రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 2,434 వ్యాధులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత చికిత్స అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వర రావు (నాని) చెప్పారు. శుక్రవారం తన నివాసంలో మంత్రి కొడాలి నానిని గుడివాడ పట్టణం ధనియాల పేటకు చెందిన వృద్ధ దంపతులు కలిసి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించాలని కోరారు.
దీనిపై మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చని, ఎల్ వోసీ తీసుకువస్తే ప్రభుత్వం నుండి అనుమతులు ఇప్పిస్తానని చెప్పారు. కాగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు కేవలం 1,059 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చే నాటికి ఆరోగ్యశ్రీ తరపున నెట్ హాస్పిటల్స్ కు రూ.680 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడంతో పాటు గత ప్రభుత్వ బకాయిలను కూడా చెల్లించారని తెలిపారు. రాష్ట్రంలోని 1.42 కోట్ల కుటుంబాలను వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తీసుకువచ్చారన్నారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారన్నారు. రూ.వెయ్యి వైద్య ఖర్చు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ మొదట పశ్చిమగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేశారన్నారు.
గత జూన్ 16 నుండి కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు వర్తింపజేశారన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు కూడా విస్తరింపజేశారన్నారు. పోస్ట్ కోవిడ్ చికిత్సను కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చారన్నారు.
అలాగే సీఎం జగన్మోహనరెడ్డి ఆరోగ్యశ్రీ యాప్ ను తెలుగు, ఇంగ్లీష్ వెర్షన్లలో ఆవిష్కరించారని,
లబ్ధిదారులంతా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని తమ హెల్త్ రికార్డులను పరిశీలించుకోవాలన్నారు. గూగల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, ప్రతి ఒక్కరికీ సులువగా అర్ధమయ్యేలా యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు.
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో లబ్ధిదారులు ఎక్కడ చికిత్స పొందినా వారి హెల్త్ రికార్డులు, పూర్తి సమాచారం యాప్ లో అందుబాటులో ఉంటుందన్నారు. హెల్త్ రికార్డులను కూడా యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. అలాగే నెట్వర్క్ ఆసుపత్రుల జాబితా, వాటి చిరునామా, ఫోన్ నెంబర్లు, కోఆర్డినేటర్ల వివరాలు, ఆయా ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న చికిత్స వివరాలను కూడా యాప్ ద్వారా తెలుసుకోవచ్చని మంత్రి కొడాలి నాని వివరించారు.