ఏపీ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం ఒక సభాపతిగా నడుచుకోవడం లేదనే విమర్శలు ఆయన స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వెల్లువెత్తున్నాయి. కానీ, వాటిని ఆయన ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా, తాను మొదట వైకాపా కార్యకర్తనని, ఆ తర్వాత శాసనసభ స్పీకర్ అంటూ బాహాటంగానే ప్రకటిస్తూ వచ్చారు. అందుకే ఆయన ఫక్తు వైకాపా నేతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన తొగగొట్టారు. అదీకూడా వలంటీర్ల సమక్షంలో. వచ్చే ఎన్నికల్లో జగనన్నకే ఓటు వేస్తానని ఓ మహిళ తొడగొట్టి చెప్పిందని చెప్పారు. ఇపుడు తాను ఆమెను అనుకరిస్తూ తొడగొట్టి చెబుతున్నట్టు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో పార్టీ మండల అధ్యక్షుడు కె.గోవిందరావు అధ్యక్షతన శనివారం కన్వీనర్లు, వలంటీర్ల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న తమ్మినేని సీతారాం మాట్లాడుతూ, చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
యువతకు ఉద్యోగాలు ఇస్తానని, రైతులకు రుణమాఫీ చేస్తానని, నిరుద్యోగులకు భృతి ఇస్తానని చంద్రబాబు పలు హామీలు గుప్పించి ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. అందుకే గత ఎన్నికల్లో ఆయన్ను చిత్తుగా ఓడించారని చెప్పారు.
నారావారి పల్లెలో 2 ఎకరాల భూమి ఉన్న చంద్రబాబు ఇపుడు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యారని ప్రశ్నించారు. ఆయన వద్ద ఉన్న ఆ మంత్రదండాన్ని పేదలకు ఇస్తే రాష్ట్రంలో నిరుపేదలంటూ ఉండరని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే వలంటీరు వ్యవస్థను రద్దు చేస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, అందువల్ల వలంటీర్లు కలిసికట్టుగా ఉండి జగనన్నను గెలిపించాలని తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. పైగా, వలంటీర్లను ప్రభుత్వం త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తుందన్నారు.