నాటి విక్రమ సింహపురి రాజ్యం... నేటి నెల్లూరు అందాలు.. విశేషాలు..!!
వి. నాగార్జున
, సోమవారం, 13 ఆగస్టు 2012 (22:05 IST)
WD
నెల్లూరు ఈ పేరు వినగానే" నెల్లూరి నెరజాణ........." అనే పాట గుర్తుకొస్తుంది. నెల్లూరి అతివలను నెరజాణలతో పోల్చి గత చరిత్ర అందాలను ఆ రచయిత తవ్వి చూపారు. ఇక నెల్లూరు గురించి లోతుగా చూస్తే... ఒకప్పటి విక్రమ సింహపురి రాజ్యమే ఇప్పటి నెల్లూరు. 13వ శతాబ్దం వరకు మౌర్యుల చేత పాలింపబడి, ఆంధ్రప్రదేశ్‌లోనే ఆరవ అతిపెద్ద నగరంగా ప్రసిద్ధి చెంది, ఆధ్యాత్మిక చరిత్రతో పాటు ఆహ్లాదానికీ, ఎన్నో అద్భుతాలకు కొలువైన నెల్లూరు అందాలు మీకోసం... ఇవిగో....
1. ఆధ్యాత్మిక ప్రదేశాలు శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవాలయము : నెల్లూరు నగరానికి ఐదు కిలో మీటర్ల దూరంలో పెన్నానది ఒడ్డున 300 యేళ్ళ పురాతన చరిత్ర కలిగిన శ్రీ తల్పగిరి రంగనాధ స్వామి దేవస్థానం. ఏడు బంగారు కలశాలతో 96 అడుగుల అతి పెద్ద గాలి గోపురం దేవస్థాన ప్రాంగణంలో ఉంది. ఈ దేవస్థానం ఎరగుడపాటి వెంకటాచలం పంతులు గారిచే నిర్మింపబడింది. ప్రతీ ఏటా బ్రహ్మోత్సవాలలో రంగానాధునికి అంగరంగ వైభవంగా "రధ-యాత్ర" జరుగుతుంది.
శ్రీ గాయత్రీ దేవి విశ్వకర్మా దేవాలయం : ఆంధ్రప్రదేశ్‌లోని అతి పెద్ద దేవాలయంగా "గాయత్రీ దేవి విశ్వకర్మ ఆలయం" ప్రసిద్ధి చెందింది. నెల్లూరు ప్రధాన రోడ్డులో ఉన్న ఈ గాయత్రీ మాత ఆలయం కనీవినీ ఎరుగని రీతిలో పూజలందుకుంటుంది. గాయత్రీ మాత భక్తుల కోర్కెలు తీరుస్తుందని ప్రతీతి.
జొన్నవాడ : పెన్నా నది ఒడ్డున వెలసిన మరో దేవాలయం "మల్లికార్జున స్వామి కామాక్షీ దేవి ఆలయం". ఈ పుణ్యక్షేత్రానికి త్రేతాయుగంలో కశ్యప బ్రహ్మ మునీంద్రుల వారు కఠోర తపస్సుతో మల్లికార్జున స్వామిని ప్రసన్నం చేసుకున్నట్లుగా, అప్పటి నుండి ఈ క్షేత్రానికి జొన్నవాడగా పేరుకెక్కిందని, మునీంద్రుల వారు తపస్సు ఆచరించిన కోనేటిలో మునిగితే సర్వకర్మల నుండి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.
నరసింహకొండ : 500 యేళ్ళ పురాతన చరిత్ర కలిగిన "వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం". 9వ శతాబ్దంలో పల్లవ రాజైన రాజా నరసింహ వర్మచే పినాకిని నది ఒడ్డున నిర్మించబడినది. బ్రహ్మ పురాణాలలో చెప్పిన విధంగా ఈ నరసింహ కొండపై సప్తరుషులు యజ్ఞము ఆచరించి ఏడు కొనేర్లు(గుండాలు)గా కొండ పైన ఏర్పడ్డారని పురాణాలు చెబుతున్నాయి.
పెంచల కోన : మన భారత హిందూ పురాణేతిహాసాలలో నరసింహస్వామి స్వయంగా "యోగ ముద్ర"లో రాయిగా మారాడని అందువల్ల ఈ క్షేత్రానికి "పెంచల కోన" అని ప్రసిద్ధి చెందిందని అంటారు. నారసింహ స్వామి ఉగ్ర రూపంలో ఉన్నపుడు తన కోపావేశాలను తగ్గించుకోడానికి స్వామి పెంచలకోనలో స్నానమాచరించినట్లు చెపుతారు.
గొలగమూడి : మానవాళిని పాప కర్మల నుండి కాపాడటానికి అవతరించిన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి దేవాలయము నెల్లూరుకి సమీపంలోని గొలగమూడి గ్రామంలో వెలసింది. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఆగష్టు 24, 1982 వరకు జీవించినట్లు ఆధారాలున్నాయి. పరమాత్ముడైన సద్గురు సాయిబాబా మాదిరిగానే సద్గురు వెంకయ్య స్వామి వారు భక్తుల కష్టాలన్నీ తీర్చి నిత్యం పూజలందుకుంటున్నారు. వెంకయ్య స్వామివారి జీవిత చరిత్రలో స్వామి వారి అద్భుతాలను తెలుసుకోవచ్చు. స్వామి వారి ఆలయ దర్శనం చేసుకున్న వారికి సకల పాపకర్మల నుండి విముక్తి లభిస్తుందని నమ్మకం.
2. ఆహ్లాదాన్ని కలిగించే ప్రదేశాలు : నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రం : ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో ఉన్న ఈ నేలపట్టు పక్షుల సంరక్షణా కేంద్రంగా అతి ప్రసిద్ది చెందింది. యేటా జరిగే "ఫ్లెమింగో ఫెస్టివల్" ఇక్కడి ప్రత్యేకత. దేశ విదేశాల నుండి ఎన్నో రకాల పక్షులతో ఈ నేలపట్టు సందర్శకులతో కిటకిటలాడుతుంది.
పులికాట్ సరస్సు : రెండో అతి పెద్ద ఉప్పునీటి సరస్సుగా దీనికి పేరు. ఈ సరస్సుకు దేశ విదేశాల నుండి అన్ని జాతుల పక్షులు తమ సంతతి వృద్ధి కోసంగా ఇక్కడకు వలస వస్తాయి. రకరకాల చేపలతో ఈ సరస్సు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
తడ వాటర్ ఫాల్స్(ఉబ్బలమడుగు ఫాల్స్) : నెల్లూరు-తమిళనాడుకు సరిహద్దుగా ఉన్న "తడ"లో "ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్" ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. తడకు మాత్రమే కాకుండా శ్రీకాళహస్తికి కూడా ఈ వాటర్ ఫాల్స్‌కు అతి దగ్గరగా వుంది. ఇంకా చూడదగిన ప్రదేశాలు...
ఉదయగిరి కోట వెంకటగిరి రాజావారి సంస్థానం షార్ ( సతీష్ ధావన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ) కృష్ణపట్నం పోర్టు సోమశిల డ్యామ్ కండలేరు డ్యామ్
3. బీచ్‌లు: కొత్త కోడూరు బీచ్ మైపాడు బీచ్ ముత్తుకూరు బీచ్. నెల్లూరు నాజూకు బంగారు డిజైన్లకు కూడా ప్రసిద్ది, పొరుగు రాష్ట్రాల నుండే కాక విదేశాల నుండి కూడా వర్తకులు బంగారు డిజైన్ల కొనుగోలుకు నెల్లూరు వస్తారు.