తెలుగు నాయకులు భళే మాయగాళ్ళు.... ఈ రోజు రాత్రి తెలుగుదేశంలో ఉంటారు.... తెల్లారితే ప్రజారాజ్యం పార్టీలో చేరుతారు.... మధ్యాహ్నానికి విమర్శలు... సాయంత్రానికి ప్రతి విమర్శలు అంతటితో ఆగుతారాంటే కానే కాదు. పార్టీ మారడంపై తెగ లెక్చర్లిస్తారు.
ప్రస్తుత ఆంధ్రా రాజకీయాలు హాట్ ఫేవరెట్‌గా మారాయి. ఎవరు ఏ పార్టీలో చేరుతారో. ఏం చేస్తారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకుల కప్పదాట్లను ఆపడం సాక్షాత్తు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వల్ల కూడా కావడం లేదు. 'నీవు నెర్పిన విద్యే నీరాజాక్ష' అన్న చందంగా నాయకులు ప్రజారాజ్యంలోకి వలసబాట పడుతున్నారు.
సరే వీరి వలసబాట సంగతి పక్కన పెడితే వారి మాయలకు కార్యకర్తలు, సామాన్య జనం మాత్రం విస్తుబోతున్నారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిన నాయకుల తీరును గమనిస్తే ఆ మాయ ఏమిటో అర్థం అవుతుంది.
మొదటి నుంచి వస్తాం... రాయలసీమలో చెప్పుకోదగిన వారిలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు తెలుగుదేశంలో కీలక పాత్ర వహించారు. శోభా నాగిరెడ్డి రాయలసీమ ఇన్‌చార్జ్‌గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ తమ ఊపిరిగా శోభా నాగిరెడ్డి అనేక సందర్భాలలో చెప్పారు. చంద్రబాబు సేవలను ప్రసంశించారు. చిరంజీవి పార్టీ ఆవిర్భావం కాగానే ఒక్క రాత్రిలో ప్రజారాజ్యం పార్టీలోకి దూకేశారు.
చంద్రబాబును తెగడడం మొదలు పెట్టారు. ఇది ఎలా సాధ్యమనేది వారికే తెలియాలి. ఇంచుమించు దశాబ్దకాలంపాటు చంద్రబాబుతో కలసి పని చేశారు. మరి ఇంతలోనే చంద్రబాబు ఎలా చేతకానివాడయ్యాడనేది పెద్ద ప్రశ్న. ఇక కడపకు చెందిన సి రామచంద్రయ్య పరిస్థితిని చూద్దాం... ఈయన పార్టీలో పోలిట్‌బ్యూరో వరకూ వివిధ స్థాయిలలో పని చేశారు.
మంత్రి పదవిని కూడా అలంకరించారు. ప్రజా ఆదరణ అంతగాలేని రామచంద్రయ్య తెలుగుదేశంతోనే పేరు పొందారు. ఢిల్లీ స్థాయిలో కూడా చక్రం తిప్పిన వారిలో రామచంద్రయ్య ఒకరు కావడం విశేషం. ఆయనక్కూడా చిరంజీవి రంగంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ పుచ్చిపోయి కనిపించింది. ఆయన కూడా విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
ఇక తమ్మినేని సీతారాంను గమనిద్దాం. మంచి వక్తగా గుర్తింపు పొందిన తమ్మినేని పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తిరుగులేని నాయకుడుగా ఒక వెలుగు వెలిగారు. మంత్రిగా కీలక పాత్ర పోషించారు. తన బొందిలో ప్రాణం ఉండగా తెలుగుదేశంను వదిలేది లేదని అన్నట్లు గుర్తు. ఈయన కొద్ది రోజుల్లో పార్టీ మారుతారనగా కూడా తెలుగుదేశం తరపున కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.
ఇలా నెలలైనా గడవ లేదు. ఒక మంచి ముహూర్తం చూసుకుని ఆయన ప్రజారాజ్యంలోకి వెళ్ళిపోయారు. ఇలాంటి వారిది ఒక ఎత్తయితే తమ్ముళ్ళను, అన్నలను ప్రజారాజ్యంలోకి సాగనంపిన నాయకులను చూద్దాం రండి. దయాకరరావు... ఈయన తెలుగుదేశం పార్టీ తరుపున ఇటీవల జరిగిన ఎన్నికల్లో లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈయనకు కడియం శ్రీ హరికి విభేదాలున్నాయి.
ఈయన సోదరుడు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇది దేనిని సూచిస్తుంది. ఇక్కడ తేడా వస్తే అక్కడ స్థానాన్ని రిజర్వు చేసుకోవడానికేనని విమర్శుకులు దుమ్మెత్తి పోస్తున్నారు. పైగా తన సోదరుడు తెలుగుదేశం పార్టీలో సభ్యుడు కాదని చల్లగా చెబుతున్నారు. ఇంతకాలం తనకోసం పార్టీలో పని చేశారని చెబుతున్నారు. ఆయన కోసమే పని చేసిన సోదరుడు ఆయన అనుమతి లేకుండా ప్రజారాజ్యంలోకి వెళ్లి ఉంటారా ! ఈ వ్యవహారం దేనిని సూచిస్తుంది.
పార్టీలో ఎవరికీ బెదరడనేంత పేరు ఉన్న యనమల రామకృష్ణుడు సోదరుడు కూడా ఇలాగే ప్రజారాజ్యంలో అడుగు పెట్టారు. ఆయనేమో ఇప్పటికి తెలుగుదేశంలోనే ఉన్నారు. ఇది దేనికి సంకేతం. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇలా మన నాయకుల మాయలకు జనం మెదళ్ళు గింగిరాలు తిరుగుతున్నాయి.