Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణపై వైఎస్ చతురత... ఫలించేనా ?

తెలంగాణపై వైఎస్ చతురత... ఫలించేనా ?
FileWD
రాష్ట్రంలో తొలివిడత పోలింగ్ ముగిసిన కొంతసేపటికే తెలంగాణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ వేరుపడితే హైదరాబాద్‌లో ఆంధ్రవారికి చోటుండదని అక్కడ వారు విదేశీయులుగా మారిపోయే ప్రమాదముందని వైఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు రెండో విడత ఎన్నికల్లో లబ్ధి పొందడానికే అన్నది సుస్పష్టం.

అయితే వైఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టీడీపీలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ఎందుకంటే తొలివిడత ఎన్నికల్లో భాగంగా తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ ముగిసిపోవడంతో ఇక తెలంగాణ వాదానికి తాత్కాలికంగా ఫుల్‌స్టాప్ పెట్టేసి ఆంధ్రప్రాంతంలోని ఓటర్లకు గాలం వేసి రెండో విడత ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఆలోచించిన ఆ పార్టీకి వైఎస్ వ్యాఖ్యలతో ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ వేరుపడితే ఆంధ్రవారికి తప్పక అన్యాయం జరుగుతుందంటూ వైఎస్ ఘంటాపథంగా చెప్పడంతో సదరు వ్యాఖ్యలను ఏ విధంగా ఖండించాలో తెలియక తలపట్టుకోవడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వంతైంది. దీనికితోడు తెలంగాణపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పినవేనని ఆయన చెబితే తప్పులేదు నేను అంటే మాత్రం తప్పు వచ్చిందా అంటూ వైఎస్ మరోసారి పెదవి విప్పడంతో ఈ అంశం రెండో విడత ఎన్నికల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.

అదేసమయంలో తెలంగాణపై తాజాగా చేసిన వ్యాఖ్యలతో టీడీపీని ఇరకాటంలో పెట్టడం ద్వారా వైఎస్ ఓరకంగా విజయం సాధించారనే చెప్పవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పొత్తుతో లబ్ధి పొందిన కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని పక్కనపెట్టింది. అంతేకాదు తాజా ఎన్నికల సందర్భంగా తెలంగాణ అంశంపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయకుండానే ఆ అంశానికి తాము ప్రాధాన్యం ఇస్తున్నామన్న పాత వ్యాఖ్యలనే మరోసారి వల్లించి తొలివిడత ఎన్నికలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

అదేసమయంలో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయం సాధించి తీరాలని తలచిన టీడీపీ మాత్రం ఇందుకోసం టీఆర్ఎస్‌తోపొత్తుకు సిద్ధమైంది. ఈ పొత్తుకోసం అంతకుముందువరకు సమైఖ్య రాష్ట్రానికే కట్టుపడిన టీడీపీ ప్రత్యేక తెలంగాణకు తాము సిద్ధమంటూ ప్రకటించింది. అంతేకాదు మహాకూటమి పేరుతో టీఆర్ఎస్, వామపక్షాలతో కూటమిని సైతం ఏర్పాటు చేసింది. అలాగే కేవలం పొత్తులతో మాత్రమే సరిపెట్టని టీడీపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో దేశంలో కనీవినీ ఎరుగని విధంగా నగదు బదిలీ పథకాన్ని చొప్పించింది. దీంతోపాటు తాము అధికారంలోకి వస్తే పేదలకు కలర్ టీవీలను సైతం ఇస్తామంటూ హామీ ఇచ్చింది.


ఇలా పథకాలతో రాష్ట్రవ్యాప్తంగా ఓట్లను కొల్లగొట్టడంతో పాటు టీఆర్ఎస్‌తో పొత్తుద్వారా తెలంగాణలో మెజారిటీ సీట్లు సాధించాలని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం, మేనిఫెస్టోలో జనాకర్షక పథకాలను ప్రకటించకపోవడంతో తొలివిడత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఓట్లు రాలేదన్న గుసగుసలు అక్కడక్కడా వినిపించాయి.

దీంతో రెండో విడత ఎన్నికల్లోనైనా సరే ఖచ్చితంగా లబ్ధి పొందాలని తలచారో ఏమో వైఎస్ తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. రెండోవిడత ఎన్నికల్లో తమ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకు నిర్ణయించిన వైఎస్ తెలంగాణ అంశాన్ని బ్రహ్మాస్త్రంగా ప్రయోగించారు. దీంతో ప్రత్యేక తెలంగాణకు సై అన్న టీడీపీ ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమల్లో తమ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైఎస్ ఆరోపణలపై సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అంతేకాదు నిజంగానే తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రవారి గతి ఏంటని ప్రజలు మరోసారి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వైఎస్ ఊసరవెల్లి అని తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో ఆయన నిజ స్వరూపం బయటపడిందని టీడీపీ ఎన్ని ప్రత్యారోపణలు చేస్తున్నా లోలోపల మాత్రం ఆ పార్టీకి గుబులుగానే ఉంది. ఎందుకంటే ఓట్లు రాలుస్తుందనుకున్న నగదు బదిలీ పథకాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం అందరూ వైఎస్ వ్యాఖ్యలపైనే దృష్టి పెట్టడంతో రెండో విడత పోలింగ్‌లో ఓటరు ఎలా స్పందిస్తాడోనని టీడీపీ శ్రేణులు హైరానా పడుతున్నాయి.

ఎందుకంటే వైఎస్ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తే ఆంధ్ర ఓటరు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ధైర్యం చేసి ఖండించినా దానివల్ల తెలంగాణలో అధనంగా లాభపడే అవకాశమూ ఎలాగులేదు. ఎందుకంటే తెలంగాణ ఓటరు నిర్ణయం ఇప్పటికే ఈవీఎంలలో నిక్షిప్తమైపోయింది. కాబట్టి మరో ఐదేళ్లపాటు తెలంగాణ ఓటరును మెప్పించాల్సిన అవసరం ఎలాగూలేదు.

అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలు చేయాల్సిందంతా ఆంధ్ర ఓటరును ప్రసన్నం చేసుకోవడమే. ఇలాంటి తరుణంలో ఆంధ్ర ఓటరును ఆకర్షించడానికి వైఎస్ చేసిన తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు టీడీపీకి కంటకంగా మారుతుందా... కాంగ్రెస్‌కు లబ్ధి చేకూర్చుతుందా... అన్న విషయం రెండో విడత పోలింగ్ ముగిసిన తర్వాతే తేలనుంది.

Share this Story:

Follow Webdunia telugu