Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రారంభమైన నాల్గవ విడత పోలింగ్

ప్రారంభమైన నాల్గవ విడత పోలింగ్
, గురువారం, 7 మే 2009 (08:38 IST)
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో భాగంగా గురువారంనాడు ఎనిమిది రాష్ట్రాలలో గట్టి భద్రత నడుమ పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా 85 లోక్‌సభ సీట్లకుగాను 1315 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వీరి భవిష్యత్తును 9.5 కోట్ల మంది ప్రజలు తీర్పు చెప్పనున్నారు.

పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలలో సీఆర్‌పీఎఫ్ బలగాలు, స్థానిక పోలీసు బలగాల భద్రతను పటిష్టపరిచారు.

ఇదిలావుండగా దేశవ్యాప్తంగా వేసవికాలంతో ఎండలు మండిపోతుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద త్రాగు నీటి సౌకర్యం కల్పించినట్లు పోలింగ్ అధికారులు పేర్కొన్నారు. తాలూకా ప్రధాన కేంద్రాలలో కంట్రోలు రూమ్‌లు ఏర్పాటు చేసి కావలసిన అవసరాలను పర్యవేక్షిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

కాగా రాజస్థాన్‌‌లో 25, హర్యాణాలో 10,ఢిల్లీలో 7, లోక్‌సభ స్థానాలకు పోటీ జురుగుతోంది. నాల్గవ విడత పోలింగ్‌లో భాగంగా ఉత్తర ప్రదేశ్‌లో 18, పశ్చిమ బెంగాల్‌లో 17, పంజాబ్‌లో 4, బీహార్‌లో 3, జమ్మూ-కాశ్మీర్‌లో 1 సీటు కొరకు పోలింగ్ జరుగుతోంది.

దీంతోబాటు తొమ్మిది రాష్ట్రాలలోనూ, కేంద్రపాలిత ప్రాంతాలలో 86 లోక్‌సభ సీట్లకుగాను ఐదవ విడత పోలింగ్ కార్యక్రమం ఈ నెల 13వ తేదీన జరుగనుంది.

నాల్గవ విడతలో భాగంగా జరిగే ఎన్నికల్లో పోటీ పడుతున్న దిగ్గజాలు రాజనాథ్‌సింగ్, ప్రణబ్ ముఖర్జీ, ములాయం‌సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లా, కళ్యాణ్‌సింగ్, లాలూప్రసాద్ యాదవ్, శత్రుఘ్నసిన్హా, శేఖర్ సుమన్, సల్మాన్ ఖుర్షీద్, అజిత్‌సింగ్, కపిల్ సీబాల్, సందీప్ దీక్షిత్ తదితరులున్నారు.

ఇదిలావుండగా రాజస్థాన్‌లో 346, ఉత్తరప్రదేశ్‌లో 314, హర్యాణాలో 210, ఢిల్లీలో160, పశ్చిమ బెంగాల్‌లో 134, పంజాబ్‌లో 79, బీహార్‌లో 57, జమ్మూ-కాశ్మీర్‌లో 15మంది నాల్గవ విడత ఎన్నికలలో భాగంగా పోటీ పడుతున్నారు.

కాగా వీరిలో మహిళామణుల సంఖ్య ఇలా ఉంది... ఉత్తర ప్రదేశ్‌లో 36, రాజస్థాన్‌లో 31, ఢిల్లీలో 18, హర్యాణాలో 14, పశ్చిమ బెంగాల్‌లో 11, బీహార్‌లో 4, పంజాబ్‌లో 3, జమ్మూ-కాశ్మీర్‌లో ఇద్దరు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.

అత్యధికంగా 41మంది ఎన్నికలలో పోటీ పడుతున్నారు. దీని తర్వాత ఢిల్లీలోని చాంద్‌నీ చౌక్‌లో 40మందితోబాటు హర్యాణాలోని హిసార్‌లో 38మంది పోటీ పడుతున్నారు. కాగా అత్యధికంగా మహిళలు గౌతమ్‌బుద్ధ నగర్, బులంద్ షహర్ నుంచి పోటీ పడుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu