Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవిత్రత, ప్రాచీనతలకు నెలవైన "భట్టిప్రోలు స్థూపం"

పవిత్రత, ప్రాచీనతలకు నెలవైన
యధార్థమైన బుద్ధుని ధాతువు అయిన భట్టిప్రోలు స్థూపం... ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఉన్న అమరావతి తర్వాత, అత్యంత ప్రాచీన చారిత్రక స్థలాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. శాసనాల రీత్యా ఈ స్థూపం అశోకుడి కాలంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

తెలుగుదేశ చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమయిన భట్టిప్రోలుకు విశిష్టస్థానం కలదు. ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖ చరిత్ర గలిగినదిగా కీర్తించబడిన బృహత్ స్థూపమే భట్టిప్రోలు. క్రీ. పూ. 4-3 శతాబ్దాల నాటి ఈ స్థూపం భవననిర్మాణ రీతులలోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి. గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు ఈ ప్రాంతాన్ని దర్శించారన్న అభిప్రాయం చరిత్రకారులలో ప్రబలంగా ఉంది.

క్రీ.శ. 1870 నుండి భట్టిప్రోలు స్థూపం చారిత్రక ప్రాశస్త్యం వెలుగులోకి వచ్చింది. ఈ స్థూపం చక్రాకార పథం కలిగి ఉంటుంది. స్థూపం ఎత్తు 9 నుంచి 12 అడుగులు కాగా, వ్యాసం 132 అడుగులు. స్థూపం మధ్య ఆమూలాగ్రంగా ఇటుకలతో అమర్చిన రంధ్రం ఉంటుంది. రంధ్రం చుట్టూ ఇటుకలను పద్మాకారంలో అమర్చారు. స్థూపం చుట్టూ ప్రదక్షిణ పథము, అంచున పాలూరి ప్రాకారం ఉండేవి. ప్రాకార వ్యాసం 148 అడుగులు. కొన్ని ప్రాకార స్థంభాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. స్థూపం ఆవరణ వైశాల్యం 1,750 చదరపు అడుగులు.

భట్టిప్రోలులో లభ్యమైన అవశేషాలన్నింటిలోనూ బండరాయి పెట్టెలపైన లిఖించిన శాసనాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచాయి. ఇవి లిపి శాస్త్రపరంగానూ, భాషా మత ప్రచారాల వల్ల ఎంతో ప్రసిద్ధి చెందాయి. స్థూపం మధ్యనున్న రంధ్రం నుండి మూడు శిలా మంజూషికాలు ఒకదాని దిగువున మరొకటి లభించాయి. మొదటి రాయిలో ధాతువుని నిక్షేపించారు. ధాతువుని పీతాంబరంలో భద్రపరచిన చిహ్నాలు కూడా ఇక్కడ ఉన్నాయి.

అంతేగాకుండా... బంగారం వెండిలాంటి ఆభరణాలు కూడా ఇక్కడ లభించాయి. ఇలాంటి బండరాయి పేటికలు ప్రపంచంలోనే మరెక్కడా లభించక పోవడం గమనార్హం. పవిత్రత, ప్రాచీనత, పరిమాణం, ధాన్యకటక స్థూపంతో తులతూగుతుండే భట్టిప్రోలు సముద్ర తీరానికి సమీపంలో ఉండటంతో... విదేశీ వాణిజ్యానికి కూడా కేంద్రంగా ఉండేది. అప్పట్లో భట్టిప్రోలు అత్యంత ఐశ్వర్యవంతమైన ప్రాంతంగా చెప్పబడేది.

ఆ నాటి ప్రజలు భవన నిర్మాణంలో సాధించిన నైపుణ్యానికి నిదర్శనంగా నిలిచిన భట్టిప్రోలు స్థూపం వద్ద లభించిన శాసనములు, మౌర్యుల కాలంనాటి లిపి అయిన బ్రహ్మీ లిపిలో చెక్కబడి ఉన్నాయి. అంతేగాకుండా అక్షర శైలిలో కూడా ప్రత్యేకతలు ఉన్నాయి. అందుకే, భాషకన్నా భావం మిన్న అనే నానుడికి భట్టిప్రోలు యదార్థ సాక్ష్యంగా నిలిచింది.

బౌద్ధ శిల్పాలకు నెలవై చరిత్రకారులకు ఆధారాలుగా సుప్రసిద్ధమైన చరిత్రను సృష్టించుకున్న బౌద్ధ క్షేత్రమైన భట్టిప్రోలును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది.. దేశవిదేశాలకు మన చారిత్రక ఆధారాలను వెల్లడించేందుకు ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు కృషి చేస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu