Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందమైన ప్రకృతి ప్రాంతం పట్టిసీమ

Advertiesment
పర్యాటకం
, బుధవారం, 28 సెప్టెంబరు 2011 (19:17 IST)
పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం మండలానికి చెందిన పట్టిసీమ గ్రామాన్ని ఓ అందమైన ప్రకృతి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. గోదావరి ఒడ్డున వెలసిన ఈ గ్రామం చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణానికి నిలయంగా విలసిల్లుతోంది. కేవలం ప్రకృతి అందంతోనే కాకుండా ఓ సుప్రసిద్థ పుణ్యక్షేత్రంగా కూడా ఈ గ్రామం పేరు సంపాదించింది.

గ్రామం నుంచి కొద్ది దూరంలో గోదావరిలో దేవకూట పర్వతంపై వెలసిన వీరభద్రస్వామి, భావనారాయణ స్వామి వార్ల ఆలయాల వల్లే ఈ ఊరికి పేరు వచ్చిందంటే అతిశయోక్తి కాదు.

ఆలయ విశేషాలు
పాపి కొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది.

ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతుంటాయి. పట్టిసం అని, పట్టిసీమ అని రెండు రకాలుగా పిలిచే ఈ ఊరిలో వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం అంటే విశేషమైనదిగానే పేరు పొందింది.

ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టూ ఉన్న ఊర్ల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

వసతి సౌకర్యాలు
కొంతకాలం క్రితం వరకు ఈ వీరభద్రస్వామి దేవస్థానం అంతగా అభివృద్ధి చెందని కారణంగా ఇక్కడ సౌకర్యాలు సైతం అరాకొరగానే ఉండేవి. అయితే ఇటీవలి కాలంలో దేవస్థానంకు రాబడి పెరిగిన కారణంగా విస్తరణ కార్యక్రమాల్లో భాగంగా దేవాలయం ప్రాంతాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో ఇక్కడ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.

రవాణా సౌకర్యాలు
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుంచి ఈ పట్టిసీమ దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతినీ ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu