Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేక మేడల్లా కూలిన "చిరు" గాలి మేడలు

పేక మేడల్లా కూలిన
తెలుగు చిత్రసీమ మెగాస్టార్ చిరంజీవి నిర్మించుకున్న గాలిమేడలు పేకమేడల్లా కూలిపోయాయి. మితిమీరిన ఆత్మ విశ్వాసమే ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పుట్టి ముంచింది. వెండి తెరపై మెగాస్టార్‌గా వెలుగొందిన చిరంజీవి రాష్ట్ర రాజకీయాల్లో పొలిటికల్‌ స్టార్‌గా ఎదగలేక పోయారు.

చిరంజీవి మెగా ఇమేజీకి ఎన్నికల్లో పెద్ద డామేజే వాటిల్లింది. 294 అసెంబ్లీ స్థానాలకు, 42 పార్లమెంటు స్థానాలకు పోటీచేసిన ప్రజారాజ్యంపార్టీ అభ్యర్థులు 40 స్థానాలకు పైగా డిపాజిట్లు సైతం దక్కించుకోలేకపోయారు. చావు తప్పి కన్నులొట్ట పోయినట్లు 18 సీట్లను గెలుచుకుని తృతీయ స్థానానికే పరిమితం అయింది. రెండు స్థానాల్లో పోటీ చేసిన చిరంజీవికి పాలకొల్లులో ఓటమి తప్పలేదు.

తిరుపతిలో మాత్రం విజయం సాధించి చిరంజీవి పరువు నిలుపు కోగలిగారు. పార్టీలో చిరంజీవి తర్వాత అన్నీ తానై చక్రం తిప్పుతూ వచ్చిన అల్లు అరవింద్‌ అనకాపల్లిలో ఘోర పరాజయం పాలయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి బాలారిస్టాలతో తప్పటడుగులు వేసిన ప్రజారాజ్యం.. ఎన్నికల్లో సైతం అదే తరహా తప్పులు చేసి, భారీ మూల్యం చెల్లించుకుంది.

ఫలితంగా ఓటర్లను ఆకట్టుకోలేక పోయింది. పార్టీ ఆవిర్భాంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన నాగబాబు పోలింగ్‌ సమయానికి కనుమరుగయ్యారు. ఆవేశంతో ఊగిపోతూ రెచ్చగొట్టే ప్రసంగాలతో ఓటర్లను ఆకర్షించిన యువరాజ్యం అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా చివరి అంకంలో అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యారు.

పార్టీలో తలపండిన రాజకీయ ఉద్దండులం అంటూ పైకి చెబుతూ వచ్చిన పర్వతనేని ఉపేంద్ర, శివశంకర్‌ వంటి ప్రముఖులకు ఎన్నికల ఫలితాలు చూశాక నోట పలుకులు లేకుండా పోయింది. తెలంగాణ వాదం పేరుతో పార్టీపెట్టి కొద్ది మాసా ల్లోనే దాన్ని ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసిన దేవేందర్‌గౌడ్‌ కూడా చిత్తు, చిత్తుగా ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీలోని వ్యవస్థాగత లోపాలు ఓటమికి కొంత కారణమైతే సీట్ల పంపిణీలో వచ్చిన ఆరోపణలు ఉన్న కొద్దిపాటి అవకాశాలకు కాలరాసింది.

కనీసం 160 అసెంబ్లీ సీట్లు సాధిస్తామని, 22 లోక్‌సభ స్థానాల్లోనూ తమదేనని తొలినుంచి ధీమా కనబర్చుతూ వచ్చిన చిరంజీవి అంచనాలు తలకిందులయ్యాయి. జాతీయ రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని, నాలుగో కూటమిలో సారథ్యం తమదే అంటూ ఊరిస్తూ వచ్చిన చిరంజీవి తీరా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి ఖంగుతిన్నారు. 42 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ ఒక్కచోట కూడా ప్రజారాజ్యం పార్టీ బోణీ చేయ లేకపోయింది.

Share this Story:

Follow Webdunia telugu