Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహ్లాదం, ఆధ్యాత్మికతల మేలికలయిక "మెదక్"

ఆహ్లాదం, ఆధ్యాత్మికతల మేలికలయిక
FILE
అత్యద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కళ్లముందు ఆవిష్కరించే కట్టడాలు, మానసికానందాన్ని పంచే మనోహర ప్రదేశాలు, చారిత్రక ప్రాధాన్యాన్ని తెలిపే కోటలు, పచ్చని ప్రకృతితో మైమరిపించే కొండలు, కోనలు, లోయలు, వాగులు, వంకలు, పక్షుల కిలకిలా రావాలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో అపురూప ప్రదేశాలను కొంగున ముడి వేసుకున్న అందాల తెలుగింటి జిల్లా "మెదక్".

ఆహ్లాదం, ఆధ్యాత్మికత మేలి కలయికతో.. ప్రకృతి ఆరాధకులకు, ఆధ్యాత్మిక చింతన కలవారికి, సరదాగా గడపాలనుకునే పర్యాటకులకు రారామ్మని ఆహ్వానం పలికే ప్రదేశం "ఏడుపాయల". మెదక్‌ జిల్లా, పాపన్నపేట మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే "ఏడుపాయల దుర్గమ్మ దేవాలయం" ఇది ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన శక్తిపీఠం. ఆదివారం వచ్చిందంటే ఈ ఏడుపాయల అటవీ ప్రాంతం మొత్తం జనారణ్యంగా రూపాంతరం చెందుతుంటుంది.

కనుచూపు మేరలో విశాలమైన అటవీ ప్రాంతం, ఎటుచూసినా ఎత్తైనా కొండలు, దొంతరలు పేర్చినట్లుండే రాళ్ల గుట్టలు, ఒక కిలోమీటర్ పొడవునా వంకలు తిరిగినట్లుగా ఉండే ఘనపూర్ ఆనకట్ట, కొండల మధ్య నుంచి గలగలాపారే నదీపాయలు, ఆ నదీపాయల ఒడ్డున రాళ్లగుట్టను ఆనుకుని నెలవైన దుర్గాభవానీమాత ఆలయం.... లాంటివన్నీ ఏడుపాయలలో పర్యాటకులను కట్టిపడేసే దృశ్యాలు.

సూర్యాస్తమయ వేళలో ఏడుపాయల కొండల మధ్య నుంచి అరుణకాంతితో మెరిసిపోతూ... మెల్లిగా కనుమరుగయ్య సూర్యభగవానుడు.. అదే సమయంలో ఘనపూర్ ఆనకట్ట వద్ద భానుడి కిరణాలు మంజీరా నది నీటి అలలపై పడి మెరుస్తుండే అందాన్ని తనివితీరా చూసి తీరాల్సినవే.

webdunia
FILE
అలాగే శతాబ్దాల చరిత్రన కళ్లముందు సాక్షాత్కరింపజేసే మరో దర్శనీయ స్థలం "మెదక్ ఖిల్లా". 90 మీటర్ల ఎత్తుపైనున్న కొండపై వందల సంవత్సరాల క్రితం ఈ ఖిల్లాను నిర్మించారు. పొడవైన శిలలతో, వాటిపై ఏనుగులు, సింహాల ఆకృతిలో నిర్మించిన ద్వారాలు, పూర్తిగా రాళ్లతో నిర్మితమైన కారాగారాలు, గజశాలలు నేటికీ చెక్కుచెదరకుండా మనల్ని పలుకరిస్తాయి.

ఎత్తైన ఈ ఖిల్లా నుంచి మెదక్ పట్టణంలోని పాతకాలం నాటి పెంకుటిళ్లు, భారతదేశ పటాన్ని పోలినట్లుగా ఉండే చెరువు దృశ్యాలు ఎంతో సుందరంగా కనిపించి, కనువిందు చేస్తాయి. హైదరాబాదు నుంచి వంద కిలోమీటర్లు, జిల్లా కేంద్రమైన సంగారెడ్డి నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఖిల్లా మెదక్ పట్టణంలో ఉంది. ఖిల్లా సమీపందాకా వాహనాలు వెళ్తాయిగానీ.. పైకి చేరుకోవాలంటే కాలినడక తప్పదు.

