రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అనంతపురం సభతో పరోక్షంగా ఎన్నికల నగారా మోయించింది. అక్కడకు చేరుకున్న అశేష జనవాహిణిని సొమ్ము చేసుకోవడంపైనే వైఎస్ తన ప్రసంగాస్త్రాలను సంధించారు. జనాన్ని ఆకట్టుకోవడానికే ప్రయత్నించారు. నేరుగానే తెలుగుదేశంపై యుద్ధం ప్రకటించగా, ప్రజారాజ్యంపై పరోక్ష విమర్శలు చేశారు.
సోనియా రాయలసీమ పర్యటన సందర్భంగా అనంతపురం జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు వచ్చిన జనాన్ని చూసిన రాజశేఖర్ రెడ్డి తన సహజ ధోరణికి వచ్చేశారు. తన పంచెకట్టును సరిచేసుకుని మైకు ముందుకు వచ్చారు. అదే తరహాలో ఆయన ప్రసంగం సాగింది. మొదలు పెట్టిందే ఆలస్యంగా తెలుగు దేశంపై విమర్శలకు దిగారు.
పనికి ఆహారం పథకం కింద రైతులకు అందాల్సిన బియ్యాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ పార్టీ నాయకులు పందికొక్కుల్లా తినేశారని విరుచుకు పడ్డారు. కాంట్రాక్టర్లు బియ్యాన్ని మింగేశారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తమ హాయాంలో పందికొక్కులు, కాంట్రాక్టర్లు లేరని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చే లక్ష రూపాయల నష్ట పరిహారం కోసమే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని గతంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను విమర్శించారు. అదే సమయంలో రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను ఏకరవు పెట్టారు. మరిన్ని రైతు పథకాలను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్కు ప్రజల మద్దతు కావాలని కోరారు.
ఇక కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం పార్టీని, ఆ పార్టీ నేత చిరంజీవి పేరు నేరుగా చెప్పకుండానే విమర్శలు చేశారు. సినిమా వాళ్ళు వస్తున్నారని రాజకీయాలు సినిమాల్లో నటన కాదని బల్లగుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ విధంగా జనానికి రాబోవు ఎన్నికలను చెప్పకనే చెప్పారు.
అలాగే తమ అధినేత్రి సోనియా ప్రసంగంలో కూడా ప్రజల మద్దతు వచ్చేలా జాగ్రత్త పడ్డారు. ఆమె నోటితో మద్దతు అడిగించారు. మీకోసం యాత్ర ముగింపు సభ ఇక్కడే జరిగింది. ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావసభ కూడా రాయలసీమ నుంచే జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అనంతపురంలో ఏర్పాటు చేసిన సభకు భారీగా జన సమీకరణ చేశారు. ఇవన్నీ కాంగ్రెస్ కార్యకర్తలను ఉత్సాహ పరచడానికేననేది స్పష్టమవుతోంది. కాంగ్రెస్లో పరోక్షంగా ఎన్నికల నగారా మోగినట్లే.