ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మూడు రాజధానుల అంశం ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. దేశంలో అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేవలం ఒక్క రాజధాని మాత్రమేవుంది. ఈ రాష్ట్రంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు, 80 లోక్‌సభ సెగ్మెంట్లు ఉన్నాయి. అలాంటి రాష్ట్రానికి ఒక్క రాజధాని మాత్రమేవుంది. కానీ, 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ సీట్లున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గట్టిపట్టుదలతో ఉన్నారు. అయితే, ఆయన తీసుకున్న నిర్ణయం అమలు చేసేందుకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో మూడు రాజధానుల ఏర్పాటులో తమకెలాంటి సంబంధం లేదన కేంద్రం తేల్చి చెప్పింది. ఇపుడు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ కూడా తన మనసులోని మాటను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ అంత పెద్ద రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉందని, ఏపీ లాంటి చిన్న రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా? అంటూ ప్రశ్నించారు.
దీనిపై వైకాపా ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ, వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి రెండు ప్రాంతాల ప్రజల మనసులను గాయపరచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ప్రజస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలన్నారు. ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలను తాను స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
80 మంది ఎంపీలున్న యూపీ రాష్ట్రంలో ఒకే ఒక రాజధాని ఉన్నప్పుడు ఏపీకి మూడు రాజధానులు ఎందుకని రాం మాధవ్ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవాలని రఘురామ వైసీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీతో పోల్చితే నాలుగు రెట్లు అధికంగావున్న యూపీకి ఒకటే రాజధానిగా లక్నో ఉందని.. అయినా అక్కడి నుంచి పరిపాలన సాగడం లేదా అని రాంమాధవ్ ప్రశ్నించారని రాజు గుర్తుచేశారు.