పచ్చటి ప్రకృతి అందాలతో కొలువుదీరి ఆహ్లాదాన్ని పంచే మెదక్‌ జిల్లాలోని మరో పర్యాటక ప్రాంతం "పోచారం వన్యప్రాణి అభయారణ్యం". కృష్ణ జింకల ప్రత్యుత్పత్తి కేంద్రమైన ఈ అభయారణ్యంలోకి వెళ్లాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. ఇక్కడ కృష్ణ జింకలు, కణుజు, కొండగొర్రెలు, నెమళ్లు, కుందేళ్లు తదితర వన్యప్రాణులను వీక్షించవచ్చు.

webdunia
FILE
విశాలంగా, పచ్చగా పరచుకున్న ఈ అటవీ ప్రాంతంలోని అభయారణ్యం ఎంట్రెన్స్‌లో ఉన్న పార్కులోని రకరకాల మొక్కల సోయగం కనువిందు చేస్తుంటుంది. మెదక్ మండల పరిధిలో మెదక్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో.. మెదక్-బోధన్ ప్రధాన రహదారిపై ఈ అభయార్యం కలదు. ఇక్కడికి వెళ్లాలంటే.. బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి వెళ్లే బస్సులలో వెళ్ళవచ్చు, ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి.

పదకొండవ శతాబ్దం నాటి చరిత్రకు సాక్షీభూతంగా నిల్చిన కొల్చారంలోని "జైనమందిరం" జిల్లాలో చూడాల్సిన మరో ముఖ్య ప్రదేశం. జైనమత 23వ తీర్థంకరుడు పార్శ్వీనాథుడు ఇక్కడ కొలువైయున్నాడు. నల్లసరపు రాతితో ఎంతో కళాత్మకంగా చెక్కబడి తొమ్మిది అడుగుల పొడవు ఉండే తీర్థంకరుడి ఏకశిలా విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఎంతో కళాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం చుట్టూ ఉండే పార్కు, ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే పాలరాతి శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటాయి. జిల్లా, రాష్ట్రవాసులనేగాక.. జాతీయస్థాయిలో జైన మతస్థులను ఆకర్షిస్తూ.. ప్రముఖ దర్శనీయ స్థలంగా ఇది దినదిన ప్రవర్థమానంగా వెలుగుతోంది.

మెదక్-హైదరాబాద్ ప్రధాన రహదారిపై మండల కేంద్రమైన కొల్చారంలో నెలవైన ఈ ఆలయం హైదరాబాద్‌ నుండి 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే జిల్లా కేంద్రం సంగారెడ్డి నుంచి 60 కిలోమీటర్లు, మెదక్ పట్టణం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి వెళ్లాలంటే.. అన్ని ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సు సదుపాయం ఉంది.

ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెదక్ జిల్లాలో కొన్నివేల హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న "నర్సాపూర్ అడవులు". జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి 28 కిలోమీటర్ల దూరంలో, జంట నగరాల శివార్ల నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇక్కడి సుందర దృశ్యాలు, పక్షుల కిలకిలలు, వన్యప్రాణుల సంచారం, ప్రకృతి సౌందర్యం చూపరుల మనసుకు చక్కటి ఆహ్లాదాన్నిస్తాయి.

నర్సాపూర్ అటవీశాఖ ఆధ్వర్యంలో ఇక్కడ కొనసాగుతున్న "వనవర్థిని కేంద్రీయ మొక్కల ఉత్పత్తి కేంద్రం" సుందర ప్రదేశంగా ప్రాచుర్యం పొందుతోంది. ఇక్కడ వివిధ రకాల ఔషధ మొక్కలు వివిధ గ్రహాలకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు. ఇక్కడి ఊట చెరువు, మొక్కల ఉత్పత్తి పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

Share this Story:

Follow Webdunia telugu