Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికల సమరం: ప్రజారాజ్యం చరిత్ర సృష్టించేనా?

ఎన్నికల సమరం: ప్రజారాజ్యం చరిత్ర సృష్టించేనా?

Munibabu

రాష్ట్రంలో గత ఎన్నికల వరకు పోటీ అంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల మధ్యే ఉండేది. వామపక్షాలు, భారతీయ జనతా పార్టీలు కూడా బరిలో ఉన్నా రాష్ట్ర మొత్తం మీద తీసుకున్నప్పుడు వాటి ప్రభావం నామమాత్రమే. కానీ తాజా ఎన్నికల విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా మారిపోయింది.

తెలుగు వెండితెరపై దాదాపు మూడు దశాబ్దాలుగా తన సత్తా చాటి మెగాస్టార్‌గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో ప్రజలముందుకు రావడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికల పోటీ అంటే అది ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీల మధ్యే అనుకుంటున్న తరుణంలో ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలకు ఇప్పుడు పీఆర్పీ కనిపించే పరిస్థితి చోటు చేసుకుంది.

దీంతో 2009 ఎన్నికలకు వచ్చేసరికి రాష్ట్రంలో రాజకీయ పోటీ కాస్తా ద్విముఖం నుంచి త్రిముఖానికి మారిపోయింది. అదేసమయంలో కొత్తగా తెరమీదకు వచ్చిన ప్రజారాజ్యం వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని, ఆ పార్టీని ప్రజలు అస్సలు పట్టించుకోవడం లేదని కాంగ్రెస్, టీడీపీలు పైకి ఎన్ని ఢాంబికాలు పోతున్నా లోలోపల మాత్రం ఆ పార్టీల పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

ఎందుకంటే చిరంజీవికి ప్రజల్లో ఉన్న క్రేజ్ ఏపాటిదో రాష్ట్రంలోని చిన్న పిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. దానికి తోడు తాను రాజకీయ పార్టీ పెడుతున్నట్టు చిరంజీవి ప్రకటించిననాటి నుంచే రాష్ట్ర రాజకీయాలను శాసించగల మరో శక్తి వచ్చి చేరిందన్న సంగతి అందరికీ సుస్పష్టమైంది. అందుకే కాంగ్రెస్, టీడీపీల్లోని కాకలు తీరిన నేతలు సైతం పీఆర్పీ వైపు చూసే పరిస్థితి ఏర్పడింది. అందుకు నిదర్శనంగానే పీఆర్పీ ఆవిర్భావం నుంచే ఆ పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి.

ఈ పరిస్థితిని చూచే పీఆర్పీ అంటే మిగిలిన పార్టీల్లో ఓ విధమైన గుబులు ప్రారంభమైంది. దీనికితోడు ప్రారంభం నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా సీనియర్ పార్టీలకు ధీటుగా పీఆర్పీ సైతం మేనిఫెస్టో ప్రకటించడం మొదలుకుని, అభ్యర్థులను ప్రకటించడం, తమ పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లడంలాంటి కార్యక్రమాలను బాగానే చేస్తోంది. అంతేకాదు పైన చెప్పిన అంశాలను పూర్తిగా చక్కపెట్టడానికి అవసరమైన ఆర్థిక, అంగబలం సైతం పీఆర్పీకీ పుష్కలంగా ఉండడం గమనార్హం.

అభ్యర్థుల ఎంపిక విషయంలో డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చారని, డబ్బులు ఇచ్చినవారికే టికెట్లు కేటాయించారని ఆ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నా... కొన్ని కొన్ని స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు ధీటుగా పీఆర్పీ తన అభ్యర్థులను ప్రకటించడాన్ని ఏమాత్రం విస్మరించలేం. కొత్త రాజకీయ పార్టీగా అవతరించిన కొద్దిరోజుల్లోనే అన్ని రకాల అటంకాలను ఎదుర్కొంటూ ఎన్నికల బరిలో విజేతగా నిలిచేందుకు అవసరమైన అన్ని రకాల వ్యూహాలను రచిస్తూ ముందుకెళ్తున్న పీఆర్పీ రాష్ట్రంలోని సీనియర్ పార్టీలైన కాంగ్రెస్, టీడీపీలకు గట్టి పోటీ ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

