ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు మరో 14 రోజుల సమయం ఉంది. నేతల గుండెల్లో మాత్రం రైళ్లు పరుగెడుతున్నాయి. విజయం తమదంటే.. తమదేనని ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. అయితే.. ఒక రాజకీయ పార్టీ విజయాన్ని శాసించే ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఈ దఫా చిరుగాలి బలంగా వీచినట్టు కిందిస్థాయి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.
ఈ రెండు జిల్లాల్లో 34 శాసనసభ స్థానాలు ఉన్నాయి. వీటిలో ప్రజారాజ్యం పార్టీకి కనీసం 25 సీట్లు దక్కుతాయని ఆ తీరం వాసులు చెపుతున్నారు. ఈ తీరంలో పీఆర్పీ గాలి వీయడానికి కారణాలు లేకపోలేదు. ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి ఈ జిల్లాలకు చెందిన వ్యక్తి కావటం, ఆయన సామాజిక వర్గం ఓట్లు ఈ రెండు జిల్లాల్లో అధికశాతం ఉండటం ప్రధాన కారణం.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఉభయ గోదావరిలో నష్టపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఖాతా తెరవక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
ప్రధానంగా ప్రభుత్వం ఏర్పాటులో ఉభయ గోదావరి జిల్లాల స్థానాలే కీలకం. దీంతో ఈసారి ఈ జిల్లాల పాత్ర ఏ మేరకు ఉంటుందనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ అంశంపైనే రెండు జిల్లాల్లోనూ జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి.
ఒక్క తూర్పు గోదావరి జిల్లా ఉన్న 19 సీట్లలో ప్రజారాజ్యానికి 10-12 అసెంబ్లీ సీట్లు పీఆర్పీ వశం కావడం ఖాయమని అంటున్నారు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఖచ్చితంగా తెలియాలంటే.. మరో 14 రోజులు వేచిచూడక తప్పదు.