దమ్ముంటే రారా..! తేల్చుకుందాం... నేను ఇక్కడే ఉన్నా... అక్కడుండి జనాన్ని రెచ్చగొడతావేందిరా... దద్దమ్మా..!
నీ తాతాలకు ముత్తాతలకు కూడా తెలుసురా..! దమ్ము ఉండేది లేంది... నీ లాంటివాళ్ళను చాలా మందినే చూశాం.. నువ్వేందిరా చెప్పేది... ఇడియట్ పెట్టరా... ఫోను...
ఇదేదో వీధి గొడవల్లో మాటల్లా ఉన్నాయే అనుకుంటున్నారు. మాటలవే... కాని మాట్లాడిన వారు సాధారణ వ్యక్తులు కారు.... ఒకరేమో దేశానికి కావాల్సిన చట్టాలను తయారు చేసే లోక్‌సభలో సభ్యుడు లగడపాటి రాజగోపాల్. మరోకరేమో రాష్ట్ర శాసనసభ ప్రాతినిధ్యం వహించే శాసనసభ్యుడు హరీష్ రావు.
ఇందుకు ఈ సంఘటనను ఓ టీవీ చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. వీరి మాటలు విన్న తరువాత యావత్ ప్రజాప్రతినిధి లోకం సిగ్గుతో తలదించుకుంది. రోడ్డు పక్కనున్న వారు కూడా ఇంత అధ్వానంగా మాట్లాడుకోరు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయ నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తుంది.
వీరివురూ యువ రాజకీయ నాయకులే. నవ తరానికి నాందిగా నిలవాల్సిన వీరు సిగ్గు విడిచి వ్యవహరించారనడంలో అనుమానమే లేదు. కేంద్ర రక్షణశాఖ ప్రణబ్ ముఖర్జీ గురువారం రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, నవ తెలంగాణ పార్టీ నాయకులు మంత్రి కాన్వాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్త చిన్నారెడ్డి గాయపడ్డారు. ఇందుకు ఎంపీ లగడపాటి రాజగోపాల్ కారణమని టీ ఆర్‌ఎస్ ఆరోపించింది. కొందరు కార్యకర్తలు ఎంపీ రాజగోపాల్‌కు చెందిన ల్యాంకో ఫ్యాక్టరీపై రాళ్ళతో దాడి చేశారు. కార్యాలయ ముందు భాగంలోని అద్దాలను, కార్ల అద్దాలను ధ్వంసం చేశారు.
ఈ సంఘటనపై ఓ టీవి చానెల్ చర్చా కార్యక్రమాన్ని పెట్టింది. స్టుడియోలో హరీష్ రావు, కాంగ్రెస్ నాయకు దానం నాగేందర్ ఉన్నారు. లగడపాటి రాజగోపాల్ ఫోన్ ద్వారా చర్చలో పాలుపంచుకుంటున్నారు. మాటామాట పెరుగుతోంది. ఇంతలోనే రాజగోపాల్ కాస్తంత ఆవేశంగా మాట్లాడుతున్నారు.
హరీష్ రావు కూడా అదే స్థాయిలో రెచ్చగొడుతున్నారు. తాను నిజామాబాద్‌లోనే ఉన్నానని, ఉంటానని దమ్ముంటే రావాలని, కార్యకర్తలను రెచ్చగొట్టి కార్యాలయాలపైకి పంపడం కాదంటూ ఛాలెంజ్ చేశారు. దీనిపై ప్రతి స్పందించిన హరీష్ రావు అదే స్థాయిలో మాట్లాడుతూ, తెలంగాణ కార్యకర్తల చేతిలో చెప్పు దెబ్బలు తిన్నా సిగ్గు రాలేదాని మరింత రెచ్చగొట్టారు.
మళ్ళీ రాజగోపాల్ ఛాలెంజ్ చేస్తూ దమ్ముంటే రారా అంటూ.. వీధి గొడవ స్థాయికి దిగజారారు. అదే స్థాయిలో హరీష్ కూడా ఇడియట్.... పెట్టరా ఫోన్ అంటూ ధూషించడానికి మొదలు పెట్టారు. ఇలా ఈ యువనాయకులు దాదాపు 10 నిమిషాలు తిట్ల పురాణాన్ని సాగించారు. స్టుడియోలో ఉన్న దానం నాగేందర్, రాజగోపాల్‌తో ఉన్న మధు యాస్కీలు వీరి ప్రవర్తనను చూసి విస్తుబోయారు.
వీరి వ్యవహారాన్ని గమనించిన ప్రతి ప్రజాప్రతినిధులు సిగ్గు పడ్డారు. చివరకు తీవ్రతను గమనిచంచి యాంకర్ చర్చవేదికకు కాసేపు బ్రేక్ ఇచ్చారు. ఆ తరువాత పరిస్థితి కాస్తంత చల్లబడింది. అసెంబ్లీలోగాని, బయటగాని రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబులు చేసుకునే విమర్శలపై జనం ఛీదరించుకుంటున్నారు. హరీష్, రాజగోపాల్‌ల తిట్ల పురాణాన్ని విన్న వారికి రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మీదే అసహ్యం పుడుతుంది.