అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి విచక్షణా రహితంగా దాడి చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యాలయంలో అనధికార హోదా అనుభవించాలని చూసిన సుదర్శన్ రెడ్డికి అడ్డు చెప్పినందుకే దళితుడైన ఎంపీడీవోపై దాడికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో నిందితుడు సుదర్శన్ రెడ్డిని ప్రజల ముందే చొక్కా పట్టుకుని పోలీసు అధికారి ఈడ్చుకెళ్లడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో వైఎస్సార్సీపీ మండలస్థాయి నేత సుదర్శన్ రెడ్డి గడిచిన ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ఇష్టారాజ్యంగా అధికారులను బెదిరించి పనులు చేయించుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ జిల్లా లీగల్ సెల్ విభాగం అధ్యక్షుడిగా పని చేశారు.
కాగా ఎంపీడీవోపై దాడి తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఎంపీడీవో కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయంలో కూర్చున్న సుదర్శన్ రెడ్డిని సీఐ కొండారెడ్డి చొక్కా పట్టుకుని లాక్కెళ్లి పోయారు. ప్రజలంతా చూస్తుండగా చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొట్టుకుంటూ వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని జీపులో లాక్కెళ్లి పోవడం జనం ఆసక్తిగా తిలకించారు.
పోలీసు అధికారులు ఇంత ధైర్యంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మొత్తం 20 మంది తనపై దాడి చేశారని బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిగిలిన వైఎస్సార్సీపీ శ్రేణుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.