Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిత్తూరు జిల్లా తలకోనలో పర్యాటకుల సందడి...

చిత్తూరు జిల్లా తలకోనలో పర్యాటకుల సందడి...
, సోమవారం, 2 మే 2016 (11:49 IST)
ఆకాశాన్ని తాకినట్టుండే భారీ వృక్షాలు.. నింగీనేలను ఏకం చేస్తోందా అనిపించే అతిపెద్ద జలపాతాలు.. కనుచూపు మేరా పచ్చదనం.. గలా గలా పారే సెలయేరు... ఏటి ఒడ్డున కోరిన వరాలిచ్చే సిద్ధేశ్వరుడు... ఇవన్నీ చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక క్షేత్రం తలకోన సొంతం. వేంకటేశ్వరుడు కొలువైన తిరుమల శేషాచల పర్వతాలకు పశ్చిమ అంచున ఈ సుందర ప్రాంతం ఉంది. నిత్యం పచ్చదనంతో అలరారే తలకోన భక్తులను, పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ప్రజలు తలకోనకు క్యూకడుతున్నారు. దేశం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు తలకోనకు చేరుకుంటున్నారు. తలకోన అందాలపై ప్రత్యేక కథనం...
 
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటైన తలకోన ప్రకృతి అందాలకు నెలవు. సముద్ర మట్టానికి 700 అడుగుల ఎత్తులో శేషాచల కొండల అంచుల్లో ఉన్న ఈ చల్లటి ప్రాంతం వేసవి విడిదిగా ఖ్యాతికెక్కింది. భారీ బడ్జెట్‌తో వేసవి విడిది చేయలేని పేదలకు తలకోన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ప్రకృతి అందాలతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న సిద్ధేశ్వరస్వామి ఆలయానికి ఎంతో పేరుంది. భక్తి ప్రపత్తులతో స్వామిని దర్శిస్తే సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. 
 
మానసిక ఉల్లాసానికి కొందరిస్తే మరికొందరు ప్రకృతి అందాలను తమ హృదయాలలో, కెమెరాలలో నిక్షిప్తం చేసుకునేందుకు వస్తున్నారు. తిరుపతి నుంచి 67 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోనకు వేసవిలో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంది. 40 డిగ్రీల ఉష్ణోగ్రత పైబడుతున్న వేసవిలో సైతం చల్లటి వాతావరణంలో తలకోనలోని గుండాల్లో జలకాలాడడం జీవితంలో మరుపురాని అనుభూతి నిస్తుంది. 
 
ఈ ప్రాంతం శేషాచల పర్వతానికి తలభాగం కావడంతో తలకోనగా పిలుస్తారు. ఈ శేషాచల పర్వత తల తూర్పుభాగాన ఉన్న కుడివైపు తిరుమల గిరుల్లోని తీర్థాన్ని పాపవినాశనంగాను, పశ్చిమ వైపు ఉన్న తీర్థాన్ని శిరోద్రోణి తీర్థంగాను పిలుస్తారు. తిరుమలలోని పాపవినాశనం తీర్థానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తలకోనలోని శిరోద్రోణి తీర్థానికి అంతటి ప్రాధాన్యం ఉంది.
webdunia
 
 
తలకోనలో బస్సు దిగామంటే నీటి ప్రవాహం బడ్డున ప్రశాంత వాతావరణంలో సిద్ధేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయానికి రెండు కిలోమీటర్లు తూర్పు వైపు కాలిదారిన ప్రకృతి లోయల నడుమ నడుస్తూ వెళితే శిరోద్రోణి తీర్థం వస్తుంది. ఇక్కడ ఎత్తైన బండపొరల మధ్య నుంచి నిత్యం నీరు పడుతూ ఉంటుంది. ఈ తీర్థంలో మునిగితే పాపాలు తొలగిపోతాయని, సిద్ధేశ్వరుని ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఎంతో విశాలమైన అరుదైన వృక్షాలను దాటుకుంటూ సాగుతూ వచ్చే ఈ నీటికి అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ నీటిలో స్నానమాచరించేందుకు యువకులు పోటీ పడుతుంటారు. ఇక్కడ మునిగితే వృద్ధులు ఇక తమకు ముక్తి దొరికినట్టుగా భావిస్తుంటారు. 
 
వాటర్‌ ఫాల్స్‌కు వెళ్ళే మార్గంలో రెండు ఎత్తైన మామిడి వృక్షాలునన్నాయి. వీటిని రామలక్ష్మణ వృక్షాలుగా పిలుస్తుంటారు. శ్రీరామ చంద్రుడు సీతా అన్వేషణ సమయంలో ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఈ చెట్ల వద్ద సేద తీరడంతో వీటికి రామలక్ష్మణ వృక్షాలు పేరొచ్చిందని భక్తుల నమ్మకం. కవలలుగా ఉన్న భారీ వృక్షాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 
 
రామలక్ష్మణ వృక్షాలకు దక్షిణం వైపున నెలకోనకు వెళ్ళే దారిలో తీగజాతికి చెందిన అతి పురాతన గెల్ల తీగ ఉంది. ఇది ఐదు కిలోమీటర్ల పొడవు శాఖోపశాఖలతో కొండ కోనల్లో విస్తరించింది. అరుదైన ఈ తీగ జాతి చెట్టును చూసిన ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యానికి లోనవుతుంటారు. పిల్లలు ఈ తీగ శాఖలను పట్టుకుని ఊగడానికి ఉబలాడపడుతుంటారు. 
 
ఎత్తైన నల్లటి ప్లేట్లపై నుంచి నీరు నిత్యం మధ్యలోని బండలపైన పడి అక్కడి నుంచి లోతైన గుండంలోకి చేరుతుంటుంది. నడకమార్గంలో నీళ్లు పడే బండల వద్దకు చేరుకుని చూశామంటే ఈ జలపాతం భూమ్యాకావాలను ఏకం చేస్తోందా అనే భ్రమను కలిగిస్తుంది. సూర్యకిరణాలు చేరకపోవడం, ఎత్తైన భారీ వృక్షాలు, జలపాతం ఉండటంతో ఇక్కడి ఎంతటి ఎండయినా ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు మించదు. నీటిని తాకితే జివ్వుమనేలా ఉంటుంది. అడవి కోళ్ళ అరుపులు, అరుదైన జంతుజాలాల అరుపులు, ఉడుతల కిచకిచలు, అత్యంత అరుదైన కోతులు తలకోనలో దర్శనమిస్తాయి. తలకోనలో పర్యాటక శాఖతో పాటు అటవీశాఖ, టిటిడి వారు అతి తక్కువ రేట్లకే గదులను అద్దెకు ఇస్తున్నారు. దీంతో పర్యాటకులు తలకోనకు క్యూకడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను రహస్యంగా పెళ్ళి చేసుకోలేదు.. నా సిస్టర్‌కే మ్యారేజ్ జరిగింది: పూనమ్ బజ్వా