Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్ర ప్రదేశ్‌లో కొంగ జపం

ఆంధ్ర ప్రదేశ్‌లో కొంగ జపం

పుత్తా యర్రం రెడ్డి

, గురువారం, 18 సెప్టెంబరు 2008 (13:07 IST)
కపట ప్రేమ
  పాపం...! నాయుకులకు ఒక్కసారిగా ఉన్నట్లుండి తెలంగాణ గుర్తుకొచ్చింది. అంతే ఆ ప్రాంతంపై ప్రేమ కుమ్మరించేశారు. తెలంగాణ ధీరోదాత్త గాథలను కొనియాడారు. అంతటి అనురాగాన్ని, ఆప్యాయతను చూసి తెలంగాణ ప్రజలు ఉబ్బితబ్బుబ్బయ్యారు.      
రాజకీయ పక్షాలు సమర వీరులను పొగడ్తలతో ముంచేత్తారు. పార్టీలన్నీ బుధవారం పోటీ పడి తెలంగాణపై కొంగ జపం చేశాయి. ఎందుకాని కాసేపు ఆలోచిస్తే... రానున్నది శాసనసభా ఎన్నికలని గుర్తొచ్చింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అన్ని పార్టీలు చలా బాగా వాడుకోవడానికి ప్రయత్నించాయి. తెలంగాణ పేరు చెపితే నాయకుల గుండెల్లో రైళ్ళు పరుగెడుతాయి. నోరు తెరిచి ఏ ఒక్క రవ్వ తేడాగా మాట్లాడినా ఆ నాయకుడి గడ్డు కాలం ఎదురైనట్లే. దానికి తోడు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో ఎన్నికలు రానున్నాయి. ఇది మన రాజకీయ నాయకులందరికి ఎరుకే.

ఇలాంటి పరిస్థితులలో సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినత్సవం రానే వచ్చింది. ఈ అవకాశాన్ని ఏ ఒక్క పార్టీ వదులుకోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి, నవ తెలంగాణ ప్రజా పార్టీ సహజంగానే ఆయా పార్టీల కార్యాలయాలపై జెండాలు ఎగురవేశారు. ఎక్కడ తేడా వచ్చినా ఓట్లును కోల్పోవలసి వస్తుందని మిగిలిన పార్టీలు వీరికి తీసిపోని విధంగా రంగంలోకి దిగి తెలంగాణ వీరగాథలను వల్లె వేశారు. ఆ ప్రాంతంపై విపరీతమైన ప్రేమను ఒలకబోశారు. ఎన్టీయార్ భవన్‌లో తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని జరిపింది. ఇందులో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులను పిలిపించి సన్మాన కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో మల్లు స్వరాజ్యం కూడా ఉన్నారు.

సమైఖ్య రాగంతో గత ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న చంద్రబాబు ఈ పర్యాయం ఆ ముద్రను చెరిపేసుకునేందుకు తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని వినియోగించుకోవడానికి ప్రయత్నించారు. ఇందులో భాగంగా భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమానికి మల్లు స్వరాజ్యం సన్మాన గ్రహీతగా విచ్చేశారు. తెలంగాణ సమరయోధుల పింఛన్ విషయంలో చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదంటూ విరుచుకు పడ్డారు.

ఇది చంద్రబాబుకు చేదు అనుభవమే అయినా తెలంగాణ విషయం కావడంతో మల్లు స్వరాజ్యం ఫ్రైర్‌బ్రాండ్ అంటూ కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నించారు. మళ్లీ తెలంగాణ సమరయోధులపై మొసలి కన్నీరు కార్చారు. ఇక ప్రజారాజ్యం పార్టీ నేత చిరంజీవి తక్కువ తినలేదు. మిగిలిన పార్టీలతో వెనుకబడిపోతామేమో అనే భయంతో తెలంగాణ సమరయోధులను పార్టీ కార్యాలయానికి పిలిపించి సన్మానాలపై సన్మానాలు చేశారు. నానా హంగామా చేశారు. తమ పార్టీ తెలంగాణ కోసం ఏమి చేయబోతుందో కూడా చెప్పారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు బండారు దత్తన్న మరో అడుగు ముందుకు వేశారు.

గాలిలో తేలిపోతున్నట్లు మాట్లాడే దత్తాత్రేయకు పెద్ద కష్టమే వచ్చింది. తెలంగాణకు సంబంధించిన ఒక గేయాన్ని అతి కష్టం మీద నేర్చుకున్నారు. తెలంగాణ దినోత్సవ కార్యక్రమంలో దానిని తన శైలిలో ఆలపించారు. ఆ గేయాన్ని తొలత ఆలపించిన వారు విని ఉంటే అక్కడ నుంచి పారిపోయే వారు. ఇదంతా దేనికోసం తెలంగాణ ఓట్ల కోసమే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ యువసేనను ప్రభుత్వ కార్యాలయాలపైకి పంపి జాతీయ జెండాను ఎగురవేయించారు. ఇలా తెలంగాణ ఓట్లను క్యాష్ చేసుకోవడానికే ప్రయత్నించారు. ఇక కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరిపారు. దాదాపు అన్ని పార్టీలకు ఉన్నట్లుండి తెలంగాణ సమరయోధులు గుర్తుకొచ్చారు. ఆగమేఘాలపై వారిని తమ కారులలో పిలిపించారు. తెలంగాణను క్యాష్ చేసుకోవడం కోసమే కొంగ జపం చేశారు. అయితే ఈ కొంగ జపానికి ఎన్ని తెలంగాణ ఓట్లు రాలుతాయో వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu