Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనంలోకి గారడీలొస్తున్నారు

జనంలోకి గారడీలొస్తున్నారు
, మంగళవారం, 7 అక్టోబరు 2008 (17:05 IST)
FileFILE
మాయ మర్మంలేదు... రండి బాబు... రండీ.. చెట్టుకు కాసులు కాస్తాయి. ఆలస్యం చేసిన ఆశాభంగం... చూపు మరల్చితే అద్భుత దృశ్యం దాటి పోతుంది. కాలు కదల్చితే శిలై పోతారు. ఇలా మాటలు చెప్పేది... లేనిది ఉన్నట్టు గానూ, ఉన్నది లేనట్టు గానూ చూపేదెవరో మీకూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇలా గారడీ చేసే వారు దారిన పోయే వారిని ఆకట్టుకుంటుంటారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇలాంటి వారు కొత్త రూపంలో పుట్టుకొస్తున్నారు. వారికీ వీరికీ సాధారణంగా పెద్ద తేడా ఉండదు. కాని ఉద్దేశ్యాలలో చాలా తేడా ఉంది. వారు పొట్ట కూటి కోసం జనానికి వినోదానిస్తూ నాలుగు రాళ్ళు సంపాదించుకుంటారు. కొత్తగా జనంపైకి వస్తున్న గారడీలు ఏకంగా రాష్ట్రాన్ని నట్టేముంచేందుకు పరుగులు తీస్తున్నారు.

రాష్ట్రంపైకి వచ్చే కొత్త గారడీలు ఎవరనేది ఇప్పటికే అర్థమై ఉంటుంది. మన నాయకులు ఓట్లడగడానికి ఇప్పటికే సిద్ధపడి పోయారు. ఒకరిపై ఒకరు పోటీ పడి వరాలు గుప్పిస్తున్నారు. అవి సాధ్యమా కాదా అనే ప్రశ్నకు వారు తావివివ్వడంలేదు. ఇప్పటికే కాంగ్రెస్ మెల్లగా యడా పెడా హామీలు గుప్పిస్తున్నారు. అంతా అధికారాన్ని చేజిక్కించుకోవడమే పరమావధిగా వైఎస్ తన పర్యటనలు సాగిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్నవారందరికీ తెల్లకార్డులు ప్రకటించారు.

మరోవైపు ఇప్పటికే ఆరోగ్యశ్రీ వరం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచిత విద్యుత్, రైతు బీమా వంటి కొత్త పాత పథకాల కలయికతో మరో మారు జనాన్ని ఆకట్టుకోవడానికి పరుగులు పెడుతున్నారు. వైఎస్ వరాలను తట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు కూడా అదే స్థాయిలో ముందుకు నడుస్తున్నాడు. ఉచిత విద్యుత్‌తో పాటు ఉచిత బియ్యాన్ని ప్రకటిస్తున్నారు. ఇలా ఖజానాను దివాళా తీయించే హామీలు కుమ్మరిస్తున్నారు.

ఇక చిరంజీవేమి తక్కువ తినలేదు. ఆయన స్పష్టమైన అజెండా లేకపోయినా జనాన్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామస్వరాజ్యం, అవినీతిపై యుద్ధం వంటి మాటలు చెపుతూ వస్తున్నారు. మరి వీటిలో ఏవి సాధ్యమవుతాయో వేచి చూడాల్సిందే. ఈ లోపు రాష్ట్రం నట్టేట మునగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఓటర్లపై ఉంది.

Share this Story:

Follow Webdunia telugu