Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'యువగర్జన'...తెలుగుదేశానికేనా...?

'యువగర్జన'...తెలుగుదేశానికేనా...?

Munibabu

, గురువారం, 23 అక్టోబరు 2008 (17:11 IST)
FileWD
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు చాలా పెద్ద చిక్కొచ్చిపడింది. రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీలను ఎలా అధిగమించాలా....? అంటూ ఆలోచించాల్సిన ఆయనకు సొంత పార్టీలోని సమస్యలను చక్కబెట్టుకోవడంతోనే సరిపోతోంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు నందమూరి వంశం వారిని యువగర్జన ద్వారా తెరమీదకు తేవాలనుకుంటున్న చంద్రబాబుకు ఇప్పుడు వారితోనే సమస్యలు తలెత్తుతుండడం గమనార్హం.

ఎన్టీఆర్‌ నుంచి తెలుగుదేశం పార్టీ పగ్గాలను చేపట్టిన తర్వాత ఆయన నందమూరి కుటుంబీకులనెవరినీ పార్టీలోకి స్వాగతించలేదు. అయితే ఇప్పుడు వారిని తెరమీదకు తేవాల్సిన అవసరం బాబుకు ఎందుకొచ్చిందని ఓసారి పరిశీలిస్తే... ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో "మెగా" మార్పు చోటు చేసుకుంది. తెలుగు తెరపై నెంబర్‌వన్‌గా పేరు తెచ్చుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ప్రజల ముందుకు వచ్చారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు సినీ ఆకర్షణ తప్పదన్న నిర్ణయానికి వచ్చేశాయి. ఫలితంగానే జయసుధ, రాజశేఖర్, జీవిత, కృష్ణ కాంగ్రెస్ పార్టీ చేరదీస్తే.... యువరత్న, తారకరత్న, జూనియర్ ఎన్టీఆర్... వగైరాలకు తెలుగుదేశం పిలుపునిచ్చింది.

నందమూరి వంశీయుల ద్వారా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు సంకల్పించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. చంద్రబాబు స్వయంగా పిలుపునివ్వడంతో.... తమకు రాజకీయ చరిష్మా ఉందని నందమూరి వంశీయులు గ్రహించారు. ఫలితంగానే తెలుగుదేశం తరపున ఇటీవల ప్రచారం ప్రారంభించిన తారకరత్న ఓ సభలో మాట్లాడుతూ తన బాబాయ్ బాలకృష్ణను ఎప్పటికైనా ముఖ్యమంత్రిగా చూడాలనుందంటూ మనసులో మాట బయటపెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


అంతేకాదు ఈ సభలో మాట్లాడినంతసేపు తన తాత ఎన్టీఆర్ గురించి, బాబాయ్ బాలకృష్ణ గురించి మాట్లాడిన తారకరత్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించి పెద్దగా ప్రస్తావించకపోవడంతో ఆ పార్టీ వర్గాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తనను తిరిగి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారని భావిస్తే నందమూరి హీరోలు ఈ తరహాలో మాట్లాడడంతో చంద్రబాబు నిర్ఘాంతపోయారు.
webdunia
FileWD


అదే సమయంలో నవంబర్ 5న గుంటూరు వేదికగా జరగనున్న యువగర్జన సభలో నందమూరి అగ్రహీరో బాలకృష్ణ ఏ తరహాలో మాట్లాడనున్నారో అని తెలుగుదేశం శ్రేణుల్లో గుబులు ప్రారంభమైంది. ఇక ఈ యువగర్జనలో ప్రధాన ఆకర్షణగా మారుతారని భావిస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సభకు రాబోవడం లేదనే వార్తలు తాజాగా వినిపిస్తున్నాయి.

తనవారికి టికెట్టు ఇప్పేంచేందుకు జరిగిన ప్రయత్నాలు వికటించడంతోనే జూనియర్ ఎన్టీఆర్ యువగర్జనకు డుమ్మా కొట్టేందుకు నిర్ణయించుకున్నారని కొందరు చెబుతున్నారు. ఇలా నందమూరి వంశానికి చెందిన ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తూ చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేయడం గమనార్హం.

ఏది ఏమైనా తొమ్మిదేళ్లు అధికారంలో కొనసాగి ఆపై దాదాపు ఐదేళ్లు ప్రతి పక్షంలో కూర్చున్న చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న తరుణంలో చేయూతనిస్తారని భావించినవారే ఆయన చేతికి అడ్డంగా మారుతుండడం చర్చనీయాంశమైంది. మొత్తమ్మీద చంద్రబాబు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయ్యిందని కొందరు రాజకీయ నిపుణులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.


Share this Story:

Follow Webdunia telugu