ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ 54 పేజీల మేనిఫెస్టోను ఆంధ్ర ప్రజానీకం ముందు ఉంచింది. అందులో ప్రధానమైనవి- ఉచిత నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీ. ప్రజలు చాలా కష్టపడిపోతున్నారనీ, అందుకోసమే నగదు, టీవీలను ఉచితంగా ఇస్తున్నామనీ చంద్రబాబు అంటున్నారు.
అయితే ఉచితంగా ఇచ్చే ఏ వస్తువునైనా అనుమానంతో చూడటం ప్రతి ఒక్కరూ చేసే పనే. పైగా ఉచితంగా ఎందుకు ఇవ్వదలుచుకున్నారోనన్న కూపీలు సైతం లాగుతుండటాన్ని చాలాచోట్ల చూస్తూనే ఉంటాం. కొందరైతే సదరు వ్యాపారికి ఎంత లాభం లేకపోతే ఒక వస్తువును ఉచితంగా ఇవ్వడానికి ముందుకొస్తాడు అని సందేహాలను వెలిబుచ్చుతుంటారు.
మొత్తమ్మీద చూస్తే, ఉచిత హామీలపై నేడు చాలామంది ప్రజలలో అనుమానపు మేఘాలు అలముకొని ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాట ఉచిత కలర్ టీవీ మంత్రంతో కరుణానిధి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకుని ఉండవచ్చు. కానీ ఆంధ్రనాట అది అంత తేలిక కాదని గతంలో ఎన్నో ఉదాహరణలు ఎత్తి చూపుతున్నాయి.
ఒక సందర్భంలో తమిళనాట రాజకీయాలను, ప్రజలను- ఆంధ్ర రాజకీయాలు, ప్రజలతో పోలుస్తూ ప్రఖ్యాత రాజకీయ విశ్లేషకులు చో రామస్వామి ఒక ప్రకటన చేశారు. ఎమ్జీఆర్ మరణించిన తర్వాత తమిళ ప్రజలు కుమారి జయలలితను ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడాన్ని, ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీపార్వతిని తెలుగు ప్రజలు ఎన్నుకోకపోవడాన్ని పోలుస్తూ ఆయన, " తెలుగు ప్రజలు అంత తెలివి తక్కువవారు కాదు. ఎవరికి, ఎందుకు ఓటు వేయాలో వారికి బాగా తెలుసు" అని కితాబిచ్చారు.
అదేవిధంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టోలోని ఉచిత నగదు పంపిణీ, ఉచిత కలర్ టీవీల అంశాల్లోనూ ఇదే రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకున్న పదవీకాంక్షే ఈ ఉచిత హామీలను చేయిస్తుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
మరి మిగిలిన పార్టీల సంగతో... అంటే అవి కూడా తమదైన శైలిలో ఉచిత హామీలను గుప్పిస్తూనే ఉన్నాయి. మరి ఓటరు ఏ హామీలను నమ్ముతాడో.. ఎవరికి పట్టం కడతాడో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.