ఎందుకు అర్ధరాత్రి ఇళ్ళకు వచ్చి అరెస్టులు చేస్తున్నారు? దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒక వినతిపత్రం ఇస్తామంటేనే ఇంత భయమా అని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయిన తెలుగుదేశం నాయకులు స్టేషన్లోనే తమ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమ మాట్లాడుతూ, తెలుగు యువత, తెలుగు మహిళ, టి యన్ ఎస్ ఎఫ్ నేతలు దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక్క రిప్రజెంటేషన్ ఇస్తానంటే ఎందుకు భయపడుతుంది ఈ ప్రభుత్వం? అని ప్రశ్నించారు. మా కార్యకర్తలు నిరసనకు పిలుపు ఇస్తే, ఎందుకు ముందస్తు అరెస్ట్ లు చేస్తున్నారు? ఎందుకు అర్ధరాత్రి ఇండ్లకు వచ్చి అరెస్ట్ చేస్తున్నారు?
చాలా అత్యుత్సాహంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, టి యన్ ఎస్ ఎఫ్ నాయకులు ప్రణవ్ గోపాల్ పై పోలీసులు చేయి చేసుకోవడం చూసామని, ఏ విధంగా రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందో అర్ధమవుతుందని, వాళ్ళను తీసుకెళ్లి ధర్డ్ డిగ్రీ ఉపయోగించి ఉంటారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు.
తిరుపతి పోలీసు కమిషనర్ వెంటనే తెలుగు యువత అధ్యక్షుడిని విడుదల చేయాలని, ఆదే విధంగా వివిధ పోలీస్ స్టేషన్ల లో అరెస్ట్ చేసిన తెలుగు యువత నాయకులను కూడా విడిచిపెట్టాలని డిమాండు చేశారు.