దట్టమైన అడవి, క్రూర మృగాలకు ఆలవాలంగా అహోబిలం ఉంది. అహోబిలంలో నరసింహ స్వామి కొలువై యున్నాడు. ఈ అహోబిల్ పుణ్యక్షేత్రానికి "సింగవేల్ కుండ్రం" అను పేరిట పిలుస్తారు. ఈ క్షేత్రం హిరణ్యకశిపుని సంహరించిన నరసింహస్వామి పేరిట వెలిసింది. ఇక్కడ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో కనిపిస్తాడు కనుక ఈ క్షేత్రానికి "నవ నరసింహ క్షేత్రం" అనే మరో పేరు కూడా ఉంది.
అహోబిల నరసింహస్వామి, వరాహ నరసింహస్వామి, మలోల నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, భావనా నరసింహస్వామి, కారంజ నరసింహస్వామి, ఛత్ర వడ నరసింహస్వామి, భార్గవ నరసింహస్వామి, జ్వాలానరసింహస్వామిగా నవ నరసింహుడిగా స్వామి భక్తుల పాలిట కొంగుబంగారమై భాసిల్లుతున్నాడు.
ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం అనబడే రెండు పర్వతాలను ఈ క్షేత్రం కలిగి ఉంది. ఎగువ అహోబిలం చేరుకోవాలంటే దిగువ అహోబిలం నుంచి ఆరు కి.మీల బస్సు ప్రయాణం చేయాలి. ఈ క్షేత్రంలోని దేవుడు తొమ్మిది విగ్రహ రూపాలలో కనిపిస్తాడు. నవగ్రహాల కన్నా నవ నరసింహుని శక్తి అధికమని భక్తుల విశ్వాసం.
ఈ ఆలయంలో భారీ నిధులున్నాయి ప్రచారం జరుగుతోంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ నిధులను ఆలయంలోని సురక్షిత ప్రాంతంలో దాచి తాను కూడా జీవ సమాధి అయినట్లు భక్తులు, స్థానికులు చెబుతున్నారు. ఈ నిధులను అహోబిల స్వామి క్రూరమృగాలు, పాములు, తేనెటీగల రూపంలో రక్షిస్తున్నాడని భక్తుల విశ్వాసం.
తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం తరహాలోనే అహోబిల స్వామి ఆలయంలోనూ భారీ నిధులు ఉంటాయని, అందుకే అహోబిలుడు "ఆంధ్రా పద్మనాభుడు" భారీ నిధులను కలిగివున్నాడని పండితులు చెబుతున్నారు.