. అదీ ఒకసారి తయారు చేసిన బొమ్మలాంటిదే మరోటి చేయాలంటే, మళ్లీ మొదటి బొమ్మను చేసినప్పుడు ఎంతటి కళాదృష్టితో, ఏకాగ్రతతో చేశారో... అంతే కళాదృష్టి, ఏకాగ్రతలతోపాటు అంతే సమయంలో తయారు చేయటమే ఈ బొమ్మల విశేషం. ఇది కొండపల్లి కళాకారులకు మాత్రమే సాధ్యమైన "పనితనపు కళ"గా చెప్పవచ్చు.
తేలికైన "పొనికి" అనే చెక్కతో తయారు చేయబడే ఈ కొండపల్లి బొమ్మల తయారీలో... ముందుగా పొనికి చెక్కపై తయారు చేయాల్సిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. తరువాత రంపపు పొట్టు, చింత గింజల పొడితో ఈ చెక్కబొమ్మకు రూపాన్ని కల్పిస్తారు. బొమ్మకు ప్రత్యేకంగా వేరే అతకవలసిన భాగాలు, మార్పులు చేస్తారు. దీనికి సున్నం పూసి ఆరబెట్టి... లక్కపూతతో అందమయిన రంగులతో బొమ్మను ఆకర్షణీయంగా చేస్తారు.
ఇలా తయారైన కొండపల్లి బొమ్మల్లో ఏనుగు అంబారి, మావటివాడు, నృత్యం చేసే అమ్మాయి బొమ్మలు, పల్లె పడుచులు లాంటి బొమ్మలు విపరీతంగా ఆకర్షిస్తాయి. ఈ తరహా బొమ్మలు మాత్రమే కాక అన్ని రకాల జంతువుల, పక్షుల బొమ్మలు సైతం కొండపల్లి కళాకారుల చేతుల్లో ప్రాణం పోసుకున్నాయి. దేనికదే వైవిధ్యంగా, చూపరులను ఇట్టే ఆకర్షించే ఈ కొండపల్లి బొమ్మలు విదేశీయుల గృహాల్లో సైతం కొలువుతీరడం గమనార్హం.
ఇక చివరిగా... కొండపల్లి కొయ్య బొమ్మలకు సరైన ఆదరణ లేకపోవడం వల్ల దేశీయంగా మిగిలిపోయాయేగానీ, ఇవి అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోని బొమ్మలంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు సంక్రాంతి, దసరాల్లాంటి పండుగ సందర్భాలలో ప్రజలు కొత్త బట్టలతో పాటు కొత్త బొమ్మలను కొనటం ఆనవాయితీగా ఉండేది. అయితే నేటి చదువుల వేట, పరీక్షల్లో పోటీ మొదలయ్యాక బొమ్మల కొలువు అటకెక్కింది.