Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అందరి గుండెల్లో గుబులే...

అందరి గుండెల్లో గుబులే...
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2008 (18:41 IST)
తెలుగు రాజకీయాలు రంగు మార్చుకుంటున్నాయి. ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలల సమయం ఉన్నా రాష్ట్రంలోని నాయకులు కసరత్తులు చేస్తున్నారు. కార్యకర్తలు కత్తులు నూరతున్నారు. చిరుగాలి తగలడంతో రాజకీయం, రంగుల ప్రపంచం మరోమారు కలగలసి పోయాయి.

ఎంత కలగలసినా... ఎవరు వచ్చినా అధికారం కోసమేననేది స్పష్టం. అయితే ఈ పర్యాయం పరిస్థితులు ఎవ్వరికీ అంత సులువుగా లేవు. ఈ పరిస్థితులకు అన్ని పార్టీల నాయకులు జడుచుకుంటున్నారనడంలో అనుమానమూ లేదు. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.

మరి చిరంజీవికి రాష్ట్రమంతా అనుకూలంగా ఉందా అంటే అదీ కాదు. అంతకు మునుపు పార్టీలు రెండు వర్గాలగా విడిపోయి పోటీలకు తెగబడేవి. అయితే ప్రజారాజ్యంతో అది కాస్త మూడు వర్గాలు అయిపోయిందనడానికి ఏ మాత్రం సందేహ పడాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ నాయకుడు వారి విజయావకాశాలపై ఎంత గట్టిగా చెబితే ఆ పార్టీ అంతగా భయపడుతోందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అలాగే వారి గుండెల్లో అంత ఎక్కువగా గుబులు ఉందని అర్థం.

తెలుగుదేశం పరిస్థితిదే ధీనస్థితి. చాలా మంది టీడీపీ నాయకులు ప్రజారాజ్యం పార్టీలోకి ఇప్పటికే దాటుకున్నారు. అందులోనూ భూమా దంపతులు, తమ్మినేని, సీఆర్సీ వంటి వారు ఇలా.. గమనించండి వీరంతా నిన్నటి దాకా అక్కడ ప్రముఖ పాత్ర పోషించిన వారే. ఈ వలసలను ఆపడం ఎలాగాని చంద్రబాబుకు గుబులు పుట్టుకుంది. తన వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణను రంగంలోకి దింపుతున్నారు.

దీని ద్వారా సినీ గ్లామర్‌కూ వలసలకూ కొంతైనా అడ్డుకట్ట వేయవచ్చునన్నది.... ఆయన వ్యూహం. కాని ఎంతవరకూ ఫలితం ఇస్తుందనే దానిపై ఇంకా అనుమానమే. ఇక కాంగ్రెస్ విషయానికి రండీ ప్రతి పక్షాలన్నీ ఒక్కటయ్యాయి. తెలంగాణ పోరు ఉండనే ఉంది. ఇవన్నీ కాదనట్లు చిరంజీవి పొటుకు కొత్తగా వచ్చిపడింది. ఇవన్నీ ఉన్నా తాము చేసిన పనులు తమను కాపాడుతాయని కాంగ్రెస్ నాయకుల నమ్ముతున్నారు.

అయినా సరే... సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రామారావు దెబ్బ ఇప్పటికీ జ్ఞాపకముంది. అందుకే పైకెన్ని మాట్లాడినా లోపల అన్ని సర్వేలు జరుపుకుంటున్నారు. చిరంజీవిపై అంచనాలు వేస్తున్నారు. గుండె లబ్ డబ్ శబ్దం వారికే వినిపిస్తోంది. ఇక చిరంజీవి పూర్తి స్థాయి మెజారిటీని సాధిస్తామని పైకి చెపుతున్నా అది అంత సులువు కాదనేది వారికి సుస్పష్టం.

పార్టీలోకి పోలోమని వస్తున్న వారిలో చాలా మంది మాజీలే. వీరందరితో తయారయ్యే పార్టీ కప్పల మూటగా తయారవుతుందేమోననే భయం చిరంజీవికి లేకపోలేదు. ఈ కప్పల మూటను చేతపట్టుకుని తెలుగు రాజకీయ సముద్రాన్ని ఈదడం ఎలాగనీ తీరిక సమయంలో చిరంజీవి బుర్రగోక్కుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu