Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సార్వత్రిక సమరం: రెండో దశకు సర్వం సిద్ధం

సార్వత్రిక సమరం: రెండో దశకు సర్వం సిద్ధం
ఈ నెల 23వ తేదీన జరుగనున్న రెండో విడత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఎన్నికలు జరిగే 10 జిల్లాలోని 20 లోక్‌సభ, 140 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డాక్టర్‌ ఐ.వి.సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ.. మలిదశ ఎన్నికల పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ప్రశాంత ఎన్నికల పోలింగ్‌కు 24 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను పర్యవేక్షకులుగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

పలు రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులు, గత ఎన్నికలలో చోటు చేసుకున్న సంఘటనలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అందించిన సమాచారం మేరకు 10 జిల్లాల్లో ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. పోలింగ్‌ పర్యవేక్షణ కోసం 183 మంది పరిశీలకులను, 3,822 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్టు చెప్పారు.

మొత్తం 2,05,000 మంది సిబ్బందిని ఈ ఎన్నికల విధుల కోసం నియమించినట్టు తెలిపారు. తొలివిడతలో ఈవీఎంల నిర్వహణలో తలెత్తిన సాంకేతిక సమస్యలు రెండో విడతలో పునరావృతం కాకుండా సిబ్బందికి మరొకమారు శిక్షణనిచ్చామన్నారు.

కాగా, ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. మొత్తం 2,66,30,305 మంది ఓటర్లు ఈ ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద మంచినీటి సదుపాయం, షామియానాల ఏర్పాటు, ఈవీఎంల వద్ద లైటింగ్‌ ఉండేలా చూడడం, తదితర అత్యవసర చర్యలను చేపట్టాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు ఈసీ వెల్లడించారు.

రెండో దశ ఎన్నికల కోసం మొత్తం 30,446 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు ఐవీ చెప్పారు. వీటిలో 76,581 ఈవీఎంలను వినియోగిస్తున్నట్టు వివరించారు. రెండో దశలో పది వేల పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించినట్టు చెప్పారు.

పోలింగ్‌ కేంద్రాలలో ఎలాంటి అక్రమాలు తావులేకుండా ఉండేందుకు పలుచోట్ల డిజిటల్‌ కెమెరాలతో ఫోటోలు తీయడంతోపాటు పలు చోట్ల వీడియో రికార్డింగ్ తీయిస్తున్నట్లు సుబ్బారావు చెప్పారు.

ఇందుకోసం 3,045 వీడియో కెమెరాలను, 688 డిజిటల్‌ కెమెరాలను ఉపయోగిస్తున్నట్టు చెప్పారు. కాగా, తొలి విడతలో అమలు చేసిన ఎన్నికల నియమ నిబంధనలన్నీ రెండో దశలోనూ వర్తిస్తాయని ఐవీ సుబ్బారావు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu