Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణ కాశీ... వేములవాడ దివ్యక్షేత్రం

దక్షిణ కాశీ... వేములవాడ దివ్యక్షేత్రం

WD

హైదరాబాద్ (ఏజెన్సీ) , ఆదివారం, 3 జూన్ 2007 (18:06 IST)
పేదల పాలిట కొంగు బంగారమై అపర భూకైలాసంగా, దక్షిణ కాశీగా వేములవాడ పుణ్యస్థలి విరాజ్లిలుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 160 కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు 36 కిలోమీటర్ల దూరంలో వున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం పౌరాణికంగా, చారిత్రాత్మకంగా పలు విశిష్టతలను సంతరించుకున్నది.

దేవేరి శ్రి పార్వతీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై శ్రి రాజరాజేశ్వరుడు లింగరూపంలో వెలసి నిత్యం పూజలందుకుంటున్నాడు. శ్రి కాశీనగరి, చిదంబరపురి, శ్రిశైల కేదారాది శివక్షేత్రాల వలె వేములవాడ క్షేత్రం మహమాన్వితమై భక్తకోటిని తరింపజేస్తున్నది. లేంబాల వాటికగా, భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా నామాంతరాలు కలిగివున్న ఈ క్షేత్ర ప్రశస్తి భవిష్యత్తోత్తర పురాణంలోని రాజేశ్వర ఖండంలో పేర్కొనబడింది. కృతయుగంలో దేవేంద్రుడు లోకకంటకుడైన వృత్ర్తాసురుడు అనే రాక్షసుని సంహరించి తదనంతరం సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకం తొలగించేందుకు పలుక్షేత్రాదులు తిరుగుతూ వేములవాడ క్షేత్రానికి విచ్చేసి ధర్మకుండ పుష్కరిణిలో స్నానమాచరించి స్వామివారిని అర్చించి పునీతుడైనట్టు రాజేశ్వర ఖండంలో వివరించబడింది.

త్రేతాయుగంలో దక్షుడు గంధమాదన పర్వతంపై యజ్ఞం చేయగా, శివయజ్ఞ భాగలేమితోయున్న మంత్రపూతమగు హవిష్యమను సూర్యుడు గైకొని తన నిజబాహువులు కోల్పోయెనట. శతవత్సరముల అనంతరం సూర్యుడు విప్రుల సూచనలపై ఈ క్షేత్రంలో స్వామివారిని ఆరాధించి తిరిగి బాహువులు పొందినట్లు, అందుకే ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రమని పేరొచ్చినట్లు పురాణాంతర్గత కథనం. దండకారణ్య ప్రాంత సంచారణ సమయంలో శ్రి సీతారామ లక్ష్మణులు, అరణ్యవాసమందు పంచపాండవులు ఈ క్షేత్రరాజమును సందర్శించి పూజలు చేసినట్లు, స్వామివారి కృపకు పాత్రులైనట్లు స్థలపురాణ విదితం.

చారిత్రాత్మకంగా వేములవాడ
చారిత్రాత్మకంగా వేములవాడ క్షేత్రం అతి సనాతనమైనదని, వేములవాడ చాళుక్యుల కాలంలో మహిమాన్వితంగా వెలుగొందినట్లు చరిత్రకారుల పరిశోధనవల్ల బయటపడింది. క్రీ.శ. 750 నుంచి 973 వరకు సుమారు 220 సంవత్సరాలు వేములవాడ ఆలయాలు పునరుద్ధరించబడినట్లు తెలుస్తున్నది. చాళుక్య రాజులైన వినయాదిత్య, యుద్ధమల్లుడు మొదలుకొని మొదటి అరకేసరి, నరసింహ భూపతి, రాజాదిత్యుడు, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నర్సింహుడు, రెండవ అరికేసరియగు వాగరాజు, భద్రదేవుడు, మూడవ అరికేసరిల కాలంలో వేములవాడ క్షేత్రం రాజధానిగా వుండి పరిపాలించబడినట్లు తెలియుచున్నది.

ఈ రాజులు శైవ, వైష్ణవ మతసంప్రదాయములనేగాక జైన, బౌద్ధ మతాలను కూడా పోషించినట్లు వేములవాడ ఆలయంలో బయటపడిన విగ్రహాలవల్ల తెలుస్తున్నది. నైజాం రాజుల కాలంలో 128 మంది పూజారులచే అగ్రహారంగా వెలుగొందిన ఈ క్షేత్రం జాగీరుల రద్దు అనంతరం 1957 నుంచి జిల్లా కలెక్టర్‌ పరిపాలన కిందకు వచ్చింది. 1964లో తొలి ఎండోమెంట్స్‌ యాక్టు అమలులోకి వచ్చిన కాలం నుంచి అనువంశికేతర ధర్మకర్తల మండలి పరిపాలన కిందకు వచ్చింది.

ప్రధాన దేవాలయమైన శ్రి రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారామ చంద్రస్వామి, అనంత పద్మనాభస్వామి, త్రిపురసుందరి, కేదార, దక్షిణామ్తూరి, బాలరాజేశ్వరస్వామి దేవాలయాలున్నాయి. గండదీపం, ఉత్సవ మూర్తుల అద్దాల మహల్‌, నాగిరెడ్డి మండపం, ఆలయ భోజనశాల, ఆలయ పరిపాలనా భవనం ప్రధానాలయానికి అనుబంధంగా వున్నాయి. వేములవాడ దేవస్థానంవారి ఆధ్వర్యంలో 1956 నుంచి సంస్కృత భాషా సేవ జరుగుతున్నది. వేములవాడ, కరీంనగర్‌, ధర్మపురిలలో సంస్కృత విద్యాసంస్థల నిర్వహణ జరుగుతోంది. వేములవాడలో డిగ్ర్థీసాయి వరకు సంస్కృత భాష బోధింపబడుతున్నది.

Share this Story:

Follow Webdunia telugu