Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వేగం పెంచిన వైసిపీ - కలవరపడుతున్న తెదేపా

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన పనితీరులో వేగం పెంచడంతో అధికార తెలుగుదేశం పార్టీలో అలజడి ఆరంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు తన

వేగం పెంచిన వైసిపీ - కలవరపడుతున్న తెదేపా
, శనివారం, 18 ఫిబ్రవరి 2017 (12:17 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన పనితీరులో వేగం పెంచడంతో అధికార తెలుగుదేశం పార్టీలో అలజడి ఆరంభమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డితో పాటు తన పార్టీ యంత్రాంగం నిత్యం అధికారపార్టీ టిడిపీపై చేసే ఎదురుదాడికి సిఎం చంద్రబాబునాయుడుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 
 
గత నెలలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై విశాఖపట్నం ఆర్కే బీచ్‌‌లో విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి హాజరుకావడానికి విశాఖ ఎయిర్ పోర్ట్‌లో దిగడం, ప్రభుత్వం అడ్డుచెప్పడం, పోలీసులతో బలవంతంగా హైదరాబాద్‌కు తిప్పి పంపడంతో వైసిపి ప్రతిష్ట, జగన్మోహన్ రెడ్డి ప్రాబల్యం బాగా పెరిగింది.
 
ప్రజల నుంచి సానుభూతి ఎక్కువైంది. అప్పటివరకు నామమాత్రమైన కార్యక్రమాలతో ముందుకెళ్ళిన వైసీపీ విశాఖ పరిణామాలు అనంతరం ప్రజల నుంచి వచ్చిన సానుభూతి ప్రోత్సాహంతో వైఎస్ జగన్‌కు కొండంత బలం వచ్చినట్లైంది. దీనిపై సొంత వర్గాల ద్వారా రాష్ట్ర నలుమూలల నుంచి సమాచారం తెప్పించుకున్న జగన్ తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలుసుకున్నారు. దీంతో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, ప్రత్యేక హోదా అంశాన్ని విద్యార్థులు, యువజనులు, మేధావుల వరకూ తీసుకెళ్ళి వారిని భాగస్వామ్యులను చేసి తెలుగుదేశంపార్టీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలని నిర్ణయించుకున్నారు.
 
దీనిలో భాగంగానే గురువారం గుంటూరులో విద్యార్థులతో యువభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. యువభేరిలో పాల్గొన్న విద్యార్థులంతా ప్రత్యేక హోదా అంశంపై పూర్తి సంఘీభావం ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ, ఏపీలోని టీడీపీ ప్రభుత్వాలపై ప్రజలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోశారు. దీంతో వై.ఎస్.జగన్‌లో ఉత్సాహం రెట్టింపయింది. నిత్యం ప్రజల్లో ఉండడం, ప్రత్యేక హోదా అంశాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎలా నీరుగారుస్తుందో వివరించడం ద్వారా ప్రజల సానుభూతిని మరింత పొందడానికి జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగానే ముందుకెళుతున్నారు. 
 
దీంతో టిడిపి అధినేత నారాచంద్రబాబునాయుడు కలవరపడుతున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని కొట్టివేసిన సిఎం చంద్రబాబునాయుడు, వైసిపి నిర్వహించిన ప్రత్యేక హోదా ఉద్యమం అణచివేయడం ఎలా అనే అంశంపై వ్యూహం రూపొందిస్తున్నారు. అయితే ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. దీన్ని ప్రజల మనస్సుల నుంచి తొలగించడం ఇప్పట్లో అయ్యేపనికాదు. దీంతో ఎలా ఈ విషయాన్ని తిప్పికొట్టాలనే దానిపై ప్రత్యేక బృందాన్ని చంద్రబాబు రంగంలోకి దింపబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ఎందుకు సీరియస్ అవుతున్నారు!