ఆంధ్రా రాజకీయాలు గతి తప్పినట్లు కనబడుతున్నాయి. అభివృద్ధి మాట అటుంచి ఓట్లను రాల్చుకునేందుకు ఆయా పార్టీలు ఉచిత వాగ్దానాలను ఇబ్బడిముబ్బడిగా ఇచ్చేస్తున్నాయి. అమలు మాట అటుంచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడమనే ధ్యేయంలో అభివృద్ధి, నిరుద్యోగం వంటి సమస్యలను అటకెక్కించి కేవలం ఉచితంగా ఇచ్చే ప్యాకేజీల గురించే ఊదరగొడుతున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఒక అడుగు ముందుకు వేసి ప్రతి బహిరంగ సభలోనూ, టీవీల కావల్సిన వాళ్లు, ఫ్రీ క్యాష్ కావల్సినవాళ్లూ చేతులెత్తండని అడిగి మరీ స్పందనను చూసుకుంటున్నాయి. ఇక కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు సైతం కాస్తో కూస్తో ఉచితం ప్రకటించేశాయి.
ఉచితం ప్యాకేజీలు చూసి ప్రజలు ఓటేస్తారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇప్పటికే పలుచోట్ల ఈ ఉచితంపై ప్రజలు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. ఉచిత నగదును ఎంతకాలం, ఎంతమందికి ఇలా పంచగలరని ప్రశ్నించుకోవడం కనబడుతోంది.
అసలు మీ ఓటెవరికీ అని ప్రశ్నిస్తే, రాష్ట్ర రాజకీయం అంతా తలకిందులుగా ఉందంటున్నారు. అసలు కొంతమందైతే అసలు ఓటు ఎవరికి వేయాలో అంతు చిక్కడం లేదని చెపుతున్నారు. ఓటర్ల అభిప్రాయం ప్రకారం చూస్తే, రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలుగు రాజకీయాన్ని తలకిందులుగా వేలాడదీసినట్లు వెల్లడవుతోంది. పాపం, మన తెలుగు రాజకీయానికి ఈ శీర్షాసనం ఎంత కాలమో... ఏమో.