ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె సునీతా రెడ్డి మరోసారి గళం విప్పారు. జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఇప్పటి వరకూ నిందితులను పట్టుకోలేదని ఆయన కుమార్తె సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ మేరకు శుక్రవారం ఢిల్లీలో సీబీఐ అధికారులను వైఎస్ సునీత కలిశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన తండ్రి హత్య గురించి వదిలేయమని తనకు చాలా మంది సలహా ఇచ్చారని సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, తన మనసు మాత్రం న్యాయం కోసం పోరాడమని చెబుతోందని స్పష్టం చేశారు. తన తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎంకు సోదరుడని.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా బాబాయ్ అని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా తనకు న్యాయం జరగడం లేదని వాపోయారు.
తన తండ్రి హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదని సునీత ఆరోపించారు. సొంత కుటుంబానికి చెందిన తమకే న్యాయం జరగకపోతే సామాన్యుడి పరిస్థితేంటని ఆమె ప్రశ్నించారు. తన తండ్రి హత్య కేసుపై సరిగా విచారణ జరగట్లేదని ఆరోపించారు. న్యాయం కోసం ఇంకెంతకాలం వేచిచూడాలని నిలదీశారు. తన తండ్రిని హత్య చేసింది ఎవరో అందరికీ తెలియాల్సిందేనని తేల్చి చెప్పారు.