ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం పోలీసుల నిఘా నీడలో ఉంది. పోలీసు శాఖ విధించిన కర్ఫ్యూ సోమవారం కూడా కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో ఎపుడు ఏం జరుగుతుందో జరుగుతుందోనన్న భయంతో ప్రాంత నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దాంతో చాలామంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు.
ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తలెత్తిన అల్లర్లు సద్దుమణగలేదు. భైంసా, కరీంనగర్ పట్టణాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలతో పాతనగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాలు నివసించే సున్నిత ప్రాంతాల్లో ప్రభుత్వం ముందస్తు చర్యగా పోలీసుల పహారాను ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, భైంసా సమీపంలోని వటోలీలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు సజీవ దహనమయ్యారు. ఆ కోవలోనే సోమవారం కూడా బాసరలో ఓ ఆటోను గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేశారు. దీనితో అదిలాబాద్ నిర్మల్‌లో 144 సెక్షన్‌ను విధిస్తూ పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. భైంసా సమీప ప్రాంతాల్లో వరంగల్ ఎస్పీ అనిల్ కుమార్, ఐజీ పూర్ణచంద్రరావు పెంట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.