అయితే ఇదంతా నాణేనికి ఓవైపు మాత్రమే. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే అధికారాన్ని కైవసం చేసుకున్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌లా తాజాగా పీఆర్పీని స్థాపించిన చిరంజీవి సైతం చరిత్ర సృష్టిస్తారా అంటే ఖచ్చితంగా అది అనుమానమే. ఎందుకంటే ఎన్టీఆర్ పార్టీ స్థాపించినపుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు. ఎలాంటి ప్రత్యామ్నాయం లేకుండా ఒకేఒక్క కాంగ్రెస్‌కే పట్టం కడుతూ విసిగిపోయిన ప్రజలకు ఆనాడు టీడీపీ ఓ ఆశాకిరణంలా కనిపించింది.

అలాగే ఆనాడు ఎన్టీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలు ప్రజలను విశేషంగా ఆకర్షించాయి. అంతేకాదు ఆనాడు రాజకీయంగా ప్రజలు అంతగా చైతన్యవంతులు కాదన్న విషయాన్ని విస్మరించలేం. కానీ నేడు పరిస్థితి పూర్తిగా వేరుగా ఉంది. 2004 ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిన వాగ్ధానాలను కొద్దో గొప్పో నెరవేర్చామన్న సంతృప్తితో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలముందుకు వెళ్తోంది. అంతేకాదు 2004 ఎన్నికల్లో అప్పటి అధికార టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్నంతటి వ్యతిరేకత నేడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కనిపించకపోవడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం.

అలాగే వామపక్షాలను, టీఆర్ఎస్‌ను కలుపుకుని మహాకూటమిగా ఈ ఎన్నికల్లో ప్రజలముందుకు వచ్చిన టీడీపీ ఎవరూ ఊహించని వాగ్ధానాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అదేసమయంలో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఅర్‌లాంటి నందమూరి వారసులు ఈసారి పార్టీ ప్రచారాన్ని నెత్తికెత్తుకోవడం ఈ ఎన్నికల్లో టీడీపీకి కలిసి వచ్చే అంశం.

ఇలాంటి తరుణంలో మేనిఫెస్టో ప్రకటనలోనూ, అభ్యర్ధుల ఎంపికలోనూ, ప్రచారపర్వంలోనూ కాంగ్రెస్, టీడీపీలకు ఏమాత్రం తగ్గకుండా ముందుకెళ్తున్న పీఆర్పీ అభిమానులనే కాకుండా ఓటర్లను కూడా ఆకట్టుకుంటుందా, ఎన్నికల బరిలో విజేతగా నిలవగలుగుతుందా అన్న విషయం తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడాల్సిందే. ఎందుకంటే ఎన్ని సర్వేలు వచ్చినా అవి ఎవరో కొందరి అభిప్రాయాలకు అద్దం పడుతాయే తప్ప అవసరమైన సమయంలో తన తీర్పుతో నేతల తలరాతను మార్చేయగల సామాన్య ఓటరు నాడిని మాత్రం అవి పట్టుకోలేవన్నది విస్మరించలేని నిజం.

అందుకే ఆ ఓటరు దేవుడు రాష్ట్రంలో ఈసారి కొత్తపార్టీని సాదరంగా ఆహ్వానిస్తాడో లేదా ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీతోనే సర్ధుకుపోతాడో లేక అప్పుడు చేయలేక పోయాం... ఈసారి మాత్రం తప్పకుండా చేస్తాం అని వాగ్ధానాలు గుప్పిస్తున్న పార్టీకి మళ్లీ ఛాన్సిస్తాడో ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే స్పష్టమవుతుంది మరి.

Share this Story:

Follow Webdunia telugu