వైభవోపేతంగా లేపాక్షి వేడుకలు : నందమూరి బాలకృష్ణ - మహేష్ బాబు, తమన్నా వస్తారో రారో...(ఫోటోలు)
గత సంవత్సరం నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సంవత్సరం వేడుకలు నిర్వహించాలని హిందుపురం శాసనసభ్యుడు నందమూరి హరికృష్ణ సూచించారు. నాటి సాంస్కృతిక కార్యక్రమాలు పున
గత సంవత్సరం నిర్వహించిన లేపాక్షి ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సంవత్సరం వేడుకలు నిర్వహించాలని హిందుపురం శాసనసభ్యుడు నందమూరి హరికృష్ణ సూచించారు. నాటి సాంస్కృతిక కార్యక్రమాలు పునరావృతం కారాదని, కొత్తదనం కనిపించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరినీ అందరినీ అలరించే విధంగా లేపాక్షి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించాలన్నారు. ఉత్సవాల కార్యచరణ, ప్రణాళికపై బుధవారం పర్యాటక, సాంస్కృతికశాఖ అధికారులు, అనంతపురం జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధుల మధ్య లోతైన చర్చ జరిగింది.
విజయవాడలో జరిగిన ఈ ఉన్నతస్థాయి సమావేశంలో రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా, అనంతపురం జాయింట్ కలెక్టర్ రమామణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ సాంప్రదాయ విలువలు పాటిస్తూనే లేపాక్షి ఉత్సవాలను వైవిధ్యభరితంగా, వినూత్నంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేసామన్నారు.
రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించనుండగా, తొలిరోజు హేమమాలిని, మలిరోజు శివమణి ప్రధాన ఆకర్షణగా ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. సినీతారలు సందడి చేసేలా ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే మహేష్ బాబు, తమన్నా వంటి తారలను సంప్రదించామని, వారు ఖరారు చేయవలసి ఉందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం కార్యక్రమాన్ని ఐదు జోన్లుగా విభజించామని ప్రధాన వేదిక, సాంస్కృతిక కార్యక్రమాలు, సన్మానాల వంటివి ఒక జోన్‌గా, బజార్ జోన్‌లో వివిధ ప్రదర్శనలు, కొనుగోళ్లు, అమ్మకాలు, ఆహార పండుగలు ఉంటాయన్నారు.
ప్రత్యేకంగా చిన్నారులు, మహిళలను ఉల్లాసపరిచేలా చేపట్టే కార్యక్రమాలు ఒక జోన్‌లో ఉంటాయని, కోకో, కబడ్డీ, కర్రసాము, కత్తిసాము వంటి సాంప్రదాయ క్రీడా పోటీలు ప్రత్యేక జోన్‌గా నిర్వహించటం జరుగుతుందన్నారు. వారసత్వ జోన్‌లో దేవాలయాలకు సంబంధించిన అంశాలు ఉంటాయని మీనా స్పష్టం చేసారు. కార్యక్రమం నిర్వహణ కోసం ఇప్పటికే రూ.2 కోట్లు మంజూరు చేసామని, నిధుల సమస్య లేకుండా వేడుకలను దిగ్విజయం చేయాలన్నదే పర్యాటక శాఖ ఉద్దేశ్యమన్నారు.
ఎపిటిడిసి ఎండి హిమాన్హు శుక్లా మాట్లాడుతూ తొలి రోజు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడిని ఆహ్వానిస్తుండగా, రెండో రోజు కార్యక్రమాలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయిడిని ఆహ్వానిస్తున్నామన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తొలుత జలహారతి కార్యక్రమం చేపడదామని, తరువాత వేడుకలను ప్రారంభిద్దామని నందమూరి బాలకృష్ణకు సూచించగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ఈ నేపధ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ లేపాక్షిలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కనీసం 20 గదులకు తక్కువ కాకుండా వసతి గృహాన్ని నిర్మించవలసి ఉందని మీనా దృష్టికి తీసుకురాగా, 2017-2018 బడ్జెట్‌లో అందుకు అవసరమైన నిధులు కేటాయిస్తామన్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని గతంలో ఫిబ్రవరి 24, 25 తేదీలలో నిర్వహించాలని భావించినప్పటికీ, ఉత్సవాల తేదీలను మార్చి 9, 10 తేదీలకు మార్చారు. స్వయంగా సినీ కళాకారుడు అయిన బాలకృష్ణ, సాంస్కృతిక కార్యక్రమాల పరంగా ప్రత్యేకతను చూపాలన్న ఆకాంక్షలో ఉన్నారు. రెండు రోజుల పాటు ఉదయం నుండి రాత్రి వరకు సందడి ఉండాలని, ఎవ్వరికీ ఇబ్బంది రాని రీతిలో ఏర్పాట్లు ఉండాలన్నారు. ఈ సమావేశంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆర్‌డి జి.గోపాల్, ఇఇ ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.