ఏపీలోని అధికార వైకాపాకు నెల్లూరు జిల్లాలో మరో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి వైకాపాకు రాజీనామా చేశారు. గత 2014, 2019లో వైకాపా విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ఆయన.. గత పదేళ్లుగా పార్టీలో ఉన్నప్పటికీ ఆయన తగిన గుర్తింపు లభించలేదనన్న బాధ వుంది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం వైకాపాకు రాజీనామా చేశారు. పార్టీలో సరైన గుర్తింపు, మర్యాద లేనందునే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. కాగా, జిల్లాకు చెందిన అనేక రెడ్డి వర్గానికి చెందిన కీలక నేతలు వైకాపాను వీడి టీడీపీలో చేరిన విషయం తెల్సిందే. ముఖ్యంగా, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా అనేక మంది వైకాపా సీనియర్ నేతలు వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. వీరిలో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మినహా మిగిలిన వారంతా రